జయప్రద కోరికను అధిష్టానం తీరుస్తుందా?

రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఒకప్పటి అందాల హీరోయిన్, స్టార్ హీరోయిన్ జయప్రద రాజకీయంగా తెలుగు రాష్ట్రాలకు దూరమైపోయారు. ఇప్పటి తరం వారికి అంటే తెలుగు రాష్ట్రాల్లోని ఈ తరం ఓటర్లకు జయప్రద పరిచయం…

రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఒకప్పటి అందాల హీరోయిన్, స్టార్ హీరోయిన్ జయప్రద రాజకీయంగా తెలుగు రాష్ట్రాలకు దూరమైపోయారు. ఇప్పటి తరం వారికి అంటే తెలుగు రాష్ట్రాల్లోని ఈ తరం ఓటర్లకు జయప్రద పరిచయం లేదు. సినిమాల పరంగానూ, రాజకీయాలపరంగానూ ఆమె తెలిసే అవకాశంలేదు. ఆమె రాజకీయ జీవితంలో చాలాభాగం యూపీలోని గడిచిపోయింది. 

యూపీలోని రాంపూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో తాను రాజకీయంగా ఒక వెలుగు వెలగడానికి కారణమైన సమాజ్ వాదీ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆమె గాలి తెలుగు రాష్ట్రాలవైపు మళ్లింది. తన మనసులో మాట బయటపెట్టారు.

తనకు తెలుగు రాజకీయాల్లోకి రావాలని ఉందని, తెలంగాణా నుంచిగానీ, ఏపీ నుంచిగానీ పోటీ చేయాలని ఉందని చెప్పారు. తమ పార్టీ అదిష్టానం ఆదేశిస్తే తాను ఆ దిశగా ముందుకు సాగుతానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో రావాలని, ఇక్కడి ప్రజలకు సేవ చేసుకొనే అవకాశం కోసం చూస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నానన్నారు. తమ పార్టీ పెద్దలు నిర్ణయించి ఆంధ్ర రాష్ట్రంలోగానీ, తెలంగాణలో గానీ పోటీ చేయమని చెప్తే తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. 

“ఇక్కడి స్టేట్ ని వదిలి మళ్లీ దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు అది సరైనది కాదేమోనని నేను అనుకుంటున్నాను. రాష్ట్రంలో ప్రజలకు సంపూర్ణమైన వసతులు కల్పించి, వాళ్లకు కావాల్సినట్లుగా 24 గంటలు నేనున్నానని నిలబడితేనే ప్రజలు అభినందిస్తారు. బీజేపీలో ఉన్నాను కానీ, నేను ఎక్కువగా ఉత్తరప్రదేశ్ క్యాడర్ లో ఉన్నాను. దీన్ని నిర్ణయించాల్సింది పెద్దలు. ఆంధ్ర రాష్ట్రంలో గానీ, తెలంగాణ రాజకీయాల్లోకి గానీ ఒక తెలుగు బిడ్డగా రావాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు. 

బీజేపీలో చేరినా అంత క్రియాశీలకంగా లేని జయప్రద రాజమండ్రిలో జేపీ నడ్డా సభకు హాజరయ్యారు. ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన జన్మభూమి రాజమండ్రి అని..కర్మ భూమి ఉత్తరప్రదేశ్ అని.. అవి తనకు రెండు కళ్ళలాంటివని జయప్రద ప్రకటించారు.

రాజమండ్రి సభలో ఆమె మాట్లాడుతూ అప్పులప్రదేశ్‎ను స్వర్ణాంధ్రగా మార్చటానికి జేపీ నడ్డా వచ్చారన్నారు. జయప్రద తన రాజకీయ జీవితం 1994లో ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టిఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ లో చేరడం ద్వారా ఆమె తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ నుండి పార్టీ పగ్గాలను చంద్రబాబు చేతిలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు 1996లో జయప్రదను రాజ్యసభ సభ్యురాలిగా, పార్టీ మహిళా విభాగం నాయకురాలిగా చేశారు. 

చంద్రబాబు నాయుడు మరో నటి రోజాను మహిళా విభాగం చీఫ్‌గా చేయడంతో వారి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత అమర్ సింగ్, ములాయం సింగ్ ఆహ్వానం మేరకు ఆమె సమాజ్ వాదీ పార్టీ లో చేరారు.  ఆమె 2004లో రాంపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మళ్ళీ 2009లో తిరిగి ఎన్నికయ్యారు. ములాయం సింగ్‌పై తిరుగుబాటు చేసిన తర్వాత జయప్రద అమర్ సింగ్ పక్షాన నిలిచారు. 2010లో ఎస్పీ నుంచి బహిష్కరించబడిన ఆమె అమర్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మంచ్‌లో చేరారు. 

అయితే, ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. 2019లో బీజేపీలో చేరిన జయప్రద యూపీలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లోనూ పాల్గొనడం లేదు. రాజమండ్రి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి అధిష్టానం ఆమెను దయతలుస్తుందా? దయతలచినా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా ఉందా?