ఏపీ అధికార పార్టీకి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అతిపెద్ద సర్టిఫికెట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో సోము వీర్రాజు జబర్దస్త్ కామెడీ షోను మించిపోయి హాస్యం పండిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసలే బూతు పర్వంతో ఏపీ రాజకీయాలు భ్రష్టు పట్టి పోతున్నాయి. రాజకీయ కాలుష్యంతో ఏపీ ప్రజారోగ్యం దెబ్బ తింటోందని సోము వీర్రాజు గ్రహించినట్టున్నారు. అందుకే ఆయన నివారణ చర్యగా అందరినీ నవ్వించడానికి నిర్ణయిచినట్టున్నారు.
బుధవారం ఆయన వైసీపీపై తన మార్క్ విమర్శలు చేయడం విశేషం. దేశంలో అతి పెద్ద మతతత్వ పార్టీ వైసీపీయేనని సోము వీర్రాజు పే…ద్ద సర్టిఫికెట్ ఇచ్చారు. తమ పార్టీని పదేపదే మతతత్వ పార్టీ అని విమర్శించడం సమంజసం కాదన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా, చర్చిలను ప్రభుత్వ నిధులతో వైసీపీ ప్రభుత్వం కట్టిస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.
హిందూ ప్రాంతాల్లో మసీదులను దగ్గరుండి వైసీపీ ఎమ్మెల్యేలే కట్టిస్తున్నారన్నారు. దీనిపై ప్రశ్నిస్తే బీజేపీపై ముస్లింలను రెచ్చగొడుతున్నారని వాపోయారు. రాష్ట్రంలో జరుగుతోన్న సంక్షేమం, అభివృద్ధి బీజేపీ చలవేనని ఆయన అన్నారు.
బీజేపీ మతతత్వ పార్టీ అని ఉన్న మాట అంటే ఉలుకెందుకని వైసీపీ ప్రశ్నిస్తోంది. అందులో బీజేపీ సిగ్గుపడాల్సిన విషయం ఏముందని నిలదీస్తున్నారు. తమ పార్టీ అతిపెద్ద మతతత్వ పార్టీగా అభివర్ణించడం కంటే పెద్ద జోక్ ఏమైనా వుంటుందా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కనీసం ఏపీలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతున్నాయని సోము వీర్రాజు ఒప్పుకున్నందుకు తప్పక అభినందించాలని వైసీపీ నేతలు అంటున్నారు.