ఏపీలో ఎన్నికల కమిషన్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలకు ఎన్నికల కమిషన్ కొమ్ము కాస్తోందనే ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం విధ్వంసానికి పాల్పడ్డ వీడియో లీక్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ యధేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడినప్పటికీ, ఆ వీడియోలు ఎందుకు బయట పెట్టలేదనే నిలదీత వైసీపీ నుంచి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూలంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించిందనే విమర్శ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ తీరుపై అనుమానం వ్యక్తం చేశారు.
ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోలను ఎవరు బయట పెట్టారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారని అనిల్‌కుమార్ యాదవ్ ఆరోపించారు. చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారన్నారు. అలాగే తుమ్మురుకోట, వబుచెర్లలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారని అనిల్ ఆరోపించారు. టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని ఆయన అన్నారు.
పాల్వాయిగెటు ప్రాంతంలో టీడీపీ విధ్వంసానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడిన వీడియోలు ఎందుకు బయటికి రాలేదని ఆయన ప్రశ్నించారు. ఎనిమిది చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్క చోటే వీడియో ఎందుకు బయటికొచ్చిందని ఆయన నిలదీశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను కొడుతున్న వీడియోలు ఈసీకి కనిపించలేదా? అని అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.