లోకేశ్‌.. మిమ్మ‌ల్ని మీరే తిట్టుకుంటే ఎలా?

మొగున్ని కొట్టి మొగ‌సాల‌కు ఎక్కిన చందంగా… చంద్ర‌బాబునాయుడు, లోకేశ్ తీరు వుంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై నెగెటివిటీ సృష్టించి రాజ‌కీయంగా ల‌బ్ధి పొంద‌డానికి ఏ ప‌నులు చేయ‌డానికైనా…

మొగున్ని కొట్టి మొగ‌సాల‌కు ఎక్కిన చందంగా… చంద్ర‌బాబునాయుడు, లోకేశ్ తీరు వుంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై నెగెటివిటీ సృష్టించి రాజ‌కీయంగా ల‌బ్ధి పొంద‌డానికి ఏ ప‌నులు చేయ‌డానికైనా వారు వెనుకాడ‌డం లేద‌నే అభిప్రాయాన్ని క‌లిగిస్తున్నారు. ప్ర‌ధానంగా వైఎస్ జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ‌, చెల్లెళ్లు ష‌ర్మిల‌, డాక్ట‌ర్ సునీత‌ల‌పై సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టి, ఆ చెత్తంతా జ‌గ‌న్‌పై వేస్తున్నారు.

త‌ల్లి, చెల్లెళ్ల‌పై సోష‌ల్ మీడియాలో అస‌భ్య పోస్టులు పెడుతున్న వారిని జ‌గ‌న్ ప్రోత్స‌హిస్తున్నార‌ని త‌న అనుకూల మీడియా ద్వారా చంద్ర‌బాబు, లోకేశ్ ప్ర‌చారం చేస్తున్నారనే విమ‌ర్శ లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో విజయ‌మ్మ‌, ష‌ర్మిల‌, సునీత‌ల‌పై తీవ్ర అస‌భ్య పోస్టులు పెట్టిన అస‌లు దొంగ‌లెవ‌రో పోలీసులు గుర్తించారు. విశాఖ‌కు చెందిన టీడీపీ సానుభూతిప‌రుడు, రియ‌ల్ట‌ర్ పిన‌పాల ఉద‌య్‌భూష‌ణ్‌, ఆయ‌న కుమారుడు చంద్ర‌కిర‌ణ్ అని క‌డ‌ప పోలీసులు తేల్చేశారు. ఈ మేర‌కు వారిని విశాఖ నుంచి క‌డ‌ప‌కు త‌ర‌లించి, జైల్లో పెట్టారు.

త‌న పార్టీ వాళ్లే జ‌గ‌న్ కుటుంబంపై అస‌భ్యంగా పోస్టులు పెడుతున్నార‌ని తెలిసి కూడా, ఏమీ సంబంధం లేద‌న్న‌ట్టు లోకేశ్ నీతులు చెప్ప‌డం ఆయ‌న‌కే చెల్లింది. పేటీఎం కుక్క‌ల‌తో జ‌గ‌న్ త‌న త‌ల్లి, చెల్లెళ్ల‌పై అస‌భ్య‌క‌ర దాడి చేయిస్తున్నార‌ని విమ‌ర్శించ‌డం ఆయ‌న నైజానికి నిద‌ర్శ‌నం. ఒక అబ‌ద్ధాన్ని ప‌దేప‌దే చెబితే, అదే నిజ‌మ‌వుతుంద‌నే ఫిలాస‌ఫీని లోకేశ్ బాగా మ‌న‌సుకు ఎక్కించుకున్నారు. అందుకే వైఎస్ జ‌గ‌న్ త‌ల్లి, చెల్లెళ్ల‌పై సోష‌ల్ మీడియాలో అస‌భ్య పోస్టుల గురించి లోకేశ్ ప్ర‌స్తావిస్తున్నారు.

ఇలాంటివి ఓట్లు కురిపిస్తాయ‌ని లోకేశ్ న‌మ్ముతున్న‌ట్టున్నారు. గ‌తంలో టీడీపీ అధికారంలో వున్న‌ప్పుడు ఇదే ర‌కంగా జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుల‌పై అస‌భ్య దాడి చేయించార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. అంతెందుకు త‌న త‌ల్లితో పాటు కుటుంబ స‌భ్యుల‌పై లోకేశ్ సోష‌ల్ మీడియాలో తీవ్ర అభ్యంత‌ర‌క‌రంగా పోస్టులు పెట్టిస్తున్నార‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ‌త ఎన్నిక‌ల్లో ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.

లోకేశ్ తెలివితేట‌ల్ని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ త‌న‌కు మించిన తెలివిప‌రులు చాలా మందే ఉన్నార‌ని లోకేశ్ గుర్తిస్తే మంచిద‌ని వైసీపీ నేత‌లు హిత‌వు చెబుతున్నారు. జ‌గ‌న్ త‌ల్లి, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌పై అస‌భ్య పోస్టులు పెట్టిన వారిని క‌డ‌ప పోలీసులు అరెస్ట్ చేసిన నేప‌థ్యంలో పేటీఎం బ్యాచ్ ఎవ‌రో లోకేశ్ తెలుసుకోవాల‌ని వారు కోరుతున్నారు. త‌న‌ను తానే లోకేశ్ తిట్టుకుంటున్న‌ట్టుగా వుంద‌ని వారు ఎద్దేవా చేస్తున్నారు.