విశాఖలో రుషికొండను వైసీపీ సర్కార్ తవ్వేస్తోందని, దీంతో పర్యావరణం దెబ్బతింటోందని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేనాని పవన్‌కల్యాణ్ ఆవేదన అర్థం చేసుకోదగ్గదే. అయితే పర్యావరణం విధ్వంసంపై ఆయన ద్వంద్య వైఖరిపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మూడు పంటలు పండే సారవంతమైన వేలాది ఎకరాలను రైతుల నుంచి చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాక్కున్న సంగతి తెలిసిందే.
మూడు పంటలు పండే వేలాది ఎకరాల్లో రాజధాని నిర్మించడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ఆ రంగానికి చెందిన ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరి రాజధాని అమరావతి? పేరుతో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రచించిన పుస్తకాన్ని 2018లో జనసేనాని పవన్‌కల్యాణ్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
రాజధాని నిర్మాణానికి అమరావతి ఏ విధంగా సరైన ప్రాంతం కాదో ఐవైఆర్ ఆ పుస్తకంలో సమగ్రంగా వివరించారు. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరావు షాకింగ్ విషయాలను ప్రస్తావించారు. ముందుమాటలో ఆయన ఏం రాశారంటే…
“అమరావతిలో దాదాపు 15 వేలు ఎకరాలు జరీబు భూములు. చాలా సారవంతమైనవి. దాదాపు నూరు రకాల పంటలు పండుతాయి. ముఖ్యంగా ఆహార పంటలు, పండ్ల తోటలు, పూల తోటలు మొదలైనవి ఇక్కడ పెంచుతారు. వేలాది ఎకరాల మెట్ట భూముల్లో అనేక ఎత్తిపోతల పథకాల ద్వారా ఏడాదికి ఒకటి లేదా రెండు పంటలు పండిస్తున్నారు. ఈ భూములపై వేలాది మంది రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. రాజధాని కోసం దాదాపు 54 వేల ఎకరాల భూమిని సేకరించడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద తప్పు.
ఇక్కడ భూమిలేని పేదల సగటు నెలవారీ సంపాదన ఒక్కో కుటుంబానికి రూ.15 వేలు. సీఆర్‌డీఏ వారికి నెలకు రూ.2,500 మాత్రమే చెల్లించడం చాలా విచారకరం. వందలాది కుటుంబాలు ఉపాధి వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకి వలస పోవలసి వస్తోంది” అని వడ్డె శోభనాద్రీశ్వరావు తీవ్ర ఆవేదనతో రాశారు. ఇదే పెద్ద మనిషి ఇప్పుడు అమరావతికి మద్దతు పలకడం వేరే విషయం.
ఈ విధ్వంసాన్ని ఏమనాలి? పవన్‌కల్యాణ్ కంటికి ఇవేవీ కనిపించవా? అనే నిలదీతలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. కేవలం తనకు గిట్టని పాలకుడు ఉండడం వల్లే పవన్‌కల్యాణ్ రాద్ధాంతం చేస్తున్నారే తప్ప, ఆయనకు పర్యావరణం, ఇతరత్రా వేటిపై ప్రేమ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నాలుగేళ్లపాటు ఆయన ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నించిన పాపాన పోలేదని , ఇప్పుడు మాత్రం గంతులేస్తున్నాడని నెటిజన్లు తూర్పారపడుతున్నారు. వేలాది మంది వలసలకు కారణమైన అమరావతి రాజధానిపై ఒకట్రెండు దఫాలు మినహాయించి, ఎప్పుడూ నోరు మెదపని పవన్‌కల్యాణ్, ఇప్పుడు రుషికొండపై నానాయాగీ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందనే విమర్శ లేకపోలేదు.