ఆచార్య ఫ్లాప్.. లోలోపల ఆనందిస్తున్న పవన్ ఫ్యాన్స్

సినిమా ఫ్లాప్ అయితే ఎవరికైనా బాధే. చిరంజీవి సినిమా ఫెయిల్ అయితే పవన్ ఫ్యాన్స్ కూడా బాధపడతారు. కానీ ఆచార్య విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆచార్య సినిమా ఫెయిల్ అయిందనే టాక్ బయటకొచ్చిన…

సినిమా ఫ్లాప్ అయితే ఎవరికైనా బాధే. చిరంజీవి సినిమా ఫెయిల్ అయితే పవన్ ఫ్యాన్స్ కూడా బాధపడతారు. కానీ ఆచార్య విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆచార్య సినిమా ఫెయిల్ అయిందనే టాక్ బయటకొచ్చిన వెంటనే పవన్ ఫ్యాన్స్, హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. తమ హీరో ఓ ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడని సంబర పడ్డారు. ఇంతకీ ఆచార్యకు, పవన్ కల్యాణ్ కు లింక్ ఏంటి?

ఆచార్య ప్రమోషన్ లో భాగంగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు చిరంజీవి. సినిమాలో సిద్ధ పాత్ర కోసం రామ్ చరణ్ ను అనుకున్నా మని, ఒకవేళ ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉన్న చరణ్ ను వదలడానికి రాజమౌళి అంగీకరించకపోతే పవన్ కల్యాణ్ తో ఆ పాత్ర చేయిద్దామని అనుకున్నామని చిరంజీవి వెల్లడించారు. రామ్ చరణ్ తర్వాత ఆ పాత్ర పోషించడానికి అన్ని అర్హతలు, సత్తా ఉన్న వ్యక్తి పవన్ కల్యాణ్ మాత్రమేనని ఆ సందర్భంలో చిరంజీవి ఘనంగా ప్రకటించారు.

సరిగ్గా ఇప్పుడు అదే టాపిక్ తెరపైకి తీసుకొచ్చారు కొంతమంది పవన్ అభిమానులు. ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన నేపథ్యంలో.. తమ హీరో ఓ ఫ్లాప్ మూవీ నుంచి తప్పించుకున్నాడంటూ కొత్త చర్చకు తెరదీశారు. మరికొందరు మాత్రం పవన్ కల్యాణ్ నటించి ఉన్నట్టయితే, ఆచార్య సినిమా రిజల్ట్ ఇలా ఉండేది కాదని జోస్యం చెబుతున్నారు.

నిజానికి పవన్ కల్యాణ్ వద్దనుకున్న సినిమాలు, ఆయన కోసం రాసుకున్న కథలు చాలానే హిట్టయ్యాయి. ఆ సినిమాల్ని పవన్ కల్యాణ్ మిస్ చేసుకున్నందుకు అతడి ఫ్యాన్స్ బాధపడుతూనే ఉంటారు. అయితే తొలిసారి ఆచార్య విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ ఆ సినిమాను మిస్ అయినందుకు అంతా హ్యాపీ ఫీలవుతున్నారు. లోలోపల ఆనందపడుతున్నారు.

చిరంజీవి-చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమాకు మొదటిరోజు 33 కోట్ల రూపాయల షేర్ (జీఎస్టీతో కలుపుకొని) వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే మొదటి రోజు వచ్చిన ఫ్లాప్ టాక్ తో రెండో రోజు ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పడిపోయింది. చాలామంది అడ్వాన్స్ గా బుక్ చేసిన టికెట్లు రద్దు చేసుకున్నారు. దీంతో రెండో రోజు ఈ సినిమా షేర్ సగానికి సగం పడిపోయింది.