రాజకీయ కాలం వచ్చేసింది. తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాదిలో, అలాగే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కొన్ని పార్టీల మధ్య పొత్తులు కుదురుతున్నాయి. కొన్ని విడిపోతున్నాయి. కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో పాగా వేసిన ఆప్… నెమ్మదిగా దేశ వ్యాప్తంగా విస్తరించాలనే ఆలోచనలో వుంది. పంజాబ్‌లో పాలన సాగిస్తోంది. గుజరాత్‌లో అడుగు పెట్టింది. ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసి అరంగేట్రం చేసింది. గుజరాత్ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకున్న ఆప్ జాతీయ హోదా సాధించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పోటీ చేసేందుకు ఆప్ సిద్ధమవుతోంది. ఇవాళ్టి ఖమ్మం బీఆర్ఎస్ సభకు అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ కేసీఆర్‌ను పెద్దన్నగా అభివర్ణించడం గమనార్హం. బీఆర్ఎస్‌తో ఆప్ పొత్తు కుదుర్చుకుంటుందనే ప్రచారానికి తాజా పరిణామాలు బలం కలిగిస్తున్నాయి.
ఆప్ ఒంటరిగా పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో బీఆర్ఎస్ ఒంటరిగా వెళ్లేందుకు కొన్ని ప్రతికూల అంశాలున్నాయి. గతంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆంధ్రోళ్లను కేసీఆర్ నీచంగా మాట్లాడ్డం… ఇప్పుడాయనకు అడ్డంకిగా మారింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆప్‌తో కలిసి వెళితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కేసీఆర్ ఆలోచన. ఇందులో భాగంగా రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఆప్ -బీఆర్ఎస్ కాంబినేషన్ ఎలా వుంటుందో క్షేత్రస్థాయికి వెళితే తప్ప తెలిసే అవకాశం లేదు. ఆప్ అంటే విద్యావంతులు, మేధావులు, ఉద్యోగుల్లో ఒక రకమైన గౌరవ భావం వుంది. బీఆర్ఎస్‌తో కలిసి వస్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారనేది పెద్ద ప్రశ్న.