1917 ఫిబ్రవరి 23. రష్యాలోని పెట్రోగ్రాడ్లో ఒక రోమాంచితమైన సంఘటన (గూస్బంప్స్) జరిగింది.
కొన్ని వేల మంది ఆడవాళ్లు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. వాళ్లంతా ఎవరు? యుద్ధంలో కొడుకుల్ని పోగొట్టుకున్న తల్లులు, భర్తల్ని పోగొట్టుకున్న భార్యలు. పిల్లలకి ఒక పూట తిండి పెట్టడానికి రోజంతా చాకిరీ చేసేవాళ్లు. రోజూ పని దొరకని వాళ్లు. వాళ్లు ఒక దుఃఖ నదిలా పోటెత్తి రోడ్డు మీద ప్రవహిస్తున్నారు. జార్ చక్రవర్తి దుర్మార్గాల్ని భరించలేక ఆగ్రహ జ్వాలలా వెలుగుతున్న వాళ్లు.
వాళ్ల ఎదురుగా వందల మంది కోసక్కు సైనిక దళం భుజానికి తుపాకులతో గుర్రాల మీద ఉన్నారు. పాటలు పాడుతూ, నినాదాలు చేస్తూ ముందుకి ఉరుకుతున్న మహిళలకి అడ్డంగా నిలబడ్డారు. పేద, అలగా జనం నిరసన అధికారులకి కోపం తెప్పించింది.
“షూట్” అని ఆర్డర్ వేశారు. కోసక్కులు కదల్లేదు. కళ్లెం గట్టిగా బిగించారు. గుర్రాలు అసహనంతో అరుస్తున్నాయి. ఒకరికొకరు “కాల్చకండి” అని సైగలు చేసుకున్నారు. కోసక్కులు అంటే కరుడు గట్టిన వాళ్లు. కానీ వాళ్లకీ ఇంట్లో ఒక తల్లి వుంది.
“ఫైర్” అధికారులు అరిచారు. కోసక్కులు తుపాకులు తీశారు. తూటాలు సర్దారు. ఆడవాళ్లలో భయం లేదు. మరణం అంటే లెక్కలేదు. ఆకలి, పేదరికంతో వాళ్లు ఎప్పుడో చచ్చిపోయారు. పోరాడితే కొత్తగా పోయేదేమీ లేదు.
“ఫైర్” అని మళ్లీ ఆదేశం. కోసక్కులు కాల్చేశారు. ఆడవాళ్లని కాదు, పై అధికారుల్ని.
రష్టా మహావిప్లవానికి, జార్ చక్రవర్తి పతనానికి ఇది తొలి అడుగు. చక్రవర్తి సౌధాన్ని ప్రజలు ఆక్రమించి సంబరాలు చేసుకున్నారని చదివినప్పుడు ఇది రచయితల అతిశయోక్తి లేదా కల్పన అనిపించేది.
అయితే శ్రీలంకలో మొన్న జరిగింది చూసి చరిత్ర రిపీట్ అయ్యిందనిపించింది. పోలీసులున్నారు. సైన్యం వుంది. ఏదో మొక్కుబడిగా జనాల్ని అడ్డుకున్నారు. తుపాకులు తీస్తే రక్తం పారేది. కానీ అది జరగలేదు. జరిగినా జనం ఆగేవాళ్లు కాదు.
నెలల తరబడి ఆకలి, ఆగ్రహం, నిరుద్యోగం ఇవన్నీ ఒక రకమైన ఉన్మాదాన్ని సృష్టించాయి. అధ్యక్షుడి నివాసం మీద దాడి చేశారు. నిజ జీవితంలో చేయలేనివన్నీ చేశారు. స్విమ్మింగ్ పూల్లో ఈదారు. జిమ్ చేశారు. భోజనాలు చేశారు. ఒక దేశ అధ్యక్షుడి ఇంట్లో సామాన్య ప్రజలు ఇవన్నీ చేయడం సాధ్యమా? విలాసాల్లో పడి జనాన్ని పట్టించుకోకపోతే ఏదైనా సాధ్యమే.
ప్రపంచీకరణ తర్వాత యువకుల్లో కెరీరిజం పెరిగింది. ధర్నాలు, ఆందోళనలు తగ్గిపోయాయి. రాజకీయ భావజాలం అంతరించిపోతోంది. ఇది చాలా మంది అభిప్రాయం. అయితే ఇది పూర్తిగా నిజం కాదని శ్రీలంక నిరూపించింది. జనం విసిగి వేసారితే దేన్నీ లెక్క చేయరు.
ప్రపంచంలోని పాలకులంతా శ్రీలంక నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమంటే ప్రజలు మంచి వాళ్లు. అంత సులభంగా మీ జోలికి రారు. భరిస్తారు. సహిస్తారు. పేదరికాన్ని తట్టుకుంటారు. ఆకలితో వుంటారు. ప్రభుత్వాల చేతకాని తనాన్ని కూడా తమ ఖర్మ అని సర్దుకుంటారు.
అయితే అతి పేదరికం ఆకలిలోకి నెడితే వెంటపడి తరుముతారు. శ్రీలంకలో జరుగుతున్నది ఇదే.
దీనికి పరిష్కారం కూడా అంత సులభం కాదు. కొత్తగా ఎవరొచ్చినా చేయగలిగింది ఏమీ లేదు. అప్పులిచ్చిన సంస్థలన్నీ రుణమాఫీ చేసి, వడ్డీ లేకుండా కొత్త అప్పులిస్తే తప్ప సంక్షోభం నుంచి శ్రీలంక బయటపడదు.
ప్రపంచమంతా కలిసి లాగితే తప్ప సింహళ ద్వీపం మునిగిపోకుండా ఒడ్డున పడదు.
జీఆర్ మహర్షి