హేమపై కరాటే కల్యాణికి ఎందుకంత కోపం?

బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ అడ్డంగా దొరికారు. ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు పోలీసులు నిర్థారించడంతో పాటు.. ఆమె డ్రగ్స్ కూడా సేవించినట్టు వెల్లడించారు. ఆ మేరకు డ్రగ్స్ పరీక్షల్లో హేమ పాజిటివ్…

బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ అడ్డంగా దొరికారు. ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు పోలీసులు నిర్థారించడంతో పాటు.. ఆమె డ్రగ్స్ కూడా సేవించినట్టు వెల్లడించారు. ఆ మేరకు డ్రగ్స్ పరీక్షల్లో హేమ పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే.

హేమ వ్యవహారంపై పరిశ్రమ నుంచి పెద్దగా స్పందనల్లేవు. ఒక్క కరాటే కల్యాణి మాత్రం ఆమెపై విమర్శలు చేస్తున్నారు. హేమ పేరు బయటకొచ్చిన వెంటనే రియాక్ట్ అయిన కరాటే కల్యాణి, ఈరోజు మరోసారి ఆమె వ్యవహారంపై స్పందించారు. ఇంతకీ హేమపై కరాటే కల్యాణికి ఎందుకంత కోపం?

“మా అసోసియేషన్ ఎన్నికల్లో నా మీద కేసులు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లింది హేమ. నేను ఫ్రెండ్స్ తో సరదాగా పేకాట ఆడినప్పుడు పోలీసులు పట్టుకుంటే, అదేదో పెద్ద నేరం లాగ మాట్లాడింది. ఇప్పుడు నువ్వు ఏం చేశావ్ హేమక్కా. రేవ్ పార్టీలో డ్రగ్స్ తో పాటు దొరికావ్. బెంగళూరు పోలీసులు కచ్చితంగా నీకు శిక్ష వేస్తారు.”

బెంగళూరు పోలీసులతో పాటు, ఇక్కడ కూడా హేమకు పనిష్మెంట్ తప్పదంటున్నారు కరాటే కల్యాణి. కర్మ ఎవ్వర్నీ విడిచిపెట్టదని, ఇకనైనా నోరు పారేసుకోవడం తగ్గించుకోవాలని సూచించారు. హేమకు మా అసోసియేన్ సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం కూడా ఉందంటున్నారు కరాటే కల్యాణి.

హేమ అలియాస్ కృష్ణవేణి

ఇక ఈ కేసుకు సంబంధించి కొత్త కొత్త వివరాలు బయటకొస్తూనే ఉన్నాయి. రేవ్ పార్టీలో రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు పోలీసులకు తన పేరును కృష్ణవేణిగా చెప్పారట హేమ. దీంతో వాళ్లు అదే పేరుతో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆమె పేరు హేమ అనే విషయాన్ని తెలుసుకున్నారు. పోలీస్ రైడ్ వివరాలు బయటకొచ్చిన తర్వాత మీడియా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇలా పేరు మార్చి చెప్పడమే కారణం.

ఇక హేమ ఇచ్చిన స్టేట్ మెంట్ పై కూడా ఆధారాలు బయటకొచ్చాయి. రేవ్ పార్టీ మేటర్ బయటకొచ్చిన వెంటనే హేమ ఓ వీడియో రిలీజ్ చేశారు. తను ఎక్కడికి వెళ్లలేదని, తన ఫామ్ హౌజ్ లోనే ఉన్నానంటూ ప్రకటించుకున్నారు. కానీ హేమ, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లిన ఫ్లయిట్ టికెట్ కాపీలు బయటకొచ్చాయి.

ఏం చేసుకుంటారో చేసుకోండి..

ఈ మొత్తం వ్యవహారంపై ఓ మీడియా ఛానెల్ ఆమెను సంప్రదించగా.. ఆమె సమాధానం దాటేశారు. తాను ఇప్పుడే మాట్లాడనని, సమయం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడతానని, ఈలోగా ఏం చేసుకుంటారో చేసుకోమంటూ మాట్లాడారు. డ్రగ్స్ కేసులో పాజిటివ్ గా తేలడంతో, హేమకు నోటీసులిచ్చేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమౌతున్నారు. ఆమెను పునరావాస కేంద్రానికి తరలించి, కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు.