ఒక్కసారి పెళ్లైపోయాకా.. ఇక ప్రత్యేకంగా ప్రేమను వ్యక్తీకరించాల్సిన అవసరం ఏముంటుందనేది మనుషుల్లో సహజంగా అలవడే తత్వం! దీనికి కొందరు మినహాయింపుగా వ్యవహరించగలరేమో కానీ, చాలా మందిలో మాత్రం దంపతులు అయ్యాకా ఇక ప్రత్యేకంగా ప్రేమను వ్యక్తీకరించడం ఎబ్బెట్టుగా ఉంటుందనే తత్వమే ఉంటుంది! ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా పెళ్లయ్యాకా.. పాత రీతిన ఉండలేరు! అదంతే! అయితే.. దాంపత్యంలో అయినా ప్రేమను వ్యక్తం చేసే తత్వం చాలా ముఖ్యమని రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ అంటారు. అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా.. ప్రేమను వ్యక్తం చేయడం చాలా కీలకం అంటున్నారు. అందునా.. పార్ట్ నర్ కు అర్థమయ్యే రీతిలో ప్రేమను వ్యక్తీకరించడం ముఖ్యమని వారు చెబుతున్నారు! ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ప్రేమను వ్యక్తీకరించడం, అందునా పార్ట్ నర్ కు అర్థమయ్యే రీతిన ప్రేమను వ్యక్తీకరించడం!
మాటల్లో వ్యక్తీకరించాలి!
భార్యకు ఐలవ్యూ చెప్పేవాళ్లు ఎంతమంది ఉంటారో కానీ, మాటల్లో ప్రేమను వ్యక్తీకరించే పద్ధతి చాలా ప్రభావవంతమైనదనేది గుర్తెరగాల్సిన విషయం! మాటల్లో ప్రేమను వ్యక్తీకరించగలిగితే, పార్ట్ నర్ ఆనందపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి! అయితే ఈ విషయంలో చాలా మందికి మొహమాటాలుంటాయి. అయితే దాంపత్యంలో అవేం ఉండకూడదనేది నిపుణులు చెప్పే మాట!
సమయాన్ని కేటాయించడం!
పార్ట్ నర్ ఆసక్తుల మేరకు మీరు కూడా సమయం కేటాయించడం అనేది ప్రేమ వ్యక్తీకరణగానే భావించాలి. ఒక మనిషికి టైమ్ కేటాయించడం అంటే.. వారిపై ఉన్న గౌరవానికి, ప్రేమకు అది చాలా నిదర్శనం! పార్ట్ నర్ తమకు ఇలా సమయం కేటాయిస్తున్నాడంటే వారిని ప్రేమను కూడా అర్థం చేసుకోవచ్చు!
యాక్ట్ ఆఫ్ సర్వీస్!
ఎప్పుడూ ప్రేమను మాటల్లోనే వ్యక్త పరచలేం, మాటల్లో వ్యక్త పరిచే ప్రేమ సరిపోకపోవచ్చు కూడా! కాబట్టి.. పార్ట్ నర్ కు సేవలు చేసే గుణం కూడా ఉండాలి! ప్రత్యేకించి భార్యకు భర్తలు చేసే సేవలు చిన్న చిన్నవే కావొచ్చు! కానీ విసుక్కోకుండా, అది తన పని కాదన్నట్టుగా కాకుండా వ్యవహరిస్తే అది కూడా ప్రేమ వ్యక్తీకరణలో ప్రముఖమైనది!
ఫిజికల్ టచ్!
మాటల్లో, సేవల్లో ప్రేమ కురిపిస్తే కలిగే ఆనందం ఒక ఎత్తు అయితే ఫిజికల్ టచ్ తో కలిగే ఆనందం మరింత ఎక్కువ! ఫిజికల్ టచ్ అనగానే.. ప్రతిసారీ సెక్సే కాదు! ఒక కౌగిలింతో, ఒక సాన్నిహిత్యమైన స్పర్శ, దగ్గరగా మసలడమో.. ఇదంతా ఫిజికల్ టచ్ కిందకే వస్తుంది! ఇది ప్రేమకు తార్కాణం కూడా!
బహుమతులు ఇవ్వడం!
ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయిలు అమ్మాయిలకు బహుమతులను ఇవ్వడానికి ఎగబడతారు. అయితే పెళ్లయ్యాకా.. కూడా అదే ధోరణి ఎక్స్ పెక్ట్ స్త్రీలు! చిన్నవో పెద్దవో వారుకోరినవో.. అది గిఫ్ట్ లా ఇస్తే అది వారికి చాలా సంతోషం! మగాళ్లకు భార్య నుంచి ఇలాంటి బహుమతుల పట్ల పెద్ద ఆసక్తి లేకపోయినా, స్త్రీలో ఈ ఆశించే తత్వం ఉంటుంది!
వారు చెప్పేది వినడం!
ఇది చాలా మంది మగవాళ్లకు కష్టమైన అంశం. భార్య చెప్పేది చాలా సార్లు నాన్ సెన్స్ గానూ, అనవసరమైనది గానూ, అర్థం లేనిది గానూ, అసందర్భమైనది గానూ అనిపిస్తుంది! అయితే.. అదెలాంటిదైనా వారు చెప్పుకుంటున్నది వినడం మాత్రం అవసరం! తమ మాటను తమ భర్త కనీసం విపులంగా వింటున్నాడు అనేది కూడా అతడు తమపై చూపుతున్న ప్రేమకు ఆధారంగానే పరిగణిస్తారు స్త్రీలు!