సినిమా భాష‌లో ప‌వ‌న్‌ను ఉతికి ఆరేసిన రోజా!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను మంత్రి ఆర్కే రోజా మ‌రోసారి సినిమా భాష‌లో ఉతికి ఆరేశారు. ఇద్ద‌రూ సినిమా రంగానికి చెందిన నేత‌లైన సంగ‌తి తెలిసిందే. విశాఖ‌లో రుషికొండ‌ను త‌వ్వేస్తున్నార‌ని ప‌వ‌న్ ఆరోపించిన నేప‌థ్యంలో రోజా కౌంట‌ర్…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను మంత్రి ఆర్కే రోజా మ‌రోసారి సినిమా భాష‌లో ఉతికి ఆరేశారు. ఇద్ద‌రూ సినిమా రంగానికి చెందిన నేత‌లైన సంగ‌తి తెలిసిందే. విశాఖ‌లో రుషికొండ‌ను త‌వ్వేస్తున్నార‌ని ప‌వ‌న్ ఆరోపించిన నేప‌థ్యంలో రోజా కౌంట‌ర్ ఇచ్చారు. వైజాగ్‌ను ప‌రిపాలన రాజ‌ధానిగా ప్ర‌క‌టించి, దాన్ని అంత‌ర్జాతీయ న‌గ‌రంగా అభివృద్ధి చేయాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌తో ముందుకు వెళుతున్నార‌న్నారు.

కానీ ఆ న‌గ‌రాన్ని ఒక క్రైమ్ సిటీగా చూపించాల‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌వ‌ర్తించ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని రోజా అన్నారు. చంద్ర‌బాబు ఏం విమర్శిస్తాడో దాన్నే రీమేక్ చేస్తూ ..ప‌వ‌ర్ స్టార్ కాదు, రీమేక్ స్టార్ అన్న‌ట్టుగా విశాఖ వెళ్లి ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా అదే హ‌డావుడి చేస్తున్నాడ‌ని రోజా త‌ప్పు ప‌ట్టారు. రుషికొండ‌ను బోడిగుండు చేసేశారని బోడి వెధ‌వ‌లంతా బోడి ప్ర‌చారం చేయ‌డం ఒక ప్యాష‌న్ అయ్యింద‌ని మండిప‌డ్డారు.

రుషికొండ వ‌ద్ద ప‌వ‌న్ కారెక్కి గోడ ఎక్కి దూకి హ‌డావుడి చేశార‌ని ఆమె అన్నారు. రుషికొండ‌లో ఏం లోపాలు జ‌రుగుతున్నాయ్‌? ఎలాంటి అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ్‌? నువ్వేం క‌నిపెట్టావో చెప్ప‌య్యా అంటే ఆయ‌న‌కు మాట‌లు లేవ‌ని రోజా అన్నారు. తానీ విష‌యాన్ని ప‌వ‌న్‌ను సూటిగా అడుగుతున్న‌ట్టు రోజా పేర్కొన‌డం విశేషం. ప్ర‌జ‌లు అడుగుతున్న దాన్నే తాను ప‌వ‌న్‌ను అడుగుతున్న‌ట్టు రోజా చెప్పారు.

నీ పార్టీ, నీ ద‌త్త తండ్రి పార్టీ, అలాగే ర‌ఘురామ‌కృష్ణంరాజు క‌లిసి న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించార‌ని, నిర్మాణాలు ఆపేయాల‌ని ఏ కోర్టు అయినా తీర్పు ఇచ్చిందా? అని రోజా ప్ర‌శ్నించారు. సుప్రీంకోర్టు కంటే గొప్పోడివా? అని ప‌వ‌న్‌ను రోజా నిల‌దీశారు. రుషికొండ‌పై ఏపీ హైకోర్టు విచారిస్తోంద‌న్నారు. ప్ర‌భుత్వం చేసే ప్ర‌తి ప‌నికి సంబంధించిన వివ‌రాల్ని అఫిడ‌విట్ రూపంలో తెలియ‌జేస్తున్నామ‌న్నారు. 

కోర్టు ఆదేశాల మేర‌కు మార్పుచేర్పులు తాము చేస్తామ‌ని, మ‌ధ్య‌లో నీకెందుకు బాధ అని ఆమె ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలిని చూస్తుంటే పుష్ప సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తోంద‌న్నారు. ఇది నా కాలే, అది నా కాలే, కాలుమీద కాలు వేసుకుంటే నీకేంటి బాధ అని ఆమె త‌న‌దైన స్టైల్‌లో డైలాగ్ చెప్పారు.

రుషికొండ‌పై నిర్మాణాలు చేప‌డితే ప‌ర్యావ‌ర‌ణం ధ్వంస‌మ‌వుతుంద‌ని అనుకుంటే, మ‌రి రామానాయుడు స్టూడియో, ఐటీ ట‌వ‌ర్స్ నిర్మాణాల మాటేంట‌ని ఆమె నిల‌దీశారు. కొండ‌మీద క‌ట్ట‌డాలు నీ కంటికి క‌నిపించ‌లేదా? అని ఆమె నిల‌దీశారు. నీ క‌ళ్ల‌ను క‌ళ్యాణ్ జ్యువెల‌ర్స్‌లో తాక‌ట్టు పెట్టావా? అని ప్ర‌శ్నించారు. 

కొండ‌మీద క‌ట్ట‌డాలు త‌ప్పైతే, మ‌రి మీది, మీ అన్న ఇల్లు బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ల‌లో కొండ‌మీద ఉన్నాయి క‌దా? అని ఆమె నిల‌దీశారు. అప్పుడు ప‌ర్యావ‌ర‌ణం ధ్వంస‌మ‌వుతోంద‌ని మీకు అనిపించ‌లేదా అని విరుచుకుప‌డ్డారు. వంద‌లాది ఎక‌రాల్లో కొండ‌పై క‌ట్టిన రామోజీ ఫిల్మ్ సిటీపై ఎందుకు మాట్లాడ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ద‌త్త తండ్రి చంద్ర‌బాబునాయుడు మూడు పంట‌లు పండే 33 వేల ఎక‌రాలను రాజ‌ధాని పేరుతో కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తుంటే ఆ రోజు ఎందుకు మాట్లాడ‌లేదు?  హెరిటేజ్ ఐస్‌క్రీమ్ నోట్లో పెట్టుకున్నావా? అని దెప్పి పొడిచారు.