తెలంగాణ విజేత ఎవ‌రు?

స‌రిగ్గా ఏడాది కింద‌ట తెలంగాణ రాజ‌కీయ ముఖ చిత్రానికి, ప్ర‌స్తుత రాజ‌కీయ చిత్రానికీ చాలా తేడా అయితే క‌నిపిస్తూ ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ కు గ‌ట్టిగా 20 రోజుల్లోపు స‌మ‌య‌మే ఉంది.…

స‌రిగ్గా ఏడాది కింద‌ట తెలంగాణ రాజ‌కీయ ముఖ చిత్రానికి, ప్ర‌స్తుత రాజ‌కీయ చిత్రానికీ చాలా తేడా అయితే క‌నిపిస్తూ ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ కు గ‌ట్టిగా 20 రోజుల్లోపు స‌మ‌య‌మే ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో.. తెలంగాణ బ‌రిలో ఈ సారి గెలిచి నిలిచేదెవ‌ర‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది! తెలంగాణ రాజ‌కీయం గురించి మాట్లాడుకుంటే.. ముందుగా నోట్ చేయాల్సిన అంశం, కేసీఆర్ ను త‌క్కువ అంచ‌నా వేయ‌కూడ‌ద‌నేది!

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌ప్పుడు కేసీఆర్ ను కాస్త త‌క్కువ అంచ‌నా వేసిన వారు వ‌చ్చిన ఫ‌లితాల‌తో షాక్ అయ్యారు! తెలంగాణ ప్ర‌జ‌ల ఎమోష‌న్స్ ను ట‌చ్ చేయ‌గ‌ల రాజ‌కీయ ధీరుడ‌నే పేరుంది కేసీఆర్ కు. ఆ ధీర‌త్వంతోనే కేసీఆర్ వ‌ర‌స‌గా రెండు సార్లు ఎన్నిక‌ల్లో నెగ్గ‌గ‌లిగారు. రెండోసారి ద‌క్కిన విజ‌యం మ‌రింత ఘ‌న‌మైన‌ద‌నేది వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు! అయితే అప్పుడు కేసీఆర్ కు మేలు చేసింది ఆయ‌న వాగ్ధాటి క‌న్నా.. చంద్ర‌బాబు నాయుడు అనే విశ్లేష‌ణ లేక‌పోలేదు. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు తో దోస్తీ చేసి కాంగ్రెస్ పార్టీ త‌న పుట్టిని త‌నే ముంచుకుంద‌నేది ఎన్నిక‌ల‌య్యాకా బ‌లంగా వినిపించిన విశ్లేష‌ణ‌! 

ఒక‌వేళ చంద్ర‌బాబుతో పొత్తు పెట్టుకోక‌పోయి ఉంటే.. కాంగ్రెస్ కు మరీ అంత దుర్గ‌తి ప‌ట్టేది కాద‌ని అనేక మంది అభిప్రాయ‌ప‌డ్డారు! మ‌రి ఇప్పుడు ఒక‌ర‌కంగా చూస్తే చంద్ర‌బాబు పీడ కాంగ్రెస్ కు లేన‌ట్టే! కమ్మ వాళ్ల బేష‌ర‌తు మ‌ద్ద‌తు వంటివి కాంగ్రెస్ కు లాభం క‌న్నా చేసే న‌ష్టం ఎక్కువ అయి ఉండొచ్చు. రేవంత్ కు చంద్ర‌బాబు మ‌నిషి అనే ముద్ర చెర‌గ‌నిదీ కావొచ్చు! అయిన‌ప్ప‌టికీ.. గ‌త ఎన్నిక‌ల స్థాయిలో కాంగ్రెస్ కు చంద్ర‌బాబు చేటు ఉండ‌క‌పోవ‌చ్చు ఈ సారి.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త అనే అంశం గురించి మాట్లాడితే.. తెలంగాణ‌లో వేగంగా వ్యాపించేది ఇది. ఉమ్మ‌డి ఏపీ చ‌రిత్ర‌ను చూసినా.. తెలంగాణ‌లోనే తొంద‌ర‌గా ఏదైనా ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేక‌త వ్యాపిస్తుంది. అయితే కేసీఆర్ తొలి ట‌ర్మ్  త‌ర్వాత మ‌రింత ఘ‌న‌మైన విజ‌యం సాధించారు. కానీ.. రెండో ట‌ర్మ్ లెక్క వేరు! అప్పుడు చంద్ర‌బాబు కాంగ్రెస్ రాజ‌కీయాల్లోకి చొర‌బ‌డ‌టం కేసీఆర్ కు క‌లిసొచ్చింది. ఇప్పుడు కేసీఆర్ రెండు ట‌ర్మ్ ల ప్ర‌జావ్య‌తిరేక‌త‌నూ ఎదుర్కొనాల్సి ఉంటుంది. అదే స్థాయిలో ఉంది? అనేదే ప్ర‌శ్నార్థ‌కం! 

ఒక‌వేళ కేసీఆర్ సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల ప్ర‌జా వ్య‌తిరేక‌త ప్ర‌బ‌ల‌క‌పోతే  లేదా ఆయ‌న‌కు ఉన్న తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌క‌ర్త ఇమేజ్ ఇప్ప‌టికీ చెరిగిపోక‌పోతే .. ప్ర‌జా వ్య‌తిరేక‌త అనేది చెప్పుకోవాల్సిన అంశం ఏమీ కాదు! అయితే తెలంగాణ ఇచ్చింది తామేన‌ని కాంగ్రెస్ ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు స‌రిగా చెప్పుకోలేక‌పోతోంది. ఏపీలో పార్టీని ప‌ణంగా పెట్టి మ‌రీ తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌రిచామ‌ని కాంగ్రెస్ క‌మ్యూనికేట్ చేయ‌లేక‌పోతోంది! అయినా ఇప్పుడు తెలంగాణ పోరాటం అనే పాయింట్ ను ఆధారంగా చేసుకుని ఓటేసే ప‌రిస్థితి ఉంటుందా? అనేది కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే! ప‌దేళ్లు గ‌డిచిపోతున్న నేప‌థ్యంలో.. ఆ అంశాన్ని కాకుండా పాల‌న‌నే బేరీజు వేసుకుని ప్ర‌జ‌లు ఓటేసే అవ‌కాశాలు ఎక్కువ‌!

కాంగ్రెస్ పార్టీ కోలుకుంది అనేది గ‌త కొన్నాళ్లుగా బాగా వినిపిస్తున్న మాట‌! ప్ర‌త్యేకించి క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత కాంగ్రెస్ కు కొత్త ఊపిరి వ‌చ్చింది. పోరాడితే పోయేదేమీ లేదు ప్ర‌తిప‌క్ష వాసం త‌ప్ప అనే సందేశం క‌ర్ణాట‌క కాంగ్రెస్ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కూడా కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకుంది. విబేధాల‌ను కాసేపు ప‌క్క‌న పెట్టి పోరాడుతూ ఉంది! ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ నువీడిన వారు కూడా ఒక్కొక్క‌రుగా ఆ పార్టీకి తిరిగి చేరువఅయ్యారు! త‌న సంప్ర‌దాయ ఓటు బ్యాంకు, ద‌ళిత ఓటు బ్యాంకు, కేసీఆర్ తీరుపై గుర్రుగా ఉన్న వారిని ఏకం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ బ‌లీయంగా త‌యారైన‌ట్టే! అయితే సంప్ర‌దాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకునే కేసీఆర్ కూడా త‌న పునాదిగా చేసుకున్నారు గ‌త ప‌దేళ్ల‌లో! ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ వారిని తిరిగి ఏ మేర‌కు త‌న వైపుకు తిప్పుకోగ‌ల‌ద‌నేది ప్ర‌శ్న‌!

బీజేపీ వెనుక‌బాటు కాంగ్రెస్ ను ముందుకు నెట్టింద‌నేది కూడా మ‌రో కీల‌క‌మైన అంశం. ఒక‌వేళ జీహెచ్ఎంసీ ఎన్నిక‌లప్పుడు బీజేపీలో క‌నిపించిన ఉత్సాహం, ఆ ఊపు ఇప్పుడు ఉండి.. ఉంటే ఓట్ల చీలిక బ‌లంగా ఉండేది! భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ‌లో బ‌ల‌మైన శ‌క్తిగా ఎదిగేది. అయితే జీహెచ్ఎంసీలో ద‌క్కిన విజ‌యం త‌ర్వాత కొన్నాళ్ల పాటు బీజేపీ హ‌డావుడి సాగినా, ఆ త‌ర్వాత అలాంటి సీన్ లేకుండా పోయింది. జీహెచ్ఎంసీ విజ‌యం త‌ర్వాత ఇక తెలంగాణ‌లో అధికారం త‌మ‌దే అనేంత స్థాయిలో రెచ్చిపోయిన క‌మ‌లం పార్టీ నేత‌లు ఇప్పుడు ఆ మాట‌ను అంత ధీమాగా చెప్ప‌లేక‌పోతున్నారు! ఆఖ‌రికి కాంగ్రెస్ క‌న్నా కేసీఆర్ మేలు అనేంత వ‌ర‌కూ వ‌చ్చారు క‌మ‌ల‌నాథులు!

మొన్న‌టి వ‌ర‌కూ కేసీఆర్, మ‌జ్లిస్ వేరే కాదు అన్న వాళ్లు ఇప్పుడు కాంగ్రెస్ క‌న్నా కేసీఆర్ మేలు అంటూ ప‌త్రిక‌ల ఇంట‌ర్వ్యూల్లో వ్యాఖ్యానించ‌డం విడ్డూరంగా మారింది. బీఆర్ఎస్ కు బీజేపీ ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ఇస్తోందా! త‌మ ఓటు బ్యాంకును బీఆర్ఎస్ వైపు మ‌ళ్లించ‌డానికి కూడా బీజేపీ నేత‌లు వెనుకాడ‌టం లేదా! అనే ప్ర‌శ్న‌ల‌ను ఉత్ప‌న్నం చేస్తోంది ఆ పార్టీ నేత‌ల తీరు!

ఇక తెలంగాణ పోరు నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తిగా త‌ప్పుకుంది. తాము పోటీ చేయ‌డం వ‌ల్ల క‌లిగే లాభం క‌న్నా న‌ష్టం ఎక్కువ‌ని చంద్ర‌బాబు అనుకున్నారో ఏమో మ‌రి! హైద‌రాబాద్ ను నిర్మించింది తెలుగుదేశం పార్టీనే, హైటెక్ సిటీ క‌ట్టింది తెలుగుదేశం పార్టీనే, ఓఆర్ఆర్ తెలుగుదేశం పార్టీదే, మొత్తంగా హైద‌రాబాద్ కు రూపు రేఖ‌లు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీనే అంటూ ఏపీకి వ‌చ్చి అబ‌ద్ధాలు చెప్పుకునే చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ కేంద్రంగా న‌డిచే తెలంగాణ పోటీలో నిల‌వ‌క‌పోవ‌డం హాస్యాస్ప‌దం! మ‌రి హైద‌రాబాద్ అంతా త‌న ఘ‌న‌త అని చెప్పుకునే చంద్ర‌బాబు నాయుడు అక్క‌డే నివ‌సిస్తూ కూడా త‌న పార్టీని పోటీలో కూడా పెట్ట‌లేక‌పోయారు. తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ చేయ‌క‌పోవ‌డం ఫ‌లితాల‌ను ఏ ర‌కంగానూ ప్ర‌భావితం చేసే అంశం కాద‌ని స్ప‌ష్టం అవుతోంది. త‌మ‌కు తెలంగాణ‌లో ఎంతో ఉందని చెప్పుకునే ప‌చ్చ‌వ‌ర్గాలు  త‌మ మ‌ద్ద‌తు ఎవ‌రికో బాహాటంగా ప్ర‌క‌టించే ప‌రిస్థితి కూడా లేదు!

కాంగ్రెస్ కు ఒక అవ‌కాశం ఇద్దామ‌ని తెలంగాణ ప్ర‌జానీకం అనుకుంటే మాత్రం.. ఆ పార్టీకి ఇంత‌కు మించిన అవ‌కాశం ల‌భించ‌దు! ప‌దేళ్ల ప్ర‌తిప‌క్ష వాసంలో కాంగ్రెస్ చేసిన ప్ర‌జాపోరాటాలు పెద్ద‌గా ఏమీ లేవు కానీ, కాలం క‌లిసొచ్చి అధికారం ల‌భిస్తే మాత్రం అది పెద్ద విడ్డూరం కాక‌పోదు! తెలంగాణ బ‌రిలో కాంగ్రెస్ గ‌నుక అధికారం సాధ‌న ద్వారా విజ‌యాన్ని న‌మోదు చేసుకుంటే… ఆ పార్టీకి దేశ వ్యాప్తంగా కూడా మ‌రి కాస్త ఉత్సాహం ల‌భించే అంశ‌మే అవుతుంది. 

క‌ర్ణాట‌క‌లో అధికారం ద‌క్కించుకోవ‌డం, ఇప్పుడు తెలంగాణ‌లో కోలుకుంటే.. గ‌తంలో పోగొట్టుకున్న రాష్ట్రాల్లో వెదుక్కొనే ఉత్సాహం కూడా ద‌క్కిన‌ట్టుగా అవుతోంది. తెలంగాణ‌లో కాంగ్రెస్ గ్రాఫ్.. నెమ్మ‌దినెమ్మ‌దిగా పుంజుకుంటోంద‌నేది మాత్రం ప్ర‌ముఖంగా వినిపిస్తున్న మాట‌!