సీనియర్ నటుడు, అభ్యుదయవాది ప్రకాశ్‌రాజ్ మరోసారి దేశంలో నెలకున్న అమానవీయ పరిస్థితులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోదీ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి కులం, మతం పేరుతో విద్వేషాలు పెరిగిపోతున్నాయని ఆయన చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హైదరాబాద్‌లో బాగ్‌లింగంపల్లి సుందరయ్య కళానిలయంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ సీరియస్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుత సమాజం సందిగ్ధంలో వుందని వాపోయారు. వందరోజులుగా మణిపూర్ మండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ గురించి నిలదీస్తే హరియాణ, బెంగాల్ అని అప్రస్తుత విషయాలన్నీ తెరపైకి తెస్తున్నారని ప్రకాశ్‌రాజ్ మండిపడ్డారు. మన వ్యవస్థలో గొప్పగా చెప్పుకోడానికి ఏమీ లేదన్నారు. కులం, మతోన్మాదం విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని ఆయన విమర్శించడం గమనార్హం.
మౌనంగా ఉంటే శరీరానికి తగిలిన గాయాలు మానుతాయని, కానీ దేశానికి తగిలిన గాయాలు మాత్రం రాచపుండు అవుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో చోటు చేసుకున్న అమానవీయ ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ విమర్శ చేశారు. ప్రతిభతో రచయిత, కవి, కళాకారుడు కాలేరన్నారు. సమాజ పరిస్థితులపై స్పందించగలిగితేనే రాణించగలుగుతారని ఆయన అన్నారు. మణిపూర్‌లో విద్వేషాలకు బీజేపీనే కారణమనే విమర్శలున్నాయి.
ఆ రాష్ట్రంలో రెండు తెగల మధ్య బీజేపీ అగ్గి రాజేసిందని, పెట్రోల్ పోసి మరింత మంట పెరిగేలా చేస్తోందని విపక్షాలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రకాశ్‌రాజ్ మొదటి నుంచి మోదీ పాలనా విధానాలను తూర్పారపడుతున్నారు. సినీ రంగం నుంచి ఆయనలా ఏ నటుడూ దేశ రాజకీయ దుస్థితిపై గళమెత్తిన వారు లేరు.
జనసేనాని పవన్‌కల్యాణ్ మోదీ అప్రజాస్వామిక విధానాల గురించి నోరు తెరవడం మానేసి చాలా ఏళ్లైంది. ఇప్పుడాయన సీఎం జగన్‌ను ఒక ఆట ఆడించేందుకు మోదీ సర్కార్ మద్దతును కోరుతున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా మణిపూర్ ఘోరాలు, నేరాలపై ప్రకాశ్‌రాజ్‌లా ఇంత వరకూ పవన్ స్పందించలేదు. ప్రకాశ్‌రాజ్ మాదిరిగా పవన్ నుంచి మణిపూర్‌పై సీరియస్ కామెంట్స్‌ను ఆశించలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రకాశ్‌రాజ్ సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు పోషిస్తుంటారు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం హీరోలా సామాజిక రుగ్మతలపై తనవైన ప్రజాస్వామిక అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఆయన ఎప్పుడూ పీడితుల పక్షాన గళమెత్తుతుంటారు. అందుకే ఆయన ప్రతిభ ఉన్నంత మాత్రాన కళాకారులు కాలేరని, సమాజ పరిస్థితులపై స్పందిస్తేనే రాణిస్తారని కామెంట్స్ చేయడం. పవన్‌కల్యాణ్ సినిమాల్లో మాత్రం హీరో వేషాలు, రియల్ లైఫ్‌లో మాత్రం విలన్ వేషాలు వేస్తారనే విమర్శ బలంగా వుంది.