తెలంగాణ నీటి పారుదల శాఖ ENC 2022-23 సంవత్సరంలో బోర్డు కేటాయించిన నీటికన్నా 205 TMC లు అదనంగా వాడుకుందని, ఆ నీటిని ఈ ఏడాది లెక్కల్లో జమ చేయాలని కోరుతూ కృష్ణా యాజమాన్య బోర్డు(KRMB)కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడం వారి హక్కు. కానీ సదరు ఫిర్యాదుకు ఎలాంటి ప్రాతిపదిక లేకపోగా, తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం అంతిమంగా వారికే నష్టం.
తెలంగాణ ENC తాజా ఫిర్యాదు మేరకు గత ఏడాది బోర్డు కేటాయింపుల కన్నా అదనంగా ఏపీ 205 TMC ల నీరు డ్రా చేసింది. 811 TMCలలో ఏపీ వాటా 512 TMCలు, తెలంగాణ వాటా 299 TMCలు. ఏపీ శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి డ్రా చేసింది 477.908 TMC లు మాత్రమే. తెలంగాణ 236.461 TMC ల నీటిని డ్రా చేసుకుంది. రెండు రాష్ట్రాలు తమ అధికారిక కేటాయింపులను కూడా డ్రా చేయలేదు. అయినా తెలంగాణ ENC ఏ ప్రాతిపదిక ఫిర్యాదు చేశారంటే గత ఏడాది 12.8.22 నుంచి 27.20.22 వరకు 60 రోజులు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీరు విడుదల చేసినప్పుడు (మిగులు జలాలు) ఏపీ ప్రభుత్వం 191.9 TMC లను డ్రా చేసుకోవడంపై. ఈ నీటిని ఆధారంగా చూపించి మిగులు జలాలను నికరజలాల్లో చూపించే అర్ధరహిత ప్రయత్నం చేశారు.
బచావత్ ప్రకారం వరద, మిగులు జలాలపై సంపూర్ణ అధికారం దిగువ రాష్ట్రం ఏపీకి ఉంటుంది. అలా సముద్రం పాలు అవుతున్న నీటిని ఏపీ వాడుకునే ప్రయత్నం చేస్తే దానిపై కూడా పిర్యాదు చేయడం హాస్యాస్పదం. విచిత్ర మేమిటంటే… ఈ సమయంలో ఎగువ రాష్ట్రం తెలంగాణ 48.488 TMC లను డ్రా చేసుకుంది. మరి తెలంగాణ ENC గారు ఈ నీటిని ఏ లెక్కల్లో వేస్తారో?
అనవసర రాద్ధాంతం చేస్తే…
తెలంగాణ ఫిర్యాదు పై KRMB విచారణ జరిపితే అంతిమంగా నష్టపోయేది తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే మిగులు జలాలను వినియోగించే అధికారం బచావత్ ప్రకారం దిగువ రాష్ట్రం అయిన ఏపీకి పూర్తిగా ఉంటుంది. ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీరు విడుదల చేసే సమయంలో ఎన్ని TMC ల నీరు ఏపీ డ్రా చేసుకున్నా అడిగే అధికారం తెలంగాణతో సహా మరే రాష్టానికి లేదు. కాబట్టి తెలంగాణ ఫిర్యాదు చెల్లదు.
స్థూలంగా గత ఏడాది ఏపీ నికర, మిగులు జలాలు కలుపుకుని 668.998 TMC లు డ్రా చేసుకోవడం ద్వారా తమ హక్కులో 71.47 శాతం వినియోగించుకున్నది. అదే తెలంగాణ 284.949 TMC లు డ్రా చేసుకోవడం ద్వారా తమ హక్కులో 82.98 శాతం వినియోగించుకున్నది. దిగువ రాష్ట్రం కాని తెలంగాణ 48 TMC ల మిగులు జలాలను వాడుకున్నది కాబట్టి ఆ నీటిని ఈ ఏడాది తెలంగాణ వాటాలో కలపాలని ఏపీ వాదనలు వినిపిస్తే బోనులో నిలబడేది తెలంగాణ ప్రభుత్వం అన్న విషయాన్ని ENC మరిచినట్లు ఉన్నారు.
తెలంగాణ అడ్డగోలు ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ క్రియాశీలంగా ఉండాలి. రెండు తెలుగు రాష్ట్రాల నిరంతరం అనవసర వివాదాలతో ప్రయోజనం శూన్యం అన్న ధోరణిలో ఏపీ ఉంటోంది. దీన్ని తెలంగాణ బలహీనతగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ వ్యవహార శైలిని పరిగణనలోకి తీసుకుని ఏ సాంకేతిక అంశాన్ని కూడా వదలకుండా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ముఖ్యంగా శ్రీశైలం నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని సరఫరా చేసుకునే ప్రయత్నాలపై KRMB కి ఫిర్యాదు చేయడం, బోర్డ్ అసమర్థతపై న్యాయపోరాటం కూడా చేయాలి. ఇలాంటి ఫిర్యాదులతో తెలంగాణ ప్రభుత్వం ఏపీని ఇబ్బంది పెట్టేదేమీ ఉండదు. కానీ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలలో తాత్కాలికంగా ప్రయోజనం పొందితే పొందవచ్చు.
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం.