వైకాపా లోకి కొణతాల రామకృష్ణ!

కొణతాల రామకృష్ణ, విశాఖ జిల్లాలో వివాద రహిత నాయకుడు. సౌమ్యుడు. వైఎస్ హయాంలో మంత్రిగా చేసారు. జగన్ పార్టీ పెట్టిన కొత్తలో అతని వెన్నెంటి వున్నారు. కానీ ఒక్క పని వల్ల వైఎస్ జగన్…

కొణతాల రామకృష్ణ, విశాఖ జిల్లాలో వివాద రహిత నాయకుడు. సౌమ్యుడు. వైఎస్ హయాంలో మంత్రిగా చేసారు. జగన్ పార్టీ పెట్టిన కొత్తలో అతని వెన్నెంటి వున్నారు. కానీ ఒక్క పని వల్ల వైఎస్ జగన్ కు దూరం అయ్యారు.

జగన్ తల్లి విజయమ్మను విశాఖలో పోటీ పెట్టడానికి కారణం రామకృష్ణే. తాను గెలిపించి తెస్తా అని చెప్పి వచ్చారు. కానీ విశాఖలో వున్న కమ్మ సామాజిక వర్గం దాటికి, దాని ఎత్తుగడలకు రామకృష్ణ తట్టుకోలేకపోయారు. కడప రౌడీలు దిగారు. విశాఖ కూడా కడప లా బాంబుల గడపగా మారిపోతుంది ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగించారు. దాంతో జనాలు ఆ ప్రచారాలు అన్నీ నమ్మి విజయమ్మను పక్కన పెట్టారు. కానీ ఆ నింద అంతా రామకృష్ణ మీదకు వెళ్లిపోయింది. కొణతాల రామకృష్ణ తన తల్లిని విశాఖ నుంచి పోటీకి నిలిపినందునే ఓటమి రూపంలో అవమానం ఎదురైందని జగన్ భావించి పక్కన పెట్టారు.

అప్పటి నుంచి కొణతాల యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా వుంటూ వచ్చారు. భాజపాలోకి వెళ్తారని గతంలో వార్తలు వినిపించాయి కానీ వెళ్లలేదు. అసలు ఏ పార్టీలో వున్నారు అన్నదే తెలియకుండా, తెరవెనుక వుండిపోయారు. ఇప్పుడు మళ్లీ కొణతాలకు మంచి రోజులు వస్తున్నట్లున్నాయి. అనకాపల్లి ఎంపీ స్థానానికి కొణతాల రామకృష్ణ ను బరిలోకి దింపాలని వైకాపా అధినేత జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొణతాల రామకృష్ణ కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

అయితే కొణతాల రామకృష్ణ పోటీకి సుముఖంగా వున్నారా? లేదా ? అన్నది తెలియదు. ప్రస్తుతం కొణతాల ఆరోగ్యం కూడా మరీ గొప్పగా లేదు. అయితే పోటీ చేయాలనే అనుకుంటున్నారని కానీ అది వైకాపా తరపునా? లేక మరే ఉద్దేశం అయినా వుందా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. తెలుగుదేశం తరపున అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. గుడివాడ అమర్ నాధ్ తానే వైకాపాఅభ్యర్థిగా వుంటానని ఢంకా భజాయిస్తున్నారు.

దాడి వీరభద్రరావు, అతని తనయుడు రత్నాకర్ మౌనంగా వున్నారు. వైకాపాలో వారి శకం ముగిసినట్లే అని వార్తలు వినిపిస్తున్నాయి.ఇలాంటి టైమ్ లో గవర కులానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకే కొణతాల రామకృష్ణ ను తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.