ఆంధ్రప్రదేశ్లో సీఎం ఎవరు ఉండాలో ప్రధాని మోదీ నిర్ణయిస్తారని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. సంచలన కామెంట్స్ చేయడంలో నారాయణకు ప్రత్యేక గుర్తింపు వుంది. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో గొడవలు జరుగుతుంటే సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబునాయుడు బాధ్యతారాహిత్యంగా విదేశాలకు వెళ్లిపోయారనని తప్పు పట్టారు.
ఏపీలో ఎన్నికలు ముగిశాక తన్నుకు చావండి అనే రీతిలో అధికార, ప్రతిపక్ష పార్టీ ముఖ్య నాయకులు బాధ్యతా రాహిత్యంగా వెళ్లిపోయారని విమర్శించారు. ఇదెక్కడి పద్ధతి అంటూ ఆయన నిలదీశారు. ఏదో విజయం సాధిస్తున్నట్టుగా విదేశాలకు విహార యాత్రలకు వెళ్తారా? అని ఆయన ప్రశ్నించారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలు తారుమారుగా వుంటాయని ఆయన అన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం ముఖ్యమంత్రిగా ఎవరుండాలో ప్రధాని మోదీ నిర్ణయిస్తారనే నారాయణ వ్యంగ్య కామెంట్స్ కాక రేపుతున్నాయి. ఇటు అధికార, అటు ప్రతిపక్ష నేతలంతా బీజేపీ అనుకూలురనే ఉద్దేశంతో నారాయణ సెటైర్ విసిరారు.
ఏపీలో ఒక్క సీటు లేకపోయినా, బీజేపీనే అధికారం చెలాయిస్తోందని అనేక సందర్భాల్లో వామపక్ష నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే జరగనుందని సీపీఐ నారాయణ పేర్కొనడం చర్చనీయాంశమైంది.