రాష్ట్ర రాజకీయ వేడి ఎక్కడా తగ్గడం లేదు. చూస్తుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు రాజకీయ పార్టీలు ఎన్నికలకు ఇప్పటి నుండే సిద్ధం అవుతున్నట్లు కనపడుతోంది. త్వరలో రాబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్ధులను ప్రకటించారు.
చంద్రబాబు ఇంత తొందరగా ఎన్నికల బరిలోకి వెళ్లడం బహుశ ఇదే మొదటిసారి ఎందుకంటే ఎన్నో సర్వేలు, అనుకూల మీడియా రిపోర్టులు తీసుకున్నా తర్వాతే అభ్యర్ధులను ప్రకటించడం పరిపాటిగా ఉండేది. రాష్ట్రంలో జరగబోయే మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానాలకు గాను.. పశ్చిమ రాయలసీమ అభ్యర్ధిగా భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి, తూర్పు రాయలసీమ అభ్యర్ధిగా కంచర్ల శ్రీకాంత్ లను నియమించారు. విశాఖ అభ్యర్ధిని త్వరలోనే ఖరారు చేస్తామని చంద్రబాబు తెలిపారు.
ఇప్పటి నుండే ఎన్నికల బరిలో ఓట్ల వేటలో ఉండాలంటూ, ప్రతి నియోజకవర్గ ఇంచార్జ్ లు తప్పకుండా నియోజకవర్గంలో ఉండి టీడీపీ గెలుపుకోసం శ్రమించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకులకు సూచించారు. వైసీపీ, వైసీపీ మీడియా వార్తలను టీడీపీ సోషల్ మీడియా తిప్పి కొట్టాలన్నారు.
ఇప్పటి నుండి వచ్చే ప్రతి ఎన్నికలోను టీడీపీ గెలవాలని చెప్పినప్పుడు మరి వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఎందుకు ప్రామాణికంగా తీసుకోకూడదు అనేది చంద్రబాబుకే తెలియాలి. గెలిస్తే ఒక విధంగా గెలవకపోతే ఒక విధంగా మాట్లాడే చంద్రబాబు మాటలను నియోజకవర్గ టీడీపీ నాయకులు కూడా లైట్ తీసుకుంటారు.