తిరుమల నడక దారిలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. అలిపిరి నడక దారిలో శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్న ఓ ఆరేళ్ల బాలిక(6)పై చిరుత దాడి చేసి చంపేసింది. ఆ చిన్నారి మృతదేహాన్ని చిరుత సగం తినేసినట్లు తెలుస్తోంది.
కాగా నిన్న రాత్రి 11 గంటలకు నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెంకు చెందిన ఓ కుటుంబం అలిపిరి కాలినడక మార్గంలో శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద కుటుంబ సభ్యులకు కాస్త ముందు నడుస్తున్న బాలికపై ఒకసారిగా చిరుత దాడి చేసింది. వారు భయంతో పెద్దగా కేకలు వేయడంతో బాలికను చిరుత అడవిలోకి ఈడ్చుకెళ్లింది. అర్థరాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలు చేసేందుకు వీలుపడలేకపోవడంతో.. ఉదయమే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి బాలిక మృతదేహాన్ని గుర్తించారు.
కాగా గత నెలలో కూడా ఓ బాలుడుపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఆ బాలుడి తల్లిదండ్రలు, ఇతర భక్తులు, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటి నుండే భద్రత చర్యలు చేపట్టింటే ఇప్పుడు ఈ చిన్నారి ప్రాణాలు పోయేవి కాదని పలువురు వ్యాఖ్యనిస్తున్నారు.