విషయం తెలియకుండా రాస్తే ఇలానే ఉంటుంది. సూర్యకు ఆస్కార్ నుంచి పిలుపు వచ్చింది. ఇంతవరకు వాస్తవమే. అయితే అది ఎలాంటి ఆహ్వానం, ఎందుకొచ్చింది లాంటివి ఆలోచించకుండా ఇష్టమొచ్చినట్టు రాసేస్తోంది కోలీవుడ్ మీడియా. ఈ క్రమంలో ఆస్కార్ నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక సౌత్ నటుడు సూర్య అంటూ రాసేస్తోంది. మరి చిరంజీవి సంగతేంటి?
1987లోనే చిరంజీవికి ఆస్కార్ నుంచి ఆహ్వానం అందింది. అవార్డుల ఫంక్షన్ కు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించింది. సౌత్ నుంచి ఆహ్వానం అందుకున్న మొట్టమొదటి నటుడు చిరంజీవి. మరి సూర్య విషయంలో ఎందుకీ కన్ఫ్యూజన్?
అసలు మేటర్ ఇది..!
ఆస్కార్ ఆహ్వానితులు వేరు, ఆస్కార్ మెంబర్ షిప్ వేరు. చిరంజీవికి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ఆహ్వానం వచ్చింది. సూర్యకు మాత్రం ఆస్కార్ ఆర్గనైజర్స్ మెంబర్ షిప్ వచ్చింది. '2022 క్లాస్' పేరిట సినీ రంగంలోకి వివిధ విభాగాలకు చెందిన 397 మందికి మెంబర్ షిప్ ఇచ్చింది ఆస్కార్ కమిటీ. ఈ లిస్ట్ లో సూర్య పేరు కూడా ఉంది.
సౌత్ నుంచి ఆర్గనైజర్స్ మెంబర్ షిప్ అందుకున్న తొలి వ్యక్తిగ నిలిచాడు సూర్య. కానీ అవార్డుల ప్రదానోత్సవానికి ఆహ్వానం అందుకున్న తొలి సౌత్ స్టార్ మాత్రం చిరంజీవి. ఈ చిన్న తేడాను కోలీవుడ్ మీడియా గమనించలేకపోతోంది.
మెంబర్ షిప్ ఎలా వస్తుంది..?
ఆస్కార్ మెంబర్ షిప్ అప్లయ్ చేసుకుంటే వచ్చేది కాదు. ఆల్రెడీ కమిటీలో ఉన్న ఇద్దరు మెంబర్స్ సిఫార్స్ చేస్తే కొత్త ఏడాదికి గాను మెంబర్ షిప్ ఇస్తారు. ఇలా కాకుండా వేరే పద్ధతి కూడా ఉంది. ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన వ్యక్తులకు ఆటోమేటిగ్గా మెంబర్ షిప్ వస్తుంది. 2020లో ఈ ఆర్గనైజర్స్ మెంబర్ షిప్ లో కీలక మార్పుచేర్పులు కూడా చేశారు.
సమాజంలో అంతగా ప్రాతినిధ్యం దక్కని తెగలకు కూడా మెంబర్ షిప్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటు మహిళా కోటాను కూడా పెంచాలని నిర్ణయించుకున్నారు.
ఆస్కార్ అవార్డ్ అందుకున్న, అవార్డులకు నామినేట్ అయిన నటీనటులు, టెక్నీషియన్స్ కు ఆటోమేటిగ్గా మెంబర్ షిప్ వచ్చేస్తుంది. అలా 2022 క్లాస్ లో 15 మంది ఆస్కార్ విన్నర్స్, 71 మంది నామినీస్ కు చోటు దక్కింది. మిగతావాళ్లను పైన మనం చెప్పుకున్న పద్ధతుల్లో ఎన్నుకున్నారు.
తాజాగా ఎంపికైన వాళ్లలో 44 శాతం మంది మహిళలు కాగా, 37 శాతం మంది అంతగా ప్రాతినిధ్యం లేని కమ్యూనిటీలకు చెందిన వాళ్లు ఉన్నారు. లిస్ట్ లో అమెరికాకు చెందని వాళ్లు సూర్యతో కలిపి 53 మంది ఉన్నారు.