తెలుగు రాష్ట్రాల్లో ఆర్. కృష్ణయ్య పేరు తెలియనివారు ఉండరు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆయన్ని రాజ్యసభ కోసం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే కదా. ఒక తెలంగాణా వ్యక్తిని ఆంధ్రా నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడం కొద్దిగా ఆశ్చర్యం కలిగించే విషయమే. వాస్తవం చెప్పాలంటే ఇందులో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదనే చెప్పుకోవాలి.
ఏ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు జరిగినా దేశంలో ఏ రాష్ట్రం నుంచైనా ఎవరినైనా ఎంపిక చేసుకోవచ్చు. ఉమ్మడి ఏపీలోనూ. విభజన తరువాత ఏర్పడిన ఏపీలోనూ ఇతర రాష్ట్రాలవారిని రాజ్యసభకు ఎంపిక చేశారు. కాకపొతే తెలంగాణా నుంచి ఆర్. కృష్ణయ్యను ఎంపిక చేయడమే ఆశ్చర్యంగా ఉందంటున్నారు రాజకీయ పండితులు.
కృష్ణయ్యను ఎంపిక చేయడం వెనుక వ్యూహం ఏమిటి? దీనికి వ్యూహకర్తలు ఎవరు? జగన్ సొంత నిర్ణయమా? కేసీఆర్ హస్తం ఉందా? అనే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, ఆర్. కృష్ణయ్య పేరుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడే అయినా, అదొక స్వయం ప్రకటిత సంఘమేగానీ ఆయన్ని బీసీలు అందరూ తమ నేతగా గుర్తించి ఇచ్చిన పదవి కాదు. ఆయన్ని ఎవరూ ఎన్నుకోలేదు. ఆయనకు ఆయనే తాను అధ్యక్షుడిని అని ప్రకటించుకున్నారు.
నిజానికి, బీసీలు అందరూ ఆయన వెంట నడిచేంత గొప్పనాయకుడు కాదు. అంతే కాదు, అయన రాజకీయంగా ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఒక్కసారి మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టారు. అది కుడా తెలుగుదేశం పుణ్యానే 2014లో ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు.
అప్పుడు హైదరాబాదులోని ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అదే కృష్ణయ్య 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా, మిర్యాలగూడ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. అంటే ఆయనకు ఒక నిలకడైన రాజకీయ సిద్ధాంతం లేదని అర్ధమవుతోంది.
సొంత రాష్ట్రంలోనే ఓడిపోయిన ఆయన పొరుగు రాష్ట్రంలో, పొడిచేది ఏమీ ఉండదని పరిశీలకులు అంటున్నారు. జగన్ కు ఈ సలహా ఎవరిచ్చారో తెలియదు. బీసీలను అడ్డుపెట్టుకుని కృష్ణయ్య రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పొందాడని టాక్ ఉంది. కృష్ణయ్య ట్రాక్ రికార్డులో మరకలు మచ్చలు చాలానే ఉన్నాయని అంటారు. నిజానిజాలు ఎలా ఉన్నా ఆయన బీసీ ఉద్యమాన్ని ఒక వ్యాపారంగా నడిపిస్తున్నారనే ఆరోపణలు కూడా లేక పోలేదు.
కృష్ణయ్య 1994లో సిన్సియర్ గానే బీసీ సంక్షేమ సంఘం స్థాపించినా, అనంతర కాలంలో ఆయన దాన్నొక వ్యాపార సంస్థగా మార్చడంతో పాటుగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చెశారనే ఆరోపణలు ఉన్నాయి. కరుడు కట్టిన నేరస్తుడు, నయీంతో తనకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని, నయీం తన శిష్యుడని కృష్ణయ్య స్వయంగా ప్రకటించుకున్నారు.
ఏపీలో అర్హులైన బీసీలే లేనట్లు, ఏమి ఆశించి పొరుగు రాష్ట్రం నుంచి కృష్ణయ్యను అరువు తెచ్చుకున్నారో తెలియడంలేదు. కృష్ణయ్యను రాజ్యసభకు పంపినందువల్ల ఏపీలోని బీసీలంతా ఎన్నికల్లో తనకు మద్దతు ఇస్తారని జగన్ అనుకుంటున్నారా? కృష్ణయ్యతో తెలంగాణా బీసీలకు ఉన్నంత అనుబంధం ఆంధ్రా బీసీలకు ఉంటుందా? అందులోనూ వైసీపీలోనే పేరు మోసిన బీసీ నాయకులు చాలామంది ఉన్నారు కదా. వైసీపీ ప్రకటించిన నలుగురు రాజ్యసభ అభ్యర్థులలో ఇద్దరు బీసీలు కాగా మిగిలిన ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు.
అలాగే ప్రకటించిన ఇద్దరు బీసీ అభ్యర్థులూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన వారే. తెలంగాణ నుంచి రాజ్యసభకు కేసీఆర్ ఒక ఫార్మా కంపెనీ అధినేతను రాజ్యసభకు పంపనున్నారనీ, ఆ ఫార్మా కంపెనీ అధినేత వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి వియ్యంకుడు కావడంతో అందుకు ప్రతిగా తెలంగాణ సీఎం సిఫారసు చేసిన ఆర్. కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు పంపేందుకు జగన్ నిర్ణయించారని చెబుతున్నారు.
అందులోనూ కృష్ణయ్య తెలంగాణలో ఉంటే కేసీఆర్ కు తలనొప్పే. అందుకే రాజ్యసభకు పంపాలని కేసీఆర్ జగన్ కు సిఫారసు చేశారని అంటున్నారు. ఇందులో నిజానిజాలు సరిగా తెలియవు. ఏది ఏమైనా ఒకప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయిన కృష్ణయ్య, ఇప్పడు వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడు అవుతున్నాడు.