కష్ట సమయంలో ఓదార్చే వారు పక్కన ఉండాలని సీనియర్ నటుడు నరేష్ అన్నారు. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని తట్టుకోలేక, ఆమె సన్నిహితుడైన మరో నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై నటుడు నరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మనకు సర్వస్వం అనుకునే వారు ఆకస్మికంగా మనల్ని విడిచి దూరంగా వెళ్లినప్పుడు ఎంతో బాధ కలుగుతుందని ఆయన అన్నారు. అలాంటి కష్ట సమయంలో మనల్ని ఓదార్చే వారు పక్కన వుండాలని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తన స్వీయ అనుభవాల్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
గతంలో ఉమ్మడి కుటుంబాలు వుండేవన్నారు. కుటుంబంలో ఎవరికైనా కష్టం వస్తే, మిగిలిన వారంతా అండగా నిలిచే వారన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి లోకం వారిదైందన్నారు. తన తల్లి విజయనిర్మల చనిపోయినప్పుడు.. తాను, సూపర్‌స్టార్ కృష్ణ ఎంతో బాధపడ్డట్టు గుర్తు చేశారు. ఆ సమయంలో ఒకర్కొకరు ఓదార్చుకున్నట్టు ఆయన తెలిపారు.
కుటుంబంలో ఎవరైనా బాధపడుతుంటే అండగా నిలవాలని ఆయన కోరారు. బిజీ లైఫ్‌లో పక్కవారి గురించి ఆలోచించడం మానేసే వైఖరి మారాలని ఆయన కోరారు. నటి పవిత్ర మృతితో లోకంలో తనకెవరూ లేరని చందు ఒంటరిగా కుమిలిపోయాడన్నారు. ఆ బాధే అతన్ని ఆత్మహత్యకు ఉసిగొల్పిందన్నారు.