వైసీపీలో ఇచ్చిన వాళ్లకే పదవులు ఇస్తూ కొత్త సంప్రదాయానికి తెరదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ జాబితాపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరికీ రెండు, మూడు పదవులు దేనికని ప్రశ్నిస్తున్నారు. పదవులు లేని వాళ్లకు అప్పగిస్తే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు.
కొత్త వాళ్లకు పదవులు కట్టబెట్టడం ద్వారా రానున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం దక్కేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శాప్‌చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి యువజన విభాగం అధ్యక్ష పదవి, ఎమ్మెల్సీ పోతుల సునీతకు మహిళా విభాగం, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బీసీ సెల్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు వాణిజ్య విభాగం, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు మైనార్టీ సెల్, ఎమ్మెల్సీ రుహుల్లాకు వైఎస్సార్ సేవాదళ్, అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) చైర్మన్ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డికి సోషల్ మీడియా, ఏపీ నైపుణ్యాభివృద్థి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డికి సోషల్ మీడియా, వైసీపీతో సంబంధం లేని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డికి టీచర్స్ ఫెడరేషన్ బాధ్యతలు అప్పగించారు. ఇంకా ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు పాత పదవులనే కొనసాగిస్తూ నియామకాలు చేపట్టడం విశేషం.
ఆల్రెడీ ఉన్న బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ మందిని కలుపుకునే పోయేలా పార్టీలో మరికొందరికి పదవులు ఇచ్చే అవకాశాన్ని చేజేతులా వైసీపీ జారవిడుచుకుంది.
జగన్ పేరుతో ముఖ్య నాయకులు తమకిష్టమైన నాయకులకు పదవులు కట్టబెట్టారనే విమర్శ పార్టీలో బలంగా ఉంది. ఈ పదవుల పందేరం పార్టీకి నష్టమో, లాభమో వైసీపీ పెద్దలు పునరాలోచన చేయాలి. ఎందుకంటే ఇంతకంటే సమర్థులైన నాయకులు పార్టీలో లేరా? అనే నిలదీత ఎదురౌతోంది.