టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుళ్లు జోక్ చెప్పారు. నవ్వించడం సంగతేమో గానీ, తాను నవ్వులపాలువుతున్నారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే ఓటర్లకు డబ్బులిస్తారట, ఆ సొమ్ముకు లొంగేది లేదని ప్రజలు చెప్పాలట! ఓటర్లకు డబ్బు పంచని వాళ్లెవరైనా ఈ మాట అంటే గౌరవం కలుగుతుంది. రాజకీయాలను పూర్తిగా పొల్యూట్ చేసిన చంద్రబాబు నీతులు చెప్పడం ఏం బాగోలేదబ్బా!
రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటుకు రూ.10 వేలు ఇస్తే మీరేం చెస్తారని చంద్రబాబు జనాన్ని ప్రశ్నించారు. మళ్లీ ఆయనే డబ్బులకు లొంగే ప్రసక్తే లేదని జగన్‌రెడ్డికి గట్టిగా వినిపించేలా చెప్పాలని కోరడం… ఎబ్బెట్టుగా లేదు.
రాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ అని గొప్పగా చెప్పే చంద్రబాబు… ఏ ఎన్నికల్లో అయినా డబ్బు పంపిణీ చేయని దాఖలాలున్నాయా? ఓటుకు నోటు ఇప్పిస్తూ… తెలంగాణ ప్రభుత్వానికి చిక్కి, రాత్రికి ఆంధ్రాకు తరలిరావడం చంద్రబాబు మరిచినట్టున్నారు. కానీ జనానికి మతిమరుపు లేదని చంద్రబాబు గ్రహించాలి.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పసుపు-కుంకుమ కింద మహిళలకు రూ.10 వేలు ఇచ్చినా, ఓట్లు వేయకపోవడం గుర్తొచ్చి, చంద్రబాబు తాజాగా ఓట్లకు డబ్బు పంపిణీపై మాట్లాడినట్టున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్లకు డబ్బు, ఇతరత్రా విలువైన వస్తువులు, మద్యం పంపిణీ తదితర వాటిపై ఏ నాయకుడు మాట్లాడకపోవడం మంచిది. ఎందుకంటే అందరూ అదే పని చేస్తున్నారు. ఇది జనానికి బాగా తెలుసు.
అదేదో ఓటర్లను ప్రలోభ పెట్టడం కేవలం వైసీపీకి, మరొక పార్టీకే పరిమితం అన్నట్టు చంద్రబాబు నీతులు చెప్పడం సొంత వాళ్లకు కూడా నచ్చదు. అంతోఇంతో జనసేన నాయకులు ఓటర్లకు డబ్బులు పంచలేదంటే నమ్మొచ్చు. అందుకే పవన్‌కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారనేది వాస్తవం.
నీతివంతమైన రాజకీయాలు చేస్తే ఇలాగే వుంటుంది మరి. జగన్ ఓటుకు రూ.10 వేలు పంచడం సంగతి సరే, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రలోభ పెట్టనని చంద్రబాబు హామీ ఇవ్వగలరా? చిత్తశుద్ధి లేని మాటలు నోటికి పని చేటని బాబు గ్రహిస్తే మంచిది.