ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సస్పెండ్ వేటు వేసింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సస్పెండ్‌కు గురి కావడం ఇది రెండోసారి. మొదటిసారి రెండేళ్లపాటు సస్పెన్షన్‌లోనే ఆయన కొనసాగారు. ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయనకు ప్రభుత్వం ప్రింటింగ్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చింది. ఇక ఆయన ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుందని భావించేలోపే, మరోసారి ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
గతంలో దేశ రక్షణశాఖ నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాలు కొనుగోలు చేశారని ఏబీవీపై కేసు నమోదైంది. కేంద్ర హోంశాఖ ఆమోదంతో ఆయన్ను 2020, మార్చి 7న సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కాలం రెండేళ్లు ముగియడంతో నిబంధనల ప్రకారం ఆయనపై నిర్ణీత శిక్షా కాలం గడువు ముగిసిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అయితే ఏబీవీపై విచారణను కొనసాగించొచ్చని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో అతి కష్టంమీద ఏబీవీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా ఏబీవీని నియమించింది. తనపై నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేసేందుకు ఏబీవీ ప్రయత్నిస్తున్నారనే సాకుతో ఆయనపై ప్రభుత్వం మరోసారి సస్పెండ్ వేటు వేయడం చర్చకు దారి తీసింది. దేశరక్షణకు సంబంధించి నిజంగా ఆయన అవినీతికి పాల్పడ్డారనే ఆధారాలుంటే ప్రభుత్వం శాశ్వతంగా ఆయనపై వేటు వేసేందుకు చర్యలు చేపట్టవచ్చు.
అయితే గతంలో చంద్రబాబు హయాంలో ఏబీవీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తమ పార్టీని అంతం చేసేందుకు పని చేశారని ఆ పార్టీ ఆగ్రహంగా ఉంది. కానీ రెండేళ్ల పాటు సస్పెండ్ చేసినా, మళ్లీమళ్లీ అలాంటి చర్యలకు దిగడం వల్ల తనపై జనంలో ఎలాంటి అభిప్రాయానికి దారి తీస్తుందో ప్రభుత్వం ఆలోచించాల్సి వుంది. అంతిమంగా ప్రభుత్వం కక్షపూరితంగా ఒక ఉన్నతాధికారిపై వేట సాగిస్తోందనే నెగెటివ్ సంకేతాలు వెళ్తాయనే సంగతిని విస్మరించకూడదు. ఈ దఫా ఏబీవీపై సస్పెన్షన్ వేటు ఎన్నాళ్లో మరి!