బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకోవడంపై సంచలన రిపోర్ట్ వెలువడినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్‌లో రేవ్‌పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్న సంగతి తెలిసిందే.
డ్రగ్స్ తీసుకున్నారనే ప్రచారం జరిగింది. దీంతో రేవ్ పార్టీలో పాల్గొన్న 106 మంది బ్లడ్ శాంపిల్స్ నార్కోటిక్ టీమ్ తీసుకుంది. వీరిలో సీనియర్ నటి హేమ కూడా ఉన్నారు. తాజాగా హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు స్పష్టమైంది. ఈ విషయాన్ని నార్కొటిక్ టీమ్ పేర్కొనడం సంచలనం రేకెత్తిస్తోంది. హేమతో పాటు మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నార్కోటిక్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
ఇదిలా వుండగా పాజిటివ్ వచ్చిన వారందరికీ సీసీబీ సమన్లు జారీ చేసింది. డ్రగ్స్ తీసుకున్న వారందరికీ కౌన్సిలింగ్ ఇవ్వనున్నారని తెలిసింది. రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొనడంపై అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసలు తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని హేమ ఓ వీడీయో విడుదల చేశారు. కానీ ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు బెంగళూరు పోలీస్ అధికారులు తేల్చి చెప్పారు.
కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన హేమపై పోలీస్ అధికారులు సీరియస్ అయ్యారనే వార్తలొచ్చాయి. తాజాగా డ్రగ్స్ తీసుకున్నట్టు వైద్య నివేదికలు వెల్లడైన నేపథ్యంలో హేమ స్పందన ఎలా వుంటుందో అనే చర్చకు దారి తీసింది. ఏది ఏమైనా హేమ రీల్ నటే కాదు, రియల్ నటి అని కూడా రేవ్ పార్టీ ఉదంతం నిరూపించిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.