మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేటు గ్రామంలోని ఒక బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేయడంపై తీవ్ర వివాదం నెలకుంది. మాచర్ల నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు కొన్ని చోట్ల విధ్వంసానికి తెగబడ్డారు. అయితే కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యే దుశ్చర్యకు సంబంధించిన వీడియో మాత్రమే లీక్ కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనల్ని ఎవరు ఉల్లంఘించినా, అందుకు సంబంధించిన వీడియోలను బయట పెట్టాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం కూటమికి మాత్రమే ఒత్తాసు పలుకుతామనే రీతిలో వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాచర్ల ఎమ్మెల్యేకి సంబంధించి మాత్రమే వీడియోలు లీక్ కావడంపై జవాబు చెప్పాలనే నిలదీతపై ఏపీ సీఈవో ముకేశ్‌కుమార్ మీనా ఎట్టకేలకు స్పందించారు.
ఆ వీడియోను తాము విడుదల చేయలేదని ఆయన తేల్చి చెప్పడం గమనార్హం. ఎన్నికల కమిషన్ నుంచి వీడియో బయటికి వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆ వీడియో ఏ విధంగా లీక్ అయ్యిందో తెలుసుకుంటామని ఆయన చెప్పారు. దర్యాప్తులో భాగంగా ఎవరో లీక్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల కమిషన్ తీరు… తామెవరికీ జవాబుదారీ కాదన్నట్టుగా ఉందనే విమర్శ వ్యక్తమవుతోంది.
అందుకే ఎన్నికల కమిషన్ తాను చెప్పిందే వేదమన్నట్టు వ్యవహరిస్తోంది. తాము చెప్పిందే వినాలి తప్ప, ఎవరైనా ఏం అడిగినా స్పందించమన్నట్టుగా ముకేశ్‌కుమార్ మీనా స్పందన వుందనే మాట వినిపిస్తోంది. అధికార పార్టీ నేతలపై మాత్రమే చర్యలు తీసుకోడానికే ఎన్నికల కమిషన్ ఉందనే అభిప్రాయాన్ని ఆ సంస్థ పనితీరే చెబుతోంది.