ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ పట్టుదలతో ఉంది. తెలంగాణ మేనిఫెస్టోలో బీజేపీ ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై స్పష్టంగా పేర్కొంది. పశ్చిమబెంగాల్లో ముస్లిం రిజర్వేషన్లపై అక్కడి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముస్లింలని ఓబీసీలో చేర్చడాన్ని కలకత్తా హైకోర్టు తప్పు పట్టింది. పశ్చిమబెంగాల్లో 75 ముస్లిం కులాలని ఓబీసీలో చేర్చి రిజర్వేషన్ కల్పించడాన్ని కొట్టి వేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్ తీర్పు నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముస్లింలని ఓబీసీలో చేర్చడాన్ని కలకత్తా హైకోర్టు తప్పు పట్టిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం సమాజాన్ని ఒక వస్తువుగా పరిగణిస్తున్నారని ఆయన ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాలకు, ముస్లిం సంతుష్టీకరణకు చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చిందని ఆయన ప్రశంసించారు. ఇకనైనా ఓటు బ్యాంక్ రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆయన కోరారు.
పశ్చిమబెంగాల్ లో జరిగినట్టే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని బీసీ- ఈలో ముస్లింలను చేర్చారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కలకత్తా హైకోర్టు తీర్పు ఇక్కడ కూడా వర్తిస్తుందని ఆయన అన్నారు. బీసీల హక్కులను కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు. దేశ వ్యాప్తంగా కలకత్తా హైకోర్టు తీర్పును తమ పార్టీ స్వాగతిస్తోందన్నారు. వ్యతిరేకించే వారి దిష్టి బొమ్మను దగ్ధం చేయాలని పిలుపునిస్తున్నామని లక్ష్మణ్ అన్నారు.