ఏపీ రాజకీయాల్లో జగన్ ని, పవన్ ని పోల్చి చూడాల్సిన అవసరం లేదు కానీ.. జనసైనికులు మాత్రం పవన్ కి జగన్ తో మాత్రమే పోలిక పెడుతుంటారు. పోనీ వారి సంతోషం కోసం ఇలా పోల్చి చూసినా జగన్ చేతలకు, పవన్ మాటలకు చాలా తేడా కనిపిస్తుంది. 2024 ఎన్నికల టార్గెట్ 175 సీట్లుగా ఫిక్స్ చేసుకున్నారు జగన్.
మరి పవన్ టార్గెట్ ఏంటి..? టీడీపీ ఎన్ని సీట్లిస్తుంది, అందులో బీజేపీకి ఎన్ని త్యాగం చేయాలి. పోనీ అక్కడ గెలిచే సీట్లెన్ని.. గతంలో పవన్ కే రెండు సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఈసారి ఆయ మూడిట్లో పోటీ చేస్తారా? లేక నిజంగానే ధైర్యం చేసి ఒకే ఒక్క నియోజకవర్గంలో నిలబడతారా..? జగన్ టార్గెట్ ఫిక్స్ అయింది, పవన్ బాబూ నీ స్కోరెంతో ధైర్యంగా చెప్పు..?
జనసేన దగ్గర కౌంటర్లకు కరవు..
మిగతా ఏ విషయాల్లో అయినా ఎగిరెగిరి పడే జనసైనికులు.. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తారంటే మాత్రం సైలెంట్ గా ఉంటారు. అసలు తమ అధినాయకుడు మనసులో ఏముందో, ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో, అందులో ఆయనొక్కడికే ఎన్ని సీట్లు కావాలో.. ఏదీ తేల్చి చెప్పడంలేదు.
ఆ విషయంలో మాత్రం పవన్ బాగా వీక్ అని అర్థమైపోతోంది. ప్యాకేజీ స్టార్ ని కాదు, నికార్సయిన నాయకుడిని అని చెప్పుకునే పవన్ కల్యాణ్.. కనీసం వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఇన్ని సీట్లలో పోటీ చేస్తుంది, తమ గాజు గ్లాసు గుర్తు ఇన్ని చోట్ల కనపడుతుంది అని ధైర్యం చేసి చెప్పలేకపోతున్నారు. అదీ పవన్ పరిస్థితి, జనసైనికుల దుస్థితి.
ఆమధ్య 170కిపైగా సీట్లు వస్తాయని చెప్పి నాలుక కరుచుకున్నారు అచ్చెన్నాయుడు. పార్టీలేదు, బొక్కాలేదు అన్న ఆయనే టీడీపీకి 170 సీట్లు వస్తాయని వెటకారం చేశారు. చివరకు కుప్పంలో కూడా కూసాలు కదిలిపోయే సరికి చంద్రబాబు కూడా మరో నియోజకవర్గాన్ని వెదుక్కోవాల్సిన పరిస్థితి. ఇక్కడ జగన్ 151కంటే మిన్నగా ప్లాన్ చేసుకున్నారు. 175 టార్గెట్ పెట్టుకున్నారు.
ఎలాగూ వైరి వర్గాలన్నీ కట్టగట్టుకుని వస్తాయి కాబట్టి, నీకింత, నాకింత అని వాటాలేసుకోవాల్సిందే. ఆ వాటాల్లో నాకు సీట్లొద్దు, ప్యాకేజీ చాలు అని పవన్ సర్దుబాటు చేసుకుంటే.. పాపం అమాయకంగా ఆయనపై ఆశలు పెట్టుకున్న జనసేన నాయకులు, జనసైనికుల పని గల్లంతే.
సో.. ఇప్పటికైనా పవన్ ధైర్యం తెచ్చుకోవాలి, లెక్కలు పక్కనపెట్టి పార్టీకి పనికొచ్చే పనులు మొదలు పెట్టాలి. పోటీ చేసే సీట్లెన్నో ప్రకటించాలి.