తిరుమల నడక మార్గంలో వన్యమృగాలు దాడులు హడలెత్తిస్తున్నాయి. తాజాగా చిరుత దాడిలో నెల్లూరు జిల్లా కోవూరు మండలం సోతిరెడ్డిపాళేనికి చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
నెల క్రితం ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేయడాన్ని భక్తులు, టీటీడీ ఉద్యోగులు పసిగట్టి గట్టిగా కేకలు వేయడంతో ప్రాణాపాయం తప్పింది. వరుస ఘటనల నేపథ్యంలో భక్తుల రక్షిత చర్యలకు టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి కీలక చర్యల దిశగా అడుగులు వేస్తున్నారు.
ప్రధానంగా తిరుమలకు శ్రీవారి మెట్టు, అలిపిరి కాలి నడక మార్గాల ద్వారా వెళుతుంటారు. తిరుపతి సమీపంలో అలిపిరి మార్గం వుంటుంది. దీంతో ఎక్కువ మంది ఇక్కడి నుంచే తిరుమలకు నడిచి వెళ్లి మొక్కు తీర్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా లక్షిత తన తల్లిదండ్రులతో కలిసి అలిపిరి బాటలో వెళుతుండగా ప్రమాదబారిన పడింది. తరచూ అడవి జంతువుల బారిన పడి ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోవడం, తీవ్ర గాయాలపాలవుతుండడంతో టీటీడీ రక్షణ చర్యలు చేపట్టేందుకు సీరియస్గా ఆలోచిస్తోంది.
అలిపిరి నడక మార్గాన్ని సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు గంటల వరకు మూసివేత దిశగా ఆలోచిస్తున్నట్టు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అలాగే నడక దారిలో ప్రతి 40 అడుగులకు ఒక సెక్యూరిటీ ఉండేలా చర్యలు చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా నడక మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జంతువుల సంచారాన్ని గమనిస్తూ అప్రమత్తం చేస్తామన్నారు.