టీడీపీ, జనసేన అధినేతల్లో అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది. సీఎం పీఠం మీద నుంచి జగన్ ఎప్పుడు తప్పుకుంటారా? అని ఎదురు చూస్తున్నారు. జనసేన, టీడీపీ వేర్వేరు పార్టీలు. ఆ రెండింటికి వేర్వేరు అధిపతులు. కానీ ఇద్దరి టార్గెట్ జగనే. బాబు, పవన్ నినాదాలు ఒక్కటే. వైఎస్ జగన్‌ను తరిమి కొట్టాలనేదే వారి లక్ష్యం. ఒకే ఎజెండాతో వేర్వేరు ముసుగుల్లో వస్తున్న ఆ నాయకుల్ని జనం నమ్ముతారా? అధికారం సిద్ధిస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
తాజాగా టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు ఆవేశంతో ఊగిపోయారు. పోలీసులు లేకుండా వస్తే వైసీపీనో, టీడీపీనో తేల్చుకుందామని సవాల్ విసిరారు. న్యాయ బద్ధంగా, రాజకీయంగా పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఇదే రీతిలో ఇటీవల పవన్‌కల్యాణ్ కూడా కొత్త నినాదాన్ని నెత్తికెత్తుకున్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటూ ఆయన జగన్‌ను టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే. అయితే 2024 ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్య. అధికారంలోకి వస్తే టీడీపీకి మనుగడ ఉంటుంది. లేదంటే ఆ పార్టీ ప్లేస్‌ను భర్తీ చేసేందుకు బీజేపీ గుంటనక్కలా పొంచుకుని వుంది. అందుకే ఈ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
అయితే జగన్‌ను గద్దె దించడం చంద్రబాబుకు సులువు కాదు. ఆ విషయం ఆయనకు బాగా తెలుసు. అధికారాన్ని చేజేతులా అప్పగించడానికి జగన్ సిద్ధంగా లేరు. చావోరేవో అని తలపడడం జగన్‌కు కొత్తేమీ కాదు. వైసీపీని స్థాపించినప్పటి నుంచి జగన్ పోరాటాన్ని చూస్తున్న వాళ్లెవరైనా ఆయన్ను తక్కువగా అంచనా వేయరు. 2019లో చంద్రబాబు తక్కువ అంచనా వేయడం వల్లే భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు.
పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే …తాను అధికారంలోకి రాకపోయినా సరే, జగన్‌ను మాత్రం గద్దె దించాలనేది పంతం. అయితే వ్యక్తిగత పంతాలు, పట్టింపుల కోసం ప్రజలు ఆదరిస్తారనుకోవడం అజ్ఞానమే. పవన్‌కల్యాణ్ తన అజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించడమే ఆయనకు మైనస్ అయ్యింది. కేవలం జగన్‌ను గద్దె దించడం కోసమే అయితే టీడీపీ, జనసేనను ఎందుకు ఆదరించాలనే ప్రశ్న లేకపోలేదు. ఎందుకంటే 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు సాగించిన అద్భుత ప్రజారంజక పాలన గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.
వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకున్న నాయకుడు, అలాగే వారిలో కొందరికి మంత్రి పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రి కూడా నేడు ప్రజాస్వామ్యం గురించి నీతిసూత్రాలు చెబుతుంటే వినాల్సి వస్తోంది. ఇలా ఒకటా, రెండా… చంద్రబాబు ఘనత వహించిన పాలన గురించి చెప్పాలంటే? ఎంత అద్భుతమైన పాలన సాగించారో తెలుసుకోవాలంటే గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అధ్యయనం చేస్తే సరి. 2019లో 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను గెలిపించిన ప్రజలకు నీతులు చెప్పడం అంటే తాతకు దగ్గు నేర్పించిన చందమవుతుంది.
జగన్ క్విట్, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదాలు వినసొంపుగా ఉన్నాయి. కానీ ఆ పిలుపునిస్తున్న వాళ్ల నిజాయతీనే అవరోధంగా మారింది. మాటల కంటే చేతలే జనానికి కావాల్సింది. జగన్ కంటే గొప్పగా పరిపాలన సాగిస్తామంటే ప్రజలు వద్దంటారా? ఇవాళ పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇస్తున్న వాళ్ల పాలనతో విసిగిపోయే కదా జగన్‌ను ఎన్నుకుంది. ఆకర్షణీయ నినాదాలు ఓట్లు రాలుస్తాయా? అంటే అనుమానమే అని చెప్పాలి. క్విట్ ఎవరవుతారనేది ప్రజల్లో చేతల్లో వుంది. కానీ క్విట్ అనేది మాత్రం తప్పక వేడి రగుల్చుతుంది.