కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామికి సేవ చేసుకోవాలని ఎవరికి ఉండదు? టీటీడీలో అధికారికంగా ఒక పదవి లభిస్తే అంతకంటే మహాభాగ్యం మరొకటి వుండదని ఎంతో మంది భావిస్తుంటారు. టీటీడీ పాలక మండలి కొత్త సభ్యులపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీటీడీ పాలక మండలి నూతన చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నెల 10న ఆయన బాధ్యతలు కూడా తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో పాలక మండలి సభ్యుల ఎంపికపై సీఎం వైఎస్ జగన్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఫలానా వాళ్లను ఆ పదవి వరించనుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తిరుపతికి చెందిన రాయలసీమ ఆనంద్‌రెడ్డి, పారిశ్రామికవేత్త ప్రతాప్‌రాజు, అలాగే వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నివాసి బుశెట్టి రామ్మోహన్, కడప బాబు తదితరులు తమకు టీటీడీ బోర్డు సభ్యత్వం ఖాయమైనట్టు ప్రచారం చేసుకుంటున్నారు.
బోర్డు సభ్యుల ఎంపికలో సామాజిక సమీకరణలకు సీఎం జగన్ పెద్దపీట వేస్తారని సమాచారం. ఇప్పటికే రెండు విడతలుగా నాలుగేళ్లపాటు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా వ్యవహరించారు. కరోనా సమయంలో చివరికి శ్రీవారి గుడిని కూడా భక్తుల దర్శనార్థం తెరవని పరిస్థితి.
కరోనా సమయంలో టీటీడీ చైర్మన్‌గా, సభ్యులుగా పని చేసిన వారు తమకు కాలం కలిసి రాలేదనే అసంతృప్తితో ఉన్నారు. కొత్త పాలక మండలిలో సభ్యుల ఎంపికపై ఊహాగానాలు నిజమవుతాయా? లేక నిజంగానే వారికి సీఎం నుంచి స్పష్టమైన హామీ లభించిందా? అనేది త్వరలో తేలనుంది.