సుప్రీంకోర్టులో కేసు గెలవడంతో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు రెచ్చిపోయారు. కేసు గెలిచిన ఆనందమో లేక ప్రభుత్వం తనను ఏమీ చేయలేకపోయిందన్న లెక్కలేని తనమో తెలియదు కానీ, ఆయన మాత్రం ఆవేశంతో ఊగిపోయారు. ఒక ఉన్నతాధికారిగా కాకుండా, రాజకీయ నాయకుడిలా మీడియాతో మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2020, ఫిబ్రవరి 8న ఏబీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆరు నెలలకోమారు సస్పెన్షన్ పొడిగిస్తూ వచ్చింది. ఆయన సస్పెన్షన్ ఇప్పటికి రెండేళ్ల రెండు నెలలు సాగింది. అయితే ఆయనపై ప్రభుత్వం చేసిన అభియోగాల సంగతేంటో ఎవరికీ తెలియదు. నిబంధనల ప్రకారం రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ కుదరదని, కావున తనకు ఉత్తర్వులు ఇవ్వాలని సీఎస్‌కు ఆయన ఇటీవల విన్నవించుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్‌ను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఇవాళ ఏబీ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. సస్పెన్షన్ కాలం పూర్తయినందున మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. ఈ సందర్భంగా ఏబీవీ మీడియాతో మాట్లాడుతూ చట్ట ప్రకారమే తాను పోరాటం చేశానన్నారు. ఏ బావ కళ్లల్లో ఆనందం కోసం, ఏ సైకో సంతోషం కోసం, ఏ శాడిస్ట్ కళ్లల్లో ఆనందం చూడటం కోసం తనను సస్పెండ్ చేశారని ఇదంతా జరిగేందుకు కారకులెవరని ఆయన ప్రశ్నించారు. సస్పెన్షన్‌ను ప్రశ్నించడమే తప్పా? అని ఏబీవీ నిలదీశారు.
తనకైన కోర్టు ఖర్చులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతానన్నారు. తన కేసు విషయమై ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. ఈ ఖర్చునంతా సంబంధిత అధికారుల నుంచి వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొనుగోలు అనేదే లేనప్పుడు అవినీతి ఎలా జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.
తనను, తన కుటుంబాన్ని క్షోభ పెట్టి ఏం సాధించారన్నారు. తాను లోకల్ అని, ఎవరినీ వదిలిపెట్టనని ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరించడం గమనార్హం. ఇంతకూ ఏబీవీ దృష్టిలో సైకో, శాడిస్ట్, బావ ఎవరో మరి!