బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చాడు, వెళ్లాడు. ఏం చెప్పారు? బీజేపీ వస్తుందని, జనం డబుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలని కోరుతున్నారని చెప్పారు.
ఆశ మంచిదే, అత్యాశ కూడా మంచిదే! ఇది దానికి మించిందే! ఇంజన్ లేదు, చక్రాలు లేవు ప్రభుత్వం వస్తుందట. అతిగా ఆశ పడిన … నరసింహ డైలాగ్ గుర్తొస్తే మన తప్పు కాదు.
వైసీపీ వద్దు, టీడీపీ కూడా వద్దు, పవన్ ఎలాగూ రాడు. పోనీ మీరే వస్తారనుకుందాం. ఎవరిని చూసి ఓటేయాలి? మీ పక్కన కూచున్న అతిరథ, మహారథుల్ని చూసి వేయాలా? జీవితమంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడిన ఎన్టీఆర్ కూతురు, కాంగ్రెస్‌లో మంత్రి పదవి పొందిన పురందేశ్వరిని చూశా? తెలుగుదేశంలో మంత్రి పదవులు పొంది వైసీపీ రాగానే గడకర్రతో బీజేపీలోకి దూకిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌లని చూశా? లేదంటే సారా వ్యాపారంలో కోట్లు సంపాదించిన సీఎం రమేశ్‌ను చూశా?
మీ పార్టీలో ఎవర్ని చూసి ఓటు వేయాలి? అధికారంలోకి వస్తే మందు రేట్లు తగ్గిస్తామని చెప్పిన సోము వీర్రాజుని చూసి ఓట్లు వేయాలా? ఎవరిని చూసి ఓట్లు వేయాలో చెబితే కనీసం డిపాజిట్లు అయినా వస్తాయి. పోనీ మోదీని చూసి ఓట్లు వేయమంటే ఆయన ప్రధానిగా, సీఎంగా రెండు పదవుల్లో వుండలేడు కదా, డబుల్ ఇంజన్‌కి అర్థం అది కాదు కదా!
పైన చెప్పిన గోడ దూకిన నాయకుల్లో ఒకరిని లేదా సోము వీర్రాజుని ముఖ్యమంత్రిని చేస్తారనుకుంటే వాళ్లకంటే జగన్, బాబు, పవన్ వెయ్యి రెట్లు మేలు కదా!
వీళ్లెవరూ కాదంటే హఠాత్తుగా రంగ ప్రవేశం చేసి గోదావరి నా జన్మభూమి అని కొత్త వేషంతో వచ్చిన జయప్రదని నాయకురాలు చేస్తారా?
ఆయుధాలు లేకుండా యుద్ధం గురించి మాట్లాడితే జనం నవ్వుకుంటారు. బీజేపీ అంటే భారతీయ జనతా పేరడీగా మార్చకండి.