మళ్లీ అధికారం తనదే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా ధీమాగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో సాధించిన సీట్లకు ఏ మాత్రం తగ్గకుండా 2024లో కూడా వస్తాయనే నమ్మకంతో ఆయన ఉన్నారు. ఒక పార్టీ అధినేతగా ఆ మాత్రం భరోసాతో వుండడం తప్పు కాదు. 175కు 175 స్థానాల్లో ఎందుకు విజయం సాధించలేమనే నినాదంతో జగన్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇది ప్రత్యర్థుల్లో భయాన్ని కలిగిస్తోంది. మరోవైపు క్షేత్రస్థాయి పరిస్థితులు అధికార పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. జగన్ ఓటు బ్యాంక్ గుంభనంగా వుంటోందని, అది పోలింగ్ రోజు మాత్రమే తెలుస్తుందనే ప్రచారం వైసీపీకి ధైర్యాన్ని ఇస్తోంది. మరోవైపు సంక్షేమం తప్ప, మిగిలిన ఏ ఒక్క అంశమని పట్టించుకోవడం లేదనే విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
కారణాలేవైనా జగన్ వ్యతిరేకుల వాయిస్ బలంగా వినిపిస్తోంది. దీంతో రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంపై ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకుందన్నది వాస్తవం. 50 శాతం ఓట్లతో తిరుగులేని విధంగా అధికారంలోకి వచ్చి, ఇక టీడీపీ నామరూపాల్లేకుండా పోయిందనే దశ నుంచి …నాలుగేళ్లు తిరిగే సరికి వైసీపీ పాలన అంటే పెదవి విరుపు విరుస్తున్నారంటే…ఎక్కడో సంథింగ్ రాంగ్ అనే చర్చకు తెరలేచింది. ప్రధానంగా నవరత్నాల సంక్షేమ పథకాల అమల్లో ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామనే భావన జగన్‌లో బలంగా వుంది. ఇది నిజం కూడా. సంక్షేమ పథకాలే తనకు శ్రీరామ రక్ష అని ముఖ్యమంత్రి జగన్ గట్టిగా నమ్ముతున్నారు.
అందుకే పదేపదే బటన్ నొక్కుతున్నానని, మధ్యలో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ అవుతోందని జగన్ చెబుతున్నారు. ఏ నవరత్న పథకాలు జనానికి, అధికారానికి జగన్‌ను చేరువ చేసాయో, అవే ఆయనకు నేడు గుదిబండగా మారాయనేది కాదనలేని సత్యం. నాలుగేళ్ల జగన్ పాలనలో… చివరికి తనకు నమ్మకమైన ఓటు బ్యాంక్ సంక్షేమ పథకాల లబ్ధిదారులే అని సీఎం ఓ నిర్ణయానికి వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఇందుకు భిన్నమైన పరిస్థితి వుండేది. జగన్ వస్తే తమ కష్టాలు తీరుస్తారని, అండగా నిలుస్తారనే నమ్మకం వుండేది.
ఎందుకంటే “నేను విన్నాను, నేను ఉన్నాను” అనే భరోసా కల్పించిన జగన్…అధికారంలోకి వచ్చిన తర్వాత “నేనేం చేయలేను” అని చెప్పలేక పోవడం తప్ప, చర్యలన్నీ అట్లే వున్నాయనే బలమైన విమర్శ వుంది. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతినడం కావచ్చు, ఆదాయ మార్గాలను అన్వేషించకపోవడం కావచ్చు… అప్పులు తప్ప, ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించే మార్గం మరొకటి కావచ్చు, ప్చ్, ఏంటో జగన్ ఇలా చేస్తున్నారనే అసంతృప్తి ఆయన్ను అభిమానించే వాళ్లలోనే ఎక్కువైంది.
సంక్షేమ పథకాలు జగన్‌ను తిరిగి సీఎం చేస్తాయా? లేదా? అనేది ప్రజల ఆలోచనలపై ఆధారపడి వుంది. సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి లక్షల్లో లబ్ధి కలిగించామంటూ… ఆధారాలతో సహా గడపగడపకూ వెళ్లి అధికార పార్టీ ప్రజాప్రతి నిధులు మరోసారి ఆశీస్సులు కోరుతున్నారు. ఇక్కడ ఓ కీలక అంశాన్ని అధికార పార్టీ నేతలు గుర్తించాల్సి వుంది. సంక్షేమ పథకాల లబ్ధిని జగన్ ఇస్తున్నారని, ఆయనకు కృతజ్ఞతగా వుండాలని భావిస్తే మాత్రం… మళ్లీ ఆయన సీఎం కావడం ఖాయం.
అలా కాకుండా లబ్ధిదారులు తమ హక్కుగా భావిస్తే మాత్రం జగన్‌కు మరోసారి అధికారం అందని ద్రాక్షే. హక్కు అనే ఆలోచన మనసులో మెదిలినప్పుడు కృతజ్ఞతకు చోటు వుండదు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ హయాంలో ప్రజల్లో పాలకుల పట్ల కృతజ్ఞత వుండేది. పక్కా గృహాలు నిర్మించి ఇచ్చిందని, అలాగే పేదలకు సాగుభూమి అందించిందనే కృతజ్ఞతా భావం కొన్ని ఏళ్ల పాటు గాంధీ కుటుంబానికి అండగా నిలిచేలా చేసింది. అలాగే రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు అందించిన ఎన్టీఆర్‌పై కూడా ప్రజల్లో అదే ఆరాధన భావం వుండేది. సామాన్యులకు అధికారంలో భాగస్వామ్యం కల్పించారనే కృతజ్ఞత ఎన్టీఆర్‌పై అణగారిన వర్గాల్లో గౌరవాన్ని, ప్రేమను పెంచింది. అందుకే టీడీపీకి నిన్నమొన్నటి వరకూ బీసీలు వెన్నుదన్నుగా నిలిచారు. నేడు ఎన్టీఆర్ కంటే జగన్ ఎక్కువ పదవులను అణగారిన వర్గాలకు ఇచ్చారు, ఇస్తున్నారు. అయితే అవన్నీ పవర్ లేని పదవులే. కేవలం ఎన్నికల మ్యాజిక్‌గానే జనం చూస్తున్నారు. చంద్రబాబు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అందుకే దొందు దొందే అనే మాట వినిపిస్తోంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి విషయంలోనూ పేద వర్గాల్లో ఆయనపై ఆరాధన కనిపించింది. పేదలకు గుండె ఆపరేషన్లు, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, 108 అంబులెన్స్ సౌకర్యం తదితర సంక్షేమ పథకాలు ఆయన్ని గుండెల్లో దాచుకునేలా చేశాయి. కానీ జగన్ విషయానికి వచ్చే సరికి సమాజంలో చైతన్యస్థాయి పెరిగింది. జగన్ తన ఓటు బ్యాంక్‌ను సుస్థిరం చేసుకోడానికి ఇస్తున్నారనే ఆలోచన జనంలో పెరిగింది. జగన్ మీటింగ్‌కు మీరు రాకపోతే…ఫలానా సంక్షేమ పథకం కట్ చేస్తామని ఎవరైనా హెచ్చరిస్తే… ఏం జగన్ జేబులో నుంచి ఏమైనా మాకిస్తున్నారా? అనే ప్రశ్న ఎదురవుతోంది.
జగన్ ఇస్తున్న దానికంటే, రకరకాల పేర్లతో ఆయన తీసుకుంటున్న సొమ్మే ఎక్కువనే విమర్శలు కూడా సామాన్య ప్రజానీకం నుంచి వస్తున్నాయని అధికార పార్టీ నేతలు గ్రహించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలిస్తే పాలకులను జనం ఆరాధిస్తారు. ఉదాహరణకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడం వల్ల సామాన్యులు కూడా కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా పొంది ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఇలాంటి వాళ్లంతా ఆయన్ను దైవంగా కొలుస్తున్నారు. ఇప్పుడు జగన్ విషయానికి వస్తే… పాలకులు తమ కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అలాగని జగన్ అమలు చేస్తున్న వాటిలో గొప్ప పథకాలు లేవనడం అబద్ధం అవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. కానీ పిల్లలకు చదువు చెప్పించడంలో కంటే, ఇతరత్రా పనులతో పుణ్యకాలం కాస్త గడిచిపోతోందనే ఆరోపణ ఉంది.
సంక్షేమ పథకాల పుణ్యమా అని మిగిలిన అన్ని అంశాలను జగన్ ప్రభుత్వం మూలన పడేసింది. చివరికి సొంత పార్టీ వాళ్లు చిన్నచిన్న పనులు చేసినా బిల్లులు చెల్లించలేని దుస్థితి. ఇవాళ వైసీపీ రీజనల్ కోఆర్డినేర్ల నేతృత్వంలో సాగుతున్న నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో గ్రామ, మండల స్థాయి నేతల నుంచి తమకు బిల్లులు రావడం లేదనే ఫిర్యాదులే ఎక్కువ. ఇలాగైతే తాము పార్టీకి ఎలా అండగా నిలబడాలనే ప్రశ్న వారి నుంచి ఎదురవుతోంది. ఆర్థికపరమైన అంశాలేవీ తమ వద్దకు తీసుకురావద్దని గ్రామస్థాయి నాయకులకు పెద్ద నాయకులు తెగేసి చెబుతున్నారు. వారికేమీ చేయనప్పుడు… రేపు పోలింగ్ బూత్‌ల వద్దకు ఓటర్లను ఎలా తీసుకొస్తారని అనుకుంటున్నారో పెద్ద సార్లకే తెలియాలి.
మరీ ముఖ్యంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, లబ్ధిదారుల ఎంపికలో తమ ప్రమేయం లేకుండా చేశారనే ఆవేదన గ్రామ స్థాయి నాయకుల్లో బలంగా వుంది. జనంతో తనకు తప్ప, మరే నాయకుడికి సంబంధం లేకుండా చేసే క్రమంలో బటన్ నొక్కే కార్యక్రమానికి జగన్ తెరలేపారనే ఆవేదన కూడా నేతల్లో వుంది. ఇలా అనేక అంశాలు జగన్‌పై వ్యతిరేకత పెంచాయి. లక్షల కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నా… ఎందుకీ అసంతృప్తి అనేది అధికార పార్టీ నాయకులకు అర్థం కావడం లేదు.
సంక్షేమ పథకాలే కాదు, సౌకర్యాలను కూడా జనం కోరుకుంటున్నారనే విషయాన్ని జగన్ మరిచినట్టున్నారు. అదే రానున్న రోజుల్లో రివర్స్ అవుతుందనే భయం అధికార పార్టీ నేతల్లో వుంది. అయితే జగన్ అదృష్టం ఏమంటే… ఇప్పటికీ టీడీపీ బలపడకపోవడం. అదొక్కటే జగన్‌కు మరోసారి అధికారం దక్కడంపై ఆధారపడి వుంది.