ఆంధ్రజ్యోతిలో ప్రతి అక్షరం జగన్ సర్కార్‌ను డ్యామేజ్ చేసేందుకే రాస్తారని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కానీ ఒక్కోసారి అలాంటి వార్తలు జగన్ సర్కార్ ఇమేజ్‌ను పెంచుతున్నాయి. తాజాగా అలాంటి వార్త మనకు ఆంధ్రజ్యోతిలో ఒకటి కనిపిస్తుంది. ‘నీకు మెంటలా?’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో మనకు తారసపడుతుంది.
సీఐని వైసీపీ రాజధాని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఫోన్‌లో హెచ్చరించిన ఆడియో లీక్‌కు సంబంధించిన సమాచారం అది. ఈ వార్త వ్యక్తిగతంగా ఎమ్మెల్యే శ్రీదేవి పరపతిని తగ్గిస్తుందనడంలో ఎలాంటి సందేహః లేదు. అయితే సీఐ సమాధానం మాత్రం జగన్ సర్కార్ పరపతిని, నిష్పాక్షికతను, నిజాయితీని ప్రతిబింబిస్తోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే ఏ మాత్రం గిట్టని వేమూరి రాధాకృష్ణ పత్రిక ఆంధ్రజ్యోతిలో ఈ వార్త ప్రచురించడం, ఏబీఎన్ చానల్‌లో ప్రసారం కావడం … ఏపీ సర్కార్‌కు ఎంతో మంచిదైంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బెదిరింపులకు సంబం ధించిన ఆడియో కావడంతో సహజంగానే సాక్షి పత్రికలో ఈ వార్త క్యారీ చేసే అవకాశం లేదు. తప్పు ఉంటే ఎంతటి వారైనా వదిలి పెట్టొద్దని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు కేవలం మాటల వరకైతే పరిమితం కాలేదని …ఆచరణకు నోచుకుంటున్నాయని సీఐ సమాధానం వింటే ఎవరికైనా అర్థమవుతుంది.
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బెదిరింపులపై ఆంధ్రజ్యోతిలో క్యారీ చేసిన వార్త ఎలా సాగిందో చూద్దాం.
‘నీకు మెంటలా..? నేనేం చెప్పాను.. నువ్వు ఏం చేస్తున్నావు? పట్టుకున్న రోజే బండ్లు వదిలేయమన్నానుగా.. ఏం తమాషాగా ఉందా…! నేను తలుచుకుంటే రెండు నిమిషాల్లో వెళ్లిపోతావ్’ అని సీఐపై గుంటూరుజిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కొన్ని రోజుల క్రితం ఆమె నియోజకవర్గంలోని క్వారీల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అక్రమార్కులు తన అనుయాయులే కావడంతో ఆమె నేరుగా సీఐకి ఫోన్ చేశారు. ఎలాంటి కేసూ పెట్టకుండా ఆ బండ్లు విడిచి పెట్టాలని హుకుం జారీ చేశారు. అయితే సీఐ ఆమె మాటలను లెక్క చేయకుండా వాహనా లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలియడంతో ఆమె ఆయనకు ఫోన్ చేసి చెడామడా తిట్టేసి బెదిరించారు.
ఆమె ఫోన్ చేసిన సమయంలో ఎస్పీ గారి సెట్ కాన్ఫెరెన్స్‌లో ఉన్నానని సీఐ చెబుతున్నా ఎమ్మెల్యే వినిపించుకోలేదు. ‘నా మాటంటే లెక్క లేదా..? ఆ రోజు నా కాళ్లు పట్టుకుని పోస్టింగ్ వేయించుకున్నావు. నీ పోస్టెంత.. నువ్వెంత? నేనిప్పుడే ఎస్పీ, డీజీపీతో మాట్లాడతా’ అని బెదిరించారు.
‘మీరు చెబితే వేరే పనైతే చేస్తాం మేడం.. మట్టి, ఇసుక దొంగ బండ్లు మేడం. ప్రభుత్వ పాలసీ మేడం. ఒకరిని వదిలేస్తే ఇంకొ కళ్లను పట్టుకోలేం మేడం. ఇటువంటి వాటి మూలంగా మాకే కాదు… మీకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది’ అని సీఐ చెప్తున్నా ఆమె వినిపించుకోలేదు’ ….ఇదీ ఆంధ్రజ్యోతి వార్త.
ఈ వార్త చదవగానే జగన్ సర్కార్‌లో పోలీసులు ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారో తేటతెల్లమవుతుంది. ఒక వైపు ఎమ్మెల్యే తిడుతున్నా లెక్క చేయకుండా …ఇలాంటి పనుల వల్ల మాకే (పోలీసులు) కాదు , మీకు (ఎమ్మెల్యే)కు చెడ్డ పేరు వస్తుందని స్పష్టంగా తేల్చి చెప్పినట్టు …అందులోనూ ఆంధ్రజ్యోతి రాయడంతో జగన్ పాలనపై జనాల్లోకి పాజిటివ్ సంకేతాలు పంపినట్టైంది.
ఎమ్మెల్యే కోణంలో నెగెటివ్ అవుతుందనే అత్యుత్సాహంతో ఆంధ్రజ్యోతి రాసినప్పటికీ , మరోవైపు ప్రభుత్వ కోణంలో చాలా పాజిటివ్ అయింది. తన సర్కార్‌కు మంచి పేరు వచ్చేలా మంచి కథనాన్ని రాసిన వేమూరి రాధాకృష్ణకు జగన్ థ్యాంక్స్ చెప్పాలి మరి!