ల‌క్ష్మిపార్వ‌తే లేక‌పోయి వుంటే…బాబు భ‌విష్య‌త్‌?

నంద‌మూరి ల‌క్ష్మిపార్వ‌తి అనే క్యారెక్ట‌రే లేక‌పోయి వుంటే… నారా చంద్ర‌బాబునాయుడి రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏంటి? అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే. 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా అధికార ద‌ర్పం ప్ర‌ద‌ర్శించినా, అలాగే టీడీపీకి అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారంటే అదంతా ల‌క్ష్మిపార్వ‌తి…

నంద‌మూరి ల‌క్ష్మిపార్వ‌తి అనే క్యారెక్ట‌రే లేక‌పోయి వుంటే… నారా చంద్ర‌బాబునాయుడి రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏంటి? అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే. 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా అధికార ద‌ర్పం ప్ర‌ద‌ర్శించినా, అలాగే టీడీపీకి అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారంటే అదంతా ల‌క్ష్మిపార్వ‌తి భిక్షే అని చెప్పాలి. ఎందుకంటే ప‌ద‌వీ కాంక్ష‌తో పిల్ల‌నిచ్చిన మామ ఎన్టీఆర్‌ను సైతం ముఖ్య‌మంత్రి పీఠం నుంచి కూల‌దోయ‌డానికి ల‌క్ష్మిపార్వ‌తి అనే మ‌హిళ‌ను చంద్ర‌బాబు అడ్డు పెట్టుకోవాల్సి వ‌చ్చింది. భీష్ముడిని అంత‌మొందించ‌డానికి పాండ‌వులు శిఖండిని అడ్డు పెట్టుకోడాన్ని మ‌హాభార‌తంలో చూశాం.

భీష్ముడు లాంటి ఎన్టీఆర్‌ను కూల‌దోయ‌డానికి చంద్ర‌బాబు కుట్ర‌పూరితంగా ల‌క్ష్మిపార్వ‌తిని అడ్డుపెట్టుకున్నార‌నేది జగ‌ద్వితం. ఆమె లేక‌పోతే ఎన్టీఆర్‌ను ప‌డ‌గొట్ట‌డానికి ఏ ర‌క‌మైన కుట్ర‌ల‌ను చంద్ర‌బాబు ర‌చించే వారో ఊహాతీతం. ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠ‌మ‌నేని ఉమామ‌హేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య‌పై ల‌క్ష్మిపార్వ‌తి అనుమానాలు వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆమె ఆత్మ‌హ‌త్య వెనుక చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ ఉన్నార‌ని ల‌క్ష్మిపార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం విధిత‌మే.

ఈ నేప‌థ్యంలో ల‌క్ష్మిపార్వ‌తి విమ‌ర్శ‌ల‌కు టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న ఇవాళ కౌంట‌ర్ ఇచ్చారు. ఆయ‌న ఏమ‌న్నారంటే…

“డ్రామా ఆర్టిస్ట్ లక్ష్మీపార్వ‌తితో ప్రెస్‌మీట్ పెట్టించారు. స్క్రిప్ట్ రాయించి ఇచ్చారు. అమ్మా ల‌క్ష్మిపార్వ‌తి ఎన్ని జ‌న్మ‌లిచ్చినా ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తారక‌మే. ఎన్టీఆర్‌కు ప‌ట్టిన చీడ పురుగు నువ్వు.  నీ లాంటి చీడ‌పురుగును ఎన్టీఆర్ భార్య‌గా లోకం ఒప్పుకోదు. ఎన్టీఆర్ భార్య అని నువ్వు చెప్పుకోవాల్సిందే. ఎన్టీఆర్ భార్య అంటూ చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌ను విమ‌ర్శించినంత మాత్రాన ఏమ‌వుతుంది? మీరంతా పెయిడ్ ఆర్టిస్టులై అలా మాట్లాడుతున్నారు” అని  బుద్ధా వెంక‌న్న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఎన్టీఆర్‌పై అభిమానం న‌టిస్తూ, ల‌క్ష‌లాది మంది ప్ర‌జానీకం సాక్షిగా పెళ్లాడిన మ‌హిళ‌ని మాత్రం భార్య కాద‌న‌డం టీడీపీ మార్క్ విద్వేష రాజ‌కీయానికి నిద‌ర్శ‌నం. ల‌క్ష్మిపార్వ‌తిని అడ్డు పెట్టుకునే క‌దా చంద్ర‌బాబు వెన్నుపోటు రాజ‌కీయాల‌కు తెర‌లేపింది. రాజ్యాంగేత‌ర శ‌క్తిగా ల‌క్ష్మిపార్వ‌తి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపిస్తూ… చివ‌రికి కురువృద్ధుడైన ఎన్టీఆర్‌ను సీఎం ప‌ద‌వి నుంచి కూల‌దోయ‌డానికి కూడా వెనుకాడ‌ని వైనాన్ని లోకం ఎప్ప‌టికీ మ‌రిచిపోదు. వెన్నుపోటుదారుడ‌నే మ‌చ్చ చంద్ర‌బాబును ఎప్పుడూ వెంటాడుతూనే వుంటుంది.

ల‌క్ష్మిపార్వ‌తి లేక‌పోయి వుంటే చంద్ర‌బాబు జ‌న్మ‌లో సీఎం అయ్యేవారా? అనే ప్ర‌శ్న ఎప్ప‌టికీ స‌జీవంగానే వుంటోంది. త‌న‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి, టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వి, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు త‌దిత‌ర ప‌ద‌వుల‌న్నీ ప‌రోక్షంగా ల‌క్ష్మిపార్వ‌తి భిక్షే అనే అభిప్రాయాల్ని కొట్టి పారేయ‌గ‌ల‌మా? ల‌క్ష్మిపార్వ‌తితో రాజ‌కీయంగా, వ్య‌క్తిగ‌తంగా టీడీపీకి ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు. కానీ ఎన్టీఆర్ పెళ్లాడిన మ‌హిళ‌ను ప‌ట్టుకుని భార్యే కాద‌ని చెప్ప‌డం బుద్ధి లేని మాట‌లు త‌ప్ప మ‌రొక‌టి కాద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ల‌క్ష్మిపార్వ‌తి ఫొటో పెట్టుకుని చంద్ర‌బాబు, లోకేశ్ ప్ర‌తిరోజూ పూజ‌లు చేసినా, ఆమె రుణం తీర్చుకోలేర‌ని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు. ఎందుకంటే ల‌క్ష్మిపార్వ‌తి వ‌ల్ల అత్య‌ధిక ల‌బ్ధి పొందింది చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడే. న‌ష్ట‌పోయింది నంద‌మూరి కుటుంబం.