దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి కడప కంచుకోట. ఇందులో రెండో అభిప్రాయానికి చోటు లేదు. అయితే ఆయన మరణానంతరం వైఎస్ కుటుంబం అంటే అర్థం మారింది, మారుతోంది. వైఎస్సార్ కుటుంబం రాజకీయంగా, వ్యక్తిగతంగా నిలువునా చీలింది. చివరికి ఏ లెవెల్‌లో చీలిపోయిందంటే… వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టిన వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డిని కాదని, తన కుమార్తె, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను గెలిపించాలని విజయమ్మ ఏకంగా వీడియో విడుదల చేసేంతగా. వైఎస్సార్ అభిమానులకు ఇది జీర్ణించుకోలేనిది. నమ్మశక్యం కానిది.
జగన్ పార్టీకి ఓట్లు వేయొద్దని ఆయన తల్లి విజయమ్మ కోరుతున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తుంటే, సమాధానం చెప్పుకోడానికి ఇబ్బందికర పరిస్థితిని వైసీపీ నేతలు ఎదుర్కొంటున్నారనేది చేదు నిజం. వైఎస్ విజయమ్మకు కూతురు షర్మిల కంటే, వైఎస్ జగన్ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఔనన్నా, కాదన్నా ఇది పచ్చి నిజం. ఒకవేళ జగన్ విశాల రాజకీయ ప్రయోజనాలను విజయమ్మ దృష్టిలో పెట్టుకుని వుంటే, షర్మిలకు వైఎస్సార్ అభిమానులు ఓట్లు వేయాలని విజయమ్మ అభ్యర్థించే వారు కాదు. విజయమ్మ కూడా వ్యక్తిగత స్వార్థంతో ఆలోచించారు. తాను, తన కూతురు షర్మిల కోరుకున్నట్టుగా ఆర్థిక ప్రయోజనాల్ని కలిగించలేదని విజయమ్మ ఆవేదనగా వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్న మాట.
మహాభారతంలో కర్ణుడిని శాపాలు చుట్టుముట్టినట్టు జగన్‌ను కూడా ఇంటాబయటా అందరూ ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో యుద్ధం ప్రకటించారు. మరోవైపు జగన్ స్వీయ తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి. శత్రువుల్ని సంపాదించుకోవడం ఎలా? అని ఎవరైనా పుస్తకం రాయాలని అనుకుంటే… జగన్ రాజకీయ, వ్యక్తిగత జీవితం చక్కటి పాఠం అవుతుంది. ఏ ఒక్కరితోనూ ఆయనకు సత్సంబంధాలు వుండవు. జగన్‌కు ఆయన చుట్టూ వున్న వాళ్లే ప్రపంచం. ఆ చుట్టూ ఉన్న వాళ్లెవరైనా పద్ధతి గల వ్యక్తులా? అంటే… అందరూ చూస్తున్నదే కాబట్టి, ఎవరికి వారు సమాధానం చెప్పుకోవలసిందే.
ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలతో మమేకం అయిన జగన్, సీఎం అయిన తర్వాత పూర్తిగా మారిపోయారు. ప్రజలకు దూరమయ్యారు. అప్పుడప్పుడు బటన్ నొక్కడానికి నియోజకవర్గాల పర్యటలనకు వెళ్లారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో మాత్రమే ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయటికొచ్చారు. గత ఐదేళ్లలో సొంత పార్టీ నాయకులకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనే విమర్శలు ఎక్కువే.
మరీ ముఖ్యంగా తన కుటుంబానికి బలమైన పట్టు వున్న వైఎస్సార్ జిల్లాను జగన్ పూర్తిగా వదిలేశారు. అలాగే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందులలో ఏ ఒక్కర్నీ పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్సార్ జిల్లా బాధ్యతల్ని తన తమ్ముడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి అప్పజెప్పారు. తన అన్న అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేయడంలో అవినాష్‌రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని వైఎస్సార్ జిల్లా ప్రజానీకం అంటున్న మాట.
అందుకే ఇవాళ కడప జిల్లాలో వైసీపీ గెలుపు సీట్లపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఖచ్చితంగా గెలిచే సీట్లు ఏవి అంటే… పులివెందుల, బద్వేలు అని మాత్రమే సమాధానం వస్తోంది. కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో నువ్వానేనా అన్నట్టు ఎన్నికలు జరిగాయి. మరీ ముఖ్యంగా ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు ఎక్కువగా ఉన్న, అలాగే వైసీపీకి అన్ని రకాలుగా అనుకూలమైన కడప నగరంలో ఇవాళ టీడీపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని బలంగా చెబుతున్నారు. దీంతో సొంత జిల్లాలో ఎలాంటి పరిస్థితి వుందో జగన్‌కు తెలియదని అనుకోవాలా? తెలిసినా, తనను చూసి వైసీపీకి ఓట్లు వేస్తారనే అహంకారం అనుకోవాలా? కడపలో టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి గెలిచినా జగన్ ఆశ్చర్యపోనవసరం లేదు.
జగన్ ముద్దుగా పిలుచుకునే నవాబ్ అంజాద్ బాషా తమ్ముడు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా దారుణంగా ప్రవర్తించారు. అంజాద్ బాషా, ఆయన సోదరుడు, ఇతర బంధువుల చేష్టలు కడప నగరంలో వైసీపీకి నష్టం జరిగేలా వుందని తెలిసి కూడా… అభ్యర్థిని మార్చలేదంటే జగన్‌ను ఏమనాలి? ఎన్నికల ప్రచారంలో భాగంగా కడపకు వెళ్లిన జగన్… తనకు చూసి ఓట్లు వేయాలని, ఏవైనా తప్పులు జరిగి వుంటే క్షమించాలని వేడుకున్నారు. ఇదే సందర్భంలో అంజాద్ బాషాను కడప నగర ప్రజానీకానికి అసలు పరిచయమే చేయలేదంటే… ఎన్నికల నాటికి ఆయనకు తత్వం బోధపడి, భయం పట్టుకుందని అర్థం చేసుకోవాలి.
ఇక నియోజకవర్గాల్లో చూస్తే… ఎమ్మెల్యేలు సామంత రాజుల్లా ప్రవర్తించారు. రాష్ట్రంలో భారీగా అభ్యర్థుల్ని మార్చిన జగన్… సొంత జిల్లాలో రాజంపేట మినహా మరే అభ్యర్థిని మార్చకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కమలాపురంలో తన మేనమామ, సిటింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఏమంత చక్కనైన నాయకుడని మూడోసారి కూడా ఆయనకే టికెట్ ఇచ్చారో జగన్‌కే తెలియాలి. ఒక్క రవీంద్రనాథ్‌రెడ్డి మాత్రమే కాదు… ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న సిటింగ్ ఎమ్మెల్యేలపై జగన్ కరుణ చూపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కడప అంటే వైఎస్సార్ కంచుకోట అనే పాత వాసనతో… అన్ని చోట్లా వైసీపీ గెలుస్తుందని నమ్మకంగా చెప్పడమే తప్ప, అందుకు తగ్గ ఆధారాలు ఏ ఒక్కరి దగ్గర లేవు.
ఇక జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందులకు వెళితే… జగన్‌పై ఏమంత గొప్ప అభిప్రాయం లేదు. కేవలం మనోడు ముఖ్యమంత్రి, టీడీపీకి ఓట్లు వేయలేక వైసీపీకి అండగా నిలుస్తున్నామని చెప్పేవాళ్లే ఎక్కువ. పులివెందులలో వైఎస్ భాస్కర్‌రెడ్డి కుటుంబంపై జనంలో మంచి అభిప్రాయం లేదన్నది చేదు నిజం. కానీ ఆ కుటుంబానికే జగన్ పెద్దపీట వేయడం పులివెందుల నియోజకవర్గంలో మెజార్టీ ప్రజానీకానికి ఏ మాత్రం నచ్చడం లేదు. జగన్‌ను కాదనుకోలేక, ఇష్టం ఉన్నా లేకపోయినా వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నామని అక్కడి ప్రజలు అంటున్నారు. ఈ దఫా ఎన్నికల్లో అవినాష్‌రెడ్డి అంటే ఇష్టం లేని వారంతా షర్మిలకు ఓటు వేశామని చెప్పడం గమనార్హం.
అవినాష్‌రెడ్డి చుట్టూ ఒక కోటరీ వుంటుంది. ఆ కోటరీ చెప్పినట్టే అవినాష్ వింటారని, వ్యక్తిగతంగా ఏదైనా ఆయనకు చెప్పుకుందామని అనుకుంటే అవకాశం ఇవ్వరని ఏ నోట విన్నా వినిపించే మాట. అంతేకాదు, అవినాష్‌రెడ్డిని కలవాలంటే, తెల్లవారుజామున నాలుగైదు గంటలకల్లా ఆయన ఇంటి వద్ద కాపలా వుండాల్సి వస్తోందని, లేదంటే ఆయన్ను పట్టుకోవడం కష్టమని కడప ప్రజానీకం చెబుతున్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో వివేకానందరెడ్డి ఏ సమయంలో అయినా, ఎవరికైనా అందుబాటులో వుండేవారని కడప ప్రజానీకం చెబుతోంది.
వైఎస్సార్‌కు వివేకా రాజకీయంగా బలమని, కానీ జగన్‌కు అవినాష్‌రెడ్డి బలహీనత అనే విమర్శ బలంగా వినిపిస్తోంది. పులివెందుల ప్రజలకు జగన్ రోజురోజుకూ దూరమవుతూ వచ్చారు. సీఎంగా వైఎస్సార్, జగన్ మధ్య పోల్చుకుంటూ… ఎంతైనా పెద్దాయన పెద్దాయనే అబ్బా .. ఏందో ఈయబ్బి ఎవరికీ చిక్కడు, దొరకడు అని పులివెందుల ప్రజలు ఆవేదనతో అంటున్నారు. ఇలాంటి అసంతృప్తి, తమకు దూరమయ్యాడని, అలాగే సరైన నాయకుడిని తమకు అందుబాటులో ఉంచలేదనే ఆవేదన… ఈ ఎన్నికల్లో తప్పక చూపుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్‌కు కళ్లు తెరిపించే ఫలితాల్ని కడప ప్రజానీకం కట్టబెడుతుందనే చర్చకు తెరలేచింది. తాను ఇలాగే వుంటా, తానింతే అని ఇంతకాలం జగన్ మడి కట్టుకుని ఉన్నారు. ఏ రాజకీయ నాయకుడైనా భయపడేది ప్రజాతీర్పునకే. ఇందుకు జగన్ అతీతుడు కాదని నిరూపించే తీర్పు త్వరలో వెలువడనుంది. అధికారం దక్కించకున్నా… ప్రజలంటే భయభక్తులతో ఒళ్లు దగ్గర పెట్టుకుని నడుచుకునేలా ప్రజలు హెచ్చరిక లాంటి తీర్పు ఇవ్వనున్నారు. అది కడప నుంచే ప్రారంభం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.