తెలంగాణ రాజకీయం కలగాపులగంగా మారింది! అసెంబ్లీ ఎన్నికల వేళ ఎవరి మీద ఎవరు కత్తులు దూసుకుంటున్నారనేది సామాన్యుడికి అంతుబట్టని అంశంగా మారింది! రాజకీయ ముఖ చిత్రంపై తెలంగాణ ఎన్నికలు మొన్నటి వరకూ మూడు పార్టీల పోరు! అయితే.. ఇప్పుడు ఏ ముఖంతో ఏ ముఖం పోటీ పడుతుందో అర్థం కాని అంశం అయ్యింది.
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఈ మూడు పార్టీలూ పైకైతే అధికారం కోసం పోరాడుతున్నాయి. కనీసం పోరాడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి! అయితే బీజేపీ నేతలు కొందరు చేసిన ప్రకటనలు అయితే.. ఇంతకీ బీఆర్ఎస్ పై బీజేపీకి పూర్తి స్థాయిలో రాజకీయ వైరం అయినా ఉందా! అనే అనుమానాలు కలిగిస్తాయి! కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ మేలు అంటూ బీజేపీ నేతలు కొందరు చేసిన ప్రకటలు విస్మయకరమైన అంశాలే!.
మేం గెలవకున్నా ఫర్వాలేదు కాంగ్రెస్ గెలవకుంటే చాలు.. అని బీజేపీ అనుకుంటున్నట్టుగా ఉంది! మరి మొన్నటి వరకూ అధికారం తమదే అన్నట్టుగా పోరాడుతున్నట్టుగా కనిపించిన కమలం పార్టీ, మాకు అవకాశం ఇవ్వకపోయినా ఫర్వాలేదు కాంగ్రెస్ కు మాత్రం ఇవ్వొద్దు, కావాలంటే బీఆర్ఎస్ కు ఇంకో చాన్స్ ఇవ్వండన్నట్టుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. కీలక దశలో ఎన్నికల పోరులో బీజేపీ వెనుకపడటం ఇందుకు కారణాల్లో ఒకటి!
ఇక కాంగ్రెస్ పార్టీలో అయితే ఎవరు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో, ఎవరు ఎవరిని ఓడించాలని ఆకాంక్షిస్తున్నారో ఎవ్వరికీ తెలీదు! కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు ఎంతమందో ఎవ్వరూ అంచనా వేయలేరు! కాంగ్రెస్ పార్టీకి మినిమం మెజారిటీ రాకపోతే.. కాంగ్రెస్ తరఫున గెలిచే ఎమ్మెల్యేల్లో ఎంతమంది రాత్రికి రాత్రి టీఆర్ఎస్ పంచన చేరతారో అంచనాలకు అందనిది!
కనీస మెజారిటీ దక్కకపోతే కాంగ్రెస్ నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేలను గుంజేసుకోగలడు అనేది అందరికీ తెలిసిన అంశమే! 2014, 2019లలో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మంది టీఆర్ఎస్ లోకి చేరిపోయారు! అలాంటిది రేపు అధికారం అందకపోతే గెలిచిన వాళ్లు మళ్లీ అదే బాటే పడతారనడంలో ఆశ్చర్యం లేదు! కాంగ్రెస్ పార్టీకి అయితే అధికారాన్ని అందుకోవాలనే ఉంది. మాకే ఓటు వేయండి అని ఆ పార్టీ అంటోంది. మాకు కాకపోతే.. అనేమాట మాత్రం ఆ పార్టీ నుంచి లేదు! అయితే కాంగ్రెస్ లో అంతర్గత శతృత్వాలు చాలా చాలా ఎక్కువ!
ఇక తెలంగాణలో పోటీలో లేము అని టీడీపీ ప్రకటించినా.. తనకు ఉన్న కొద్దో గొప్పో క్యాస్ట్ ఓట్లను అయినా ఎటో ఒకవైపు మళ్లించడానికి ఆ పార్టీ నాయకత్వం తాపత్రయపడుతోందని వేరే చెప్పనక్కర్లేదు! మరి ఆ మధ్య చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీకి బేషరతు మద్దతు పలికారు.
మోడీని తెగ ప్రశంసించారు. మోడీని గతంలో తిట్టరాని తిట్లు కూడా తిట్టిన చంద్రబాబు నాయుడు కమలం పార్టీ పంచన చేరడానికి చాలా ప్రయత్నాలే చేశారు. మరి ఇప్పుడు తెలంగాణలో కమలం పార్టీకి చంద్రబాబు నాయుడు బేషరతు మద్దతు పలికి ఉండాల్సింది. అయితే చంద్రబాబు కు కావాల్సింది బీజేపీ గెలుపు కాదు! తన శిష్యరత్నం రేవంత్ రెడ్డి మీద ఆయన ఆశలున్నాయి. చంద్రబాబు కుల కమిటీలు కూడా కాంగ్రెస్ ను గెలవాలనే ఆకాంక్షతో ఉన్నాయి. టీఆర్ఎస్ పై వారికి పీకల్లోతు కోపం ఉంది. బీజేపీ మీదే అదే కోపం ఉంది, చంద్రబాబును దరికి చేర్చుకోలేదని!
ఇక చంద్రబాబుకు ఏపీలో దోస్తు అయిన పవన్ కల్యాణ్ మాత్రం తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు! బీజేపీ చెప్పిన వారికి టికెట్లను కేటాయించి వారి మెడలో జనసేన కండువా వేశారు పవన్ కల్యాణ్. చంద్రబాబుకేమో కాంగ్రెస్ గెలవాలని ఉంటే, ఆయన దత్తపుత్రరత్నం పవన్ బీజేపీకి మద్దతు! ఇలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ, ఎవరికి ఎవరు మితృడు, ఎవరికి ఎవరు శతృవో సామాన్యుడికి బోధపడే అంశం కాని రీతిలో ఉంది పరిస్థితి!