టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి యూటర్న్ తీసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. బీజేపీతో పొత్తుపై చంద్రబాబు వెంపర్లాడడం భూమరాంగ్ అయ్యింది. బీజేపీ నేతలు ఛీత్కరిస్తుంటే, ఆత్మాభిమానం లేకుండా చంద్రబాబు దిగజారి ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన పొత్తులపై యూటర్న్ తీసుకున్నారు.
టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కోసం అవసరాన్ని బట్టి సమయానుకూలంగా పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఇంత వరకూ తానెప్పుడూ పొత్తుల గురించి మాట్లాడలేదని చంద్రబాబు చెప్పడం విమర్శలకు దారి తీసింది.
పొత్తులపై పలు సందర్భాల్లో చంద్రబాబు పరోక్ష సంకేతాలు ఇచ్చిన విషయాన్ని బీజేపీ, జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబును భుజాన మోసే ఎల్లో మీడియా బీజేపీ, జనసేనతో టీడీపీకి పొత్తు ఖాయమైందంటూ ఊదరగొట్టడం వెనుక టీడీపీ పెద్దల హస్తం లేదా? అని ఆ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.
పవన్‌తో టీడీపీది ఒన్‌సైడ్ లవ్ అని, అటు వైపు సానుకూలత వస్తే కదా? అని చంద్రబాబు ప్రశ్నించడం దేనికి నిదర్శనమని జనసేన నేతలు నిలదీస్తున్నారు. అలాగే జగన్‌ను గద్దె దించడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రావాలని, దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందని బాబు అన్న మాటల అర్థం పరమార్థం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీలో మోదీతో కరచాలనం చేయగానే. ఏపీలో పొత్తు కుదురిందనే వార్త కథనాల ప్రసారం వెనుక కారణం ఏంటో చెప్పాలని జనసేన, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ వ్యూహాలన్నీ భూమరాంగ్ కావడంతో చంద్రబాబు తాజాగా యూటర్న్ తీసుకున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఏదీ నేరుగా మాట్లాడరని, తన ఎల్లో మీడియా ద్వారా అన్నీ చెప్పించడం వాస్తవం కాదా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
చంద్రబాబును అందరూ దూరం పెడుతుండడంతో కిందపడ్డా అదో లగువు అన్నట్టు ఇప్పుడు ప్లేటు ఫిరాయిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.