గ‌ట్టి షాక్ ఇచ్చిన యువ‌నేత‌

అస‌లే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి యువ‌నేత గ‌ట్టి షాక్ ఇచ్చారు. ప్ర‌ధాని మోదీ, కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. త్వ‌ర‌లో ఆ…

అస‌లే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి యువ‌నేత గ‌ట్టి షాక్ ఇచ్చారు. ప్ర‌ధాని మోదీ, కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. త్వ‌ర‌లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో తాజా ప‌రిణామం కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ‌గా చెప్పొచ్చు.

కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త విభేదాల‌తో విసుగెత్తిపోయి ప‌టేల్ వ‌ర్గానికి చెందిన యువ‌నాయ‌కుడు హార్దిక్ ప‌టేల్ ఆ పార్టీని వీడారు. రాజీనామా చేస్తున్న విష‌యాన్ని ట్విట‌ర్ వేదిక‌గా హార్దిక్ ప‌టేల్ ప్ర‌క‌టించారు. సూటిగా, స్ప‌ష్టంగా త‌న అసంతృప్తిని వెల్ల‌డించారాయ‌న‌.

“కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వానికి, పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు ఎంతో ధైర్యాన్ని కూడ‌గ‌ట్టుకుంటున్నాను. నా నిర్ణ‌యాన్ని నా స‌హ‌చ‌రులు, గుజ‌రాత్ ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తార‌ని ఆశిస్తున్నా. ఈ నిర్ణ‌యంతో భ‌విష్య‌త్‌లో గుజ‌రాత్ అభివృద్ధి కోసం ప‌నిచేయ‌గ‌ల‌న‌ని న‌మ్ముతున్నా” అని హార్దిక్ ప‌టేల్ ట్వీట్ చేయ‌డం విశేషం. కాంగ్రెస్ పార్టీని వీడ‌డం మ‌న‌సుకు క‌ష్టంగా వుందంటూనే, మ‌రోవైపు రాజీనామా చేయ‌డం వ‌ల్ల త‌న రాష్ట్రానికి అభివృద్ధి చేయ‌గ‌ల‌న‌నే న‌మ్మ‌కాన్ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

పాటిదార్ ఉద్య‌మంతో హార్దిక్ ప‌టేల్ దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. చిన్న వ‌య‌సులోనే గొప్ప ఉద్య‌మ‌కారుడిగా పేరు సంపాదించారు. ప‌టేళ్ల రిజ‌ర్వేష‌న్ కోసం పోరాడిన హార్దిక్‌ను చేర్చుకోవ‌డం వ‌ల్ల కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతుంద‌ని అగ్ర‌నాయ‌క‌త్వం విశ్వ‌సించింది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు అత‌ను కాంగ్రెస్‌లో చేరి క్రియాశీల‌కంగా ప‌ని చేశారు. 

అయితే కాంగ్రెస్ వ‌ర్గ సంస్కృతి రాజ‌కీయంతో అత‌ను హర్ట్ అయ్యారు. తీవ్ర నిర్ల‌క్ష్యానికి గుర‌వుతున్నాన‌నే వేద‌న హార్దిక్‌లో క‌నిపించింది. ఈ నేప‌థ్యంలో త‌న గోడు ప‌ట్టించుకునే వారే లేర‌ని హార్దిక్ ప‌దేప‌దే ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపిన‌ రాజీనామా లేఖ‌లో ఘాటు విమర్శ‌లు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. గుజరాత్‌పై కాంగ్రెస్ నాయ‌క‌త్వానికి అంత‌గా ఆస‌క్తి లేద‌ని అర్థ‌మైంద‌న్నారు. ముఖ్యంగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు చేరుకోడానికి కాంగ్రెస్ వ‌ద్ద త‌గిన రోడ్‌మ్యాప్ లేద‌ని విమ‌ర్శించారు. 

అందుకే కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిచోట ప్ర‌జ‌ల తిర‌స్క‌ర‌ణ‌కు గురి అవుతోంద‌ని తీవ్ర విమ‌ర్శ చేశారు. ఏది ఏమైనా గుజ‌రాత్‌లో ఎన్నిక‌ల ముంగిట బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన యువ ఉద్య‌మ నాయకుడు కాంగ్రెస్‌ను వీడ‌డం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బే!