ఆంధ్రప్రదేశ్‌లో ఇంత దుర్మార్గ రాజకీయం గతంలో ఎప్పుడూ లేదు. ఏపీతో పోల్చితే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రాజకీయం ఎన్నో రెట్లు నయం అనేది మెజార్టీ ప్రజానీకం అభిప్రాయం. ఒక పార్టీ అధికారంలో వుంటే, మరో పార్టీకి, సంబంధిత నాయకులకు అసలు మనుగడ వుండదనే ఆందోళన ఏపీలో నెలకుంది. ఇదే ఏపీ సమాజాన్ని భయపెడుతోంది. అధికారం శాశ్వతం కాదు. ఐదేళ్లకో, పదేళ్లకో ఎంత మంచి ప్రభుత్వమైనా మారడం సర్వసాధారణం.
కానీ ఏపీలో ఆ లాజిక్‌ను అధికార, ప్రతిపక్ష పార్టీలు విస్మరించాయి. ఐదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయడం, వీలైతే భౌతికంగా అంతం చేయడమే లక్ష్యంగా కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి తెగబడుతున్నారనే చర్చకు తెరలేచింది.
ఈ ధపా అధికారంలోకి రాకపోతే లేదా నిలబెట్టుకోకపోతే… వామ్మో ఇంకేమైనా వుందా? ఆంధ్రప్రదేశ్‌ను విడిచి పెట్టాల్సిందే అని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు. ఇలాంటి దుర్మార్గ పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల భయాందోళన చూస్తే… ఈ సమాజం ఎటు పోతోందనే నిరాశ, నిస్పృహ కలగకుండా వుండవు.
రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా, శత్రుభావనతో చూడడం వల్లే ఏపీలో అవాంఛనీయ పరిస్థితుల్ని చూడాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఇలాంటి పరిస్థితి వుండేది కాదు. ఎన్నికల సందర్భంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత యధావిధిగా తమ పనులు చేసుకునే వారు.
అలాగని గతంలో అంతా పారదర్శక రాజకీయం జరిగిందని కాదు. ఇప్పుడంత అధ్వానం కాదని మాత్రం ఎవరైనా చెప్పేమాట. ఇప్పుడు రాజకీయాల్లో పార్టీల కంటే మీడియా చొరబాటు ఎక్కువైంది. రాజకీయ పార్టీల కంటే మీడియా యజమానులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్వేషాల్ని రెచ్చగొట్టడం చూస్తున్నాం. బహుశా వినాశకాల విపరీత పోకడలంటే ఇవే కాబోలు.
ఏపీలో ప్రస్తుత రాజకీయాల్ని చూస్తుంటే. భవిష్యత్‌లో బాగు పడే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలాగే రాజకీయాలు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ సమాజం సర్వనాశనం కావడానికి ఎంతో దూరం లేదనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఏపీ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి అక్కడి రాజకీయాలే అని చెప్పక తప్పదు. ఇందులో ఒకరెక్కువ, ఇంకొకరు తక్కువ అని చెప్పడానికి లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలు… దొందు దొందే. అధికారం అంటే ప్రత్యర్థులను తుదిముట్టించడానికే అన్నట్టుగా ఏపీలో పదేళ్లుగా పాలన సాగుతోంది. ఏపీలో ఈ దుస్థితి ఇంకెన్నేళ్లు చూడాలో అర్థం కావడం లేదని రాష్ట్ర శ్రేయోభిలాషులు వాపోతున్నారు.