“ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను బదిలీ చేసేందుకు కుట్ర జరుగుతోంది. న్యాయ వ్యవస్థపై ఏపీ ప్రభుత్వం దాడి చేస్తోంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీకి ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తోంది” అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేశారు.
ఆ ఆరోపణల వెనుక అసలు కుట్ర ఏంటో ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది. ఈనాడు మాదిరిగా న్యాయమూర్తుల బదిలీల విషయమై ఏమీ రాయకపోయి ఉంటే ఎలా అనుమానాలు వచ్చేవి కావు. కానీ ఆంధ్రజ్యోతి అత్యుత్సాహంతో ఎల్లో కుట్రలు బయటపడ్డాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీని ఆపేందుకు నారాయణతో ముందస్తు కుట్రల ఆరోపణలు చేయించిందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఉద్యోగుల బదిలీ అన్నది సర్వసాధారణం. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ వెనుక కుట్ర ఏంటో ఎవరికీ అర్థం కాదు.
ఇదే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ గురించి కూడా నారాయణ ఈ విధంగానే మాట్లాడలేదేం? అంటే ఓ పథకం ప్రకారం నారాయణ కుట్రపూరితంగానే జగన్ ప్రభుత్వం న్యాయస్థానంపై దాడి చేస్తోందని, చీఫ్ జస్టిస్ బదిలీకి కుట్ర చేస్తోందనే ఆరోపణలు చేశారని తెలిసొస్తోంది.
అందుకే నిజం నిప్పులాంటిదంటారు. న్యాయమూర్తుల బదిలీలను సుప్రీంకోర్టు కోలీజియం చేస్తుందనే ప్రాథమిక జ్ఞానం నారాయణకు లేదా? ఏమీ తెలియకుండానే తీవ్ర ఆరోపణలు చేశారా? ఇప్పుడు న్యాయమూర్తుల బదిలీల విషయమై కోలీజియం తీర్మానించిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో …ప్రభుత్వంపై విమర్శల దాడి చేయడమే లక్ష్యంగా నారాయణ ఆరోపణలను తెరమీదకు తెచ్చేందుకు ఎల్లో బ్యాచ్ పక్కా ప్లాన్ చేసిందని అర్థం చేసుకోవచ్చు.
దేశ వ్యాప్తంగా పలువురు హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు బదిలీ కానున్నారని, అందులో ఏపీ చీఫ్ జస్టిస్ కూడా ఉన్నారంటూ ఆంధ్రజ్యోతిలో తాజాగా ఓ కథనం ప్రచురితమైంది. ఈ కథనం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించిన్నట్లు తెలిసిందని రాసుకొచ్చారు.
వీరితోపాటు దేశవ్యాప్తంగా ఐదారు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు స్థాన చలనం ఉన్నట్టు సమాచారం ఉందని అందులో పేర్కొన్నారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా ఏడు నుంచి ఎనిమిది మంది హైకోర్టు న్యాయమూర్తులను కూడా బదిలీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసిందని కూడా కథనంలో ప్రస్తావించారు.
ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సోమవారం ఢిల్లీలో సమావేశమై బదిలీల విషయమై తీర్మానించినట్టు కూడా కథనంలో పేర్కొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ బదిలీ తప్పదని తేలిపోయింది.
వీరి స్థానంలో కొత్తగా ఎవరిని నియమించారనే విషయాలు బుధవారం లేదా గురువారం తెలిసే అవకాశముందని రాసుకొచ్చారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశాలు కొన్ని ఉన్నాయి. ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సోమవారం సమావేశమై బదిలీల విషయమై ఓ తీర్మానం చేసింది.
కానీ సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఒకరోజు ముందే అంటే ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీకి ఏపీ సర్కార్ కుట్ర పన్నుతోందని ఎలా ఆరోపించగలిగారు? సర్వోన్నత న్యాయస్థానంలోని కొలీజియం నిర్ణయాలు నారాయణకు ఎలా తెలిశాయి? ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను ఇక్కడే కొనసాగించాలనే పట్టుదల , కోరిక పచ్చ బ్యాచ్‌కు ఎందుకు? కుట్ర ఆరోపణలతో చీఫ్ జస్టిస్ బదిలీకి అడ్డుకట్ట వేసేందుకు నారాయణతో అలా ఆరోపణలు చేయించిన వ్యక్తులు, శక్తులు ఎవరు?
సహజంగానే పలికించేది చంద్రబాబు, పలికేది నారాయణుడు అనే ప్రచారం విస్తృతంగా సాగుతున్న విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ బదిలీకి కుట్ర జరుగుతోందని ఇదే టీడీపీ నేతలు ఆరోపణలు చేసి ఉంటే ….ఇదిగో చూడండి రాజ్యాంగ వ్యవస్థతో ఆ పార్టీకి ఉన్న అనుబంధం మరోసారి బయట పడిందని ప్రత్యర్థుల ఎదురు దాడికి ఒక ఆయుధం ఇచ్చినట్టు అవుతుందనే ముందస్తు జాగ్రత్తలు పచ్చ బ్యాచ్ తీసుకొంది.
అందులో భాగంగానే నారాయణతో ఆ విషయాన్ని టీడీపీ నేతలు మాట్లాడించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సర్వోన్నత న్యాయస్థానం అంతర్గతంగా చేసిన తీర్మానం ఎలా బయటికి వచ్చిందనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఏది ఏమైనా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీపై సీపీఐ అగ్రనేత ఆక్రోశం వెళ్లగక్కడం, ఆ మరుసటి రోజే దేశ సర్వోన్నత న్యాయస్థానం పలువురు న్యాయమూర్తుల బదిలీలపై తీర్మానం , ఆ మరుసటి రోజు ఎల్లో మీడియాలో కథనం ప్రచురితం కావడం చకచకా జరిగిపోయాయి. కానీ ఎల్లో బ్యాచ్, సీపీఐ, కొన్ని వ్యవస్థల మధ్య కోఆర్డినేషన్ చూస్తే మాత్రం భలే ఆశ్చర్యం కలుగుతోంది.