జనసేనాని పవన్‌కల్యాణ్ విపరీత ధోరణి రోజురోజుకూ పెరిగిపోతోంది. వైసీపీ ప్రభుత్వంపై ఏదో ఒకటి విమర్శ చేయడానికి ఘటనను ఎంచుకోవడం పవన్‌కు సంతోషాన్ని ఇస్తోంది. తాజాగా ఆయన విశాఖలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఆవేశంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై రెచ్చిపోయారు.
ఉత్తరాంధ్రలోనే మహిళల అక్రమ రవాణా జరుగుతోందని విమర్శించారు. దండుపాళెం బ్యాచ్‌కు వైసీపీ వాలంటీర్లకు తేడా లేదని ఆయన మండిపడ్డారు. ఇళ్లలోకి చొరబడి గొంతులు కోస్తున్నారని వాలంటీర్లపై సంచలన ఆరోపణలు చేశారు. ఒంటరి మహిళలే వాలంటీర్ల టార్గెట్ అని ఆ రోజే తాను చెప్పానని పవన్ విమర్శించారు.
పవన్ కామెంట్స్‌పై వైసీపీతో పాటు నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారని పవన్ బాధపడుతుంటారని, కాని ఆయన చేష్టలను తప్పు పట్టేందుకు ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఉదాహరణకు తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి తలెత్తుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్న కొంత మంది భర్తలున్నారని, లోకంలోని మొగళ్లందరినీ ఒకే రకంగా జమ కడ్తామా? అని ప్రశ్నిస్తున్నారు. భార్యల్ని మోసగించే మీలాంటి మొగళ్లను పరిగణలోకి తీసుకుని అసలు వివాహ వ్యవస్థనే వద్దనుకుందామా? అని నెటిజన్లు నిలదీయడం గమనార్హం. ఈ సందర్భంగా రెండు రోజుల క్రితం రేణూ దేశాయ్ విడుదల చేసిన వీడియోలో తన విషయంలో పవన్ తప్పు చేశారని చెప్పిన కామెంట్‌ను వైరల్ చేయడం గమనార్హం.
అలాగే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆస్తి గొడవలో భార్య అయిన డాక్టర్ మాచర్ల రాధను డ్రైవర్‌తో కలిసి భర్త డాక్టర్ లోకనాథ మహేశ్వరరావు హత్య చేశాడని, కావున మొగళ్లంతా ఇలాంటి వాళ్లే అని విమర్శిద్దామా పవన్ అంటూ నిలదీస్తున్నారు. నేరాలు ఎక్కడ జరిగినా ఖండించాలని, అయితే అవి కేవలం వాలంటీర్లకు మాత్రమే పరిమితమైనవన్నట్టు పవన్ మాట్లాడ్డం విడ్డూరంగా వుందని వైసీపీ నేతలు, నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.
సమాజంలో నేరాల్ని పారదోలేందుకు అందరూ కృషి చేయాలే తప్ప, కేవలం ప్రభుత్వ బాధ్యత అన్నట్టు రాజకీయ కోణంలో చేయడం వల్లే సమాజం పతనమవుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాలంటీర్లపై తన అభ్యంతరకర వ్యాఖ్యలకు మద్దతు కోసమే విశాఖలో దుర్ఘటనను రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.