Advertisement

Advertisement


Home > Politics - Analysis

జోష్‌లో వైసీపీ.. నిరుత్సాహంలో కూట‌మి

జోష్‌లో వైసీపీ.. నిరుత్సాహంలో కూట‌మి

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో వైసీపీలో జోష్ క‌నిపిస్తోంది. మ‌రోవైపు కూట‌మిలో తీవ్ర నిరుత్సాహం. రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. రెండు నెల‌ల క్రితం టీడీపీ పుంజుకుంద‌న్న భావ‌న క‌లిగింది. అయితే దారిన పోయే శ‌నిని చంద్ర‌బాబు నెత్తికెత్తుకున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో విస్తృతంగా న‌డుస్తున్న చ‌ర్చ ఏంటంటే... వైసీపీకి సీట్లు త‌గ్గొచ్చు, అధికారం మాత్రం ఖాయం అని.

ఏపీ రాజ‌కీయ ప‌రిణామాలు ఇదే చెబుతున్నాయి. జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్న స‌మ‌యంలో కూడా టీడీపీకి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని అంతా అనుకున్నారు. వైసీపీ భ‌య‌ప‌డింది కూడా. ఈ రెండు పార్టీల క‌ల‌యిక‌తో ముఖ్యంగా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో వైసీపీ తుడిచి పెట్టుకుపోతుంద‌ని ఆ పార్టీ నాయ‌కులే ఆందోళ‌న చెందారు. అయితే పొత్తులో జ‌న‌సేన‌కు అతి త‌క్కువ సీట్లు కేటాయించార‌నే అసంతృప్తి, అలాగే ఆ ఇచ్చిన వాటిలో కూడా ప‌వ‌న్ పార్టీ కోరుకున్న నియోజ‌క‌వ‌ర్గాలు కేటాయించ‌లేద‌నే అసంతృప్తి ఏర్ప‌డింది.

దీంతో ఇరుపార్టీల మ‌ధ్య ఓట్ల బ‌దిలీపై అనుమానాలు త‌లెత్తాయి. 24 నుంచి 21కి, అలాగే 3 పార్ల‌మెంట్ స్థానాల నుంచి రెండింటికి జ‌న‌సేన త‌గ్గ‌డంతో చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోయ‌డానికే త‌ప్ప‌, ప‌వ‌న్‌కు ఆత్మాభిమానం లేద‌నే ఆలోచ‌న ఆయ‌న్ను స‌మ‌ర్థించే కాపుల్లో క‌లిగింది. దీంతో ఒక్కొక్క‌రుగా ఆ పార్టీకి దూర‌మ‌వుతూ వ‌స్తున్నారు. బీజేపీతో పొత్తు త‌ర్వాత కూట‌మి రాజ‌కీయ గ్రాఫ్ మ‌రింత ప‌డిపోతూ వ‌స్తోంది.

బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ, ఆరు పార్ల‌మెంట్ స్థానాల్లో గెలిచేది ఎన్ని అని ప్ర‌శ్నిస్తే... గుండు సున్నా అనే స‌మాధానం వ‌స్తోంది. బీజేపీతో పొత్తు వ‌ల్ల ముస్లిం, క్రిస్టియ‌న్, ద‌ళిత మైనార్టీల ఓట్ల‌న్నీ కూట‌మికి దూర‌మ‌వుతాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. బీజేపీతో పొత్తు వ‌ల్ల ఉప‌యోగం ఏమీ లేద‌నే నిర్ధార‌ణ‌కు టీడీపీ, జ‌న‌సేన నేత‌లు వ‌చ్చారు. పొత్తు వ‌ల్ల అంతిమంగా భారీగా న‌ష్ట‌పోయేది టీడీపీ మాత్ర‌మే.

వైసీపీకి కాలం క‌లిసి వ‌స్తోంది. వ‌ద్దన్నా రాజ‌కీయ అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ప్ర‌ధానంగా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో వైసీపీకి భారీ న‌ష్టం జ‌రుగుతుంద‌న్న భ‌యం నుంచి... హ‌మ్మ‌య్య స‌గం సీట్ల‌కు చావు లేద‌న్న స్థితికి చేరింది. ఇది చాలు.. ఆ పార్టీ అధికారంలోకి రావ‌డానికి. పొత్తు వ‌ల్ల రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర‌స్థాయిలో కూట‌మి పార్టీల మ‌ధ్య స‌యోధ్య కొర‌వ‌డింది. ఒక‌రికొక‌రు రాజ‌కీయంగా ఓడించుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు.

అలాగే టీడీపీ ఓట్లు జ‌న‌సేన‌, బీజేపీకి వేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అలాగే ఆ రెండు పార్టీల ఓట్లు టీడీపీకి బ‌దిలీ అయ్యే రాజ‌కీయ వాతావ‌ర‌ణం లేదు. నోటాకైనా వేస్తామే త‌ప్ప‌, త‌మ‌ను మోస‌గించిన పార్టీకి ఓట్లు వేయ‌మ‌ని ఆ మూడు పార్టీల కేడ‌ర్ అంటున్న ప‌రిస్థితి. ఇవ‌న్నీ వైసీపీకి ఆయాచిత ల‌బ్ధి చేకూరుస్తున్నాయి. వైసీపీకి సానుకూత వాతావ‌ర‌ణం ఏర్ప‌డ‌డానికి సీఎం జ‌గ‌న్ అద్భుతాలేవీ చేయ‌లేదు. కూట‌మిలోని లుక‌లుక‌లు వైసీపీకి లాభం క‌లిగిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో మ‌రోసారి వైసీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌న్న వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఈ విష‌యాన్ని టీడీపీ అనుకూల చాన‌ళ్లు, యూట్యూబ్ విశ్లేష‌కులు బాధ‌తో చెబుతున్నారు. కూట‌మి అధికారంలోకి రాక‌పోతే జ‌న‌సేన‌, బీజేపీకి ఎలాంటి న‌ష్టం లేదు. న‌ష్ట‌పోయేద‌ల్లా టీడీపీనే. అందుకే ఆ పార్టీ నేత‌ల్లో భ‌యం ప‌ట్టుకుంది. ఇప్పుడు ఏమీ చేయ‌లేని ద‌య‌నీయ స్థితి

వైసీపీకి 100 సీట్ల‌కు చావు లేద‌నే మాట స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. మ‌ళ్లీ అధికారం మ‌న‌దే అనే జోష్‌తో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప‌ని చేస్తున్నారు. ఏంటో. ఇలా అయిపోయింద‌నే నిరాశ‌నిస్పృహ‌ల‌తో టీడీపీ శ్రేణులు త‌ప్ప‌ద‌న్న‌ట్టు ప‌ని చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?