టాలీవుడ్ సెకండాఫ్ సీజన్ మొదలవుతోంది. మారుతి ‘పక్కా కమర్షియల్’ సినిమా బోణీ కొట్టబోతొంది. ఈ సినిమా ఓపెనింగ్స్, స్టడీ కలెక్షన్లు వంటి వ్యవహారం మీద టాలీవుడ్ జనాలు అంతా దృష్ఠి పెట్టి వున్నారు. ఎందుకంటే ఈ సినిమా అన్ని విధాలా కాంబినేషన్ సినిమా.
అల్లు అరవింద్, యువి క్రియేషన్స్ వంటి బ్యానర్లు, మారుతి లాంటి డైరక్టర్. గోపీచంద్ లాంటి మాస్ హీరో, రాశీఖన్నా, సోలో రిలీజ్. మాస్..ఫన్ జానర్. టికెట్ రేట్లు కూడా గతంలో మాదిరిగా 100 ప్లస్ జిఎస్టీ. పబ్లిసిటీకి లోపం లేదు. ఎంత చేయాలో, ఎంత వరకు చేయగలరో అంతా చేసారు.
ఇంతకన్నా ఏం కావాలి?
ఇప్పుడు కూడా ఓపెనింగ్ పడకపోతే సినిమాల భవిష్యత్ మీద అనుమానం పడాల్సిందే. మాట్నీ నుంచి ఎలా వుంటుందన్నది మౌత్ టాక్ మీద ఆధారపడి వుంటుంది. కానీ అసలు ముందు మార్నింగ్ షో కి టికెట్లు తెగాలి. అప్పుడే జూలై, ఆగస్ట్ ల్లో వరుసగా వున్న సినిమాలకు ఓ భరొసా వస్తుంది. అలా కాకుండా ఓపెనింగ్స్ పడలేదు అంటే మాత్రం టాలీవుడ్ కు నీరసం రావడం పక్కా.
మారుతున్న పరిస్థితులు అలా వున్నాయి. సినిమా థియేటర్లకు జనం రావడం తగ్గింది అనలేము. అలా అని వస్తున్నారు అని అనలేము. ప్రేక్షకులు మరీ సెలక్టివ్ గా సినిమాలకు వస్తున్నారు. ఈ సినిమా చూడాలి అని ముందే డిసైడ్ అయినట్లు, ఈ సినిమా థియేటర్లో అవసరం లేదులే అని ముందే ఫిక్సయినట్లు కనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. మళ్లీ అలా అని చిన్న..పెద్ద సినిమా అన్న పాయింట్ కూడా లేదు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అయినా, సిద్దు డిజె టిల్లు అయినా జనం ఫుల్ క్లారిటీతో వ్యవహరిస్తున్నారు.
అందువల్ల ఏ సినిమా తీయాలో? ఏది తీయకూడదో? అస్సలు టోటల్ అయోమయం వుంది టాలీవుడ్ లో. అలా అని నిర్మాణాలు అపేయలేదు. కానీ విడుదల విషయానికి వచ్చేసరికి కిందా మీదా అవుతున్నారు. పక్కా కమర్షియలకు కాస్త మంచి ఓపెనింగ్ పడితే, బ్యానర్, కాంబినేషన్, జానర్, పబ్లిసిటీ ఇలా ఓ ఫార్ములా మీద క్లారిటీ వస్తుంది.