తినేవాడికి ఏ దేశ‌మైనా ఒక‌టే!

తెలివి వుంటే ఏ దేశంలోనైనా బ‌త‌కొచ్చు. అన్ని దేశాల్లో నాయ‌కులు, అవినీతి మిక్స్‌డ్ జాన‌ర్‌. స‌ముద్రానికే ఉప్పు అమ్మి బ‌తికే గండ‌ర‌గండులు వుంటారు. వాళ్ల‌లో గుప్తా బ్ర‌ద‌ర్స్ ఒక‌రు. ముగ్గురు అన్న‌ద‌మ్ములు. “ఏక్ సే…

తెలివి వుంటే ఏ దేశంలోనైనా బ‌త‌కొచ్చు. అన్ని దేశాల్లో నాయ‌కులు, అవినీతి మిక్స్‌డ్ జాన‌ర్‌. స‌ముద్రానికే ఉప్పు అమ్మి బ‌తికే గండ‌ర‌గండులు వుంటారు. వాళ్ల‌లో గుప్తా బ్ర‌ద‌ర్స్ ఒక‌రు. ముగ్గురు అన్న‌ద‌మ్ములు. “ఏక్ సే బ‌డ్‌క‌ర్ ఏక్” అంటే ఒక‌రిని మించిన ఒక‌రు. వీళ్లు ద‌క్షిణాఫ్రికాకే సున్నం కొట్టేశారు. లెక్క‌ల్లో తేలింది 7513 కోట్లు. తేలంది ఎంతో. అంతా వీళ్లే తిన్నారా? అంటే లేదు. గ‌వ‌ర్న‌మెంట్‌లో అంద‌రికీ పంచారు. జాక‌బ్ జుమా అనే పెద్ద మ‌నిషి ప్రెసిడెంట్‌గా వున్న‌పుడు ఆయ‌న కేబినెట్‌లో మంత్రులుగా ఎవ‌రుండాలో కూడా ఈ అన్న‌ద‌మ్ములే నిర్ణ‌యించేవారు. జుమాని ముద్దుగా జుప్తా అని పిలిచేవారు.

వీళ్లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ష‌హ‌రాన్‌పూర్‌కి చెందిన వాళ్లు. చిన్న ప‌ట్ట‌ణంలో రేష‌న్‌షాపు, ఎంత రేష‌న్ బ్లాక్‌లో అమ్మితే మాత్రం ధ‌న‌వంతులుగా మారుతాం అని ఈ బ్ర‌ద‌ర్స్ ఆలోచించారు. 1990లో వీళ్ల‌లో ఒక‌డు ద‌క్షిణాఫ్రికా వెళ్లాడు. నిరంత‌రం అల్ల‌ర్లు, జాతి వివ‌క్ష పోరాటాల‌తో అల్ల‌క‌ల్లోలంగా వుంది. తేనె కావాల్సిన వాడు, ఈగ‌ల‌కి భ‌య‌ప‌డ‌డు. ఆఫ్రికాలో అల్ల‌ర్లే కాదు, బంగారు గ‌నులు కూడా ఉన్నాయ‌ని క‌నిపెట్టారు.

ముగ్గురూ ఆ దేశం చేరుకున్నారు. చెప్పుల వ్యాపారం స్టార్ట్ చేశారు. రాజ‌కీయ నాయ‌కుల‌తో ప‌రిచ‌యాలు పెంచుకున్నారు. జాక‌బ్ జుమా ప్ర‌తిప‌క్షంలో వున్నాడు. అధికారంలో వున్న వాళ్ల‌కంటే , అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలున్న నాయ‌కుల‌తో ప‌రిచ‌యం చాలా విలువైంది. ఈ సూత్రం అన్ని దేశాల్లో వ‌ర్కౌట్ అవుతుంది.

గుప్తాల ప్ర‌త్యేక‌త ఏమంటే కంప్యూట‌ర్లు ఈ ప్ర‌పంచాన్ని ఏలుతాయ‌ని 1990లోనే క‌నిపెట్టారు. స్కూళ్ల‌లో కంప్యూట‌ర్ విద్య అని కాంట్రాక్ట్ తీసుకుని ఊడ్చేశారు. త‌ర్వాత మైనింగ్‌, మీడియా, సినిమా ఒక‌టి కాదు, ప్ర‌భుత్వాన్నే తినేశారు.

నాయ‌కుల్ని మంచి చేసుకోవ‌డం కంటే వాళ్ల కొడుకుల్ని మంచి చేసుకోవ‌డం ఈజీ. స‌హ‌జంగా వాళ్లు మూర్ఖులు, జూలాయిలుగా వుంటారు. వాళ్ల‌కి దుబాయ్‌, ఇండియా, లాస్‌వేగాస్‌ల్లో పార్టీలు, డ్ర‌గ్స్, సెక్స్ ఎవ‌డికి ఏది కావాలిస్తే అది. వీళ్ల స్థాయి ఏ రేంజ్ అంటే ద‌క్షిణాఫ్రికాలో ఫంక్ష‌న్ జ‌రిగితే ఇండియా నుంచి ప్ర‌త్యేక విమానంలో 200 మంది అతిథుల్ని త‌ర‌లించారు. మిల‌ట‌రీ ఎయిర్‌బేస్‌లో ఆ విమానం ల్యాండ్ చేశారు.

పాపం అనే ప‌దం ప్ర‌త్యేక‌త ఏమంటే అది ఒక రోజు పండుతుంది. వీళ్ల అధ్య‌క్షుడికి ప‌ద‌వి పోయింది. అన్న‌ద‌మ్ములు దుబాయ్ పారిపోయారు. అయినా వ‌ద‌ల‌కుండా నేర‌స్తుల్ని అప్ప‌గించాల‌ని సౌత్ ఆఫ్రికా కోరింది. ఇప్ప‌టికి ఇద్ద‌రి అరెస్ట్‌. ముగ్గురూ కూడా ఆఫ్రికా జైల్లో త్వ‌ర‌లోనే క‌నిపిస్తారు.