రజనీ నువ్వు కావాలయ్యా.. చిరు నువ్వు మారాలయ్యా!

టైటిల్ చూస్తేనే ఈ పాటికి మీకు మేటర్ అర్థమై ఉంటుంది. దక్షిణాదిలో ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అంటే రజనీకాంత్. సినిమా తీస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే. అయితే తెలుగుకు వచ్చేసరికి ఇక్కడ మెగాస్టార్ సినిమాకు…

టైటిల్ చూస్తేనే ఈ పాటికి మీకు మేటర్ అర్థమై ఉంటుంది. దక్షిణాదిలో ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అంటే రజనీకాంత్. సినిమా తీస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే. అయితే తెలుగుకు వచ్చేసరికి ఇక్కడ మెగాస్టార్ సినిమాకు ఉన్నంత క్రేజ్ రజనీకి సినిమాకు ఉండదు. అందుకే భోళాశంకర్ కంటే ఒక రోజు ముందే జైలర్ తో అభిమానుల ముందుకు వచ్చాడు రజనీ.

ఈ సినిమాకు ఎబోవ్ యావరేజ్ టాక్ వచ్చింది. తర్వాతి రోజు భోళాశంకర్ కూడా థియేటర్లోకి వచ్చేసింది. దీంతో… రెండో రోజుకు సిట్యువేషన్ మొత్తం మారిపోయింది. భోళాశంకర్ కంటే జైలరే బెటరని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈరోజు పరిస్థితే చూసుకుంటే.. భోళాశంకర్ కంటే జైలర్ థియేటర్లే కళకళలాడుతున్నాయి.

మెగాస్టార్, సూపర్ స్టార్… ఎవరి స్టామినా ఎంత అనే విషయం పక్కన పెడితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో, మారిన ట్రెండ్ నేపథ్యంలో, రజనీకాంత్ ని చూసి చిరంజీవి మాత్రం కచ్చితంగా నేర్చుకోవాల్సిందే. 60 దాటిన తర్వాత రజనీకాంత్ తన వయసుకి తగ్గ పాత్రలు వేస్తున్నారు. అలా అని ఆయన హీరోయిజం తగ్గించడం లేదు, అదే స్టయిల్, అదే యాక్షన్, అదే మాస్ అప్పీల్.

సినిమాలో హీరోయిన్ ఉంటుంది కానీ ఆమెతో డ్యాన్సుల్లాంటివి చేయడం లేదు. తన వయసు, స్టార్ డమ్ కు తగ్గట్టు, మంచి కమర్షియల్ అంశాలు మేళవించిన కథల్ని ఎంచుకుంటున్నారు. జైలర్ అలాంటిదే.

చిరంజీవి సినిమాల్లో కూడా ఆయన మార్క్ స్టయిల్, యాక్షన్, మేనరిజమ్స్ ఉంటున్నాయి. కానీ వయసుకు తగ్గ పాత్రలు, ఇమేజ్ కు తగ్గ కథలు మాత్రం చిరంజీవికి దొరకడం లేదు. దొరకడం లేదు అనేకంటే, ఆ దిశగా చిరంజీవి ఆలోచించడం లేదు అనడం కరక్టేమో.

చిరంజీవి ఇంకా హీరోయిన్లతో డాన్సులు చేస్తున్నారు. ఆయన మంచి డాన్సర్. ఫ్యాన్స్ ఆయన డాన్స్ మూమెంట్స్ కోరుకుంటారు. అది నిజమే. అందుకే చిరంజీవి కూడా లేటు వయసులో చాలా కష్టపడి డాన్సులు వేస్తున్నారు. అయితే ఆ కష్టంతో కొంత భాగాన్ని కథల ఎంపికపై కూడా ఆయన పెట్టాలి. ఈ విషయంలో రజనీకాంత్ తో పాటు, కమల్ ను ఆయన ఆదర్శంగా తీసుకోవాలి.

సినిమా అనేది ఓ కళారూపం. అంతేతప్ప, ఇది ఉపాధి హామీ పథకం కాదు. భోళాశంకర్ మాత్రం ఉపాధి హామీలానే కనిపిస్తోంది. చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న మెహర్ కు అవకాశం ఇచ్చారు. జబర్దస్ట్ ఆర్టిస్టులు చాలామందికి ఛాన్స్ ఇచ్చారు. చాలా ప్యాడింగ్ పెట్టారు. అయితే కథకు ఏం కావాలనేది ఆలోచించలేదు.

రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు కథలపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. ఆ తర్వాతే తమ హీరోయిజం, ఫ్యాన్ మూమెంట్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదాహరణకు కమల్ హాసన్ విక్రమ్ సినిమానే తీసుకుంటే.. హీరోయిన్ లేదు, ఫారెన్ లొకేషన్లు లేవు, కామెడీ సీన్లు లేవు. అయినా కూడా సినిమా సూపర్ హిట్. ఇదే విక్రమ్ సినిమాను మెగాస్టార్ చేస్తే ఇంకా పెద్ద హిట్ అయ్యేది.

ఇకనైనా చిరంజీవి సీరియస్ గా కథలపై దృష్టిపెట్టాలి. రీమేక్ చేసినా తన వయసు, ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసుకోవాలి. హీరోయిన్లతో డాన్సులు, భారీగా ప్యాడింగ్ ఆర్టిస్టులు, ఉపాధి హామీ పథకాల్లాంటి వాటికి రెండో ప్రాధాన్యం ఇవ్వాలి.