ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు వస్తే ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ (ఆర్కే)కు కడుపు మంట ఎందుకో అర్థం కావడం లేదు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 నిర్వహిస్తున్నారనే వార్తనే ఆయన తట్టుకోలేకపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెట్టే వాతావరణమే లేదని, అలాంటప్పుడు పారిశ్రామికవేత్తలు ఏ గుండె ధైర్యంతో వెళ్తారని ఆయన పత్రికలో కథనాన్ని వండివార్చారు. తీరా సమ్మిట్ మొదటి రోజే పెట్టుబడులు వెల్లువెత్తాయని తెలియగానే, అంతా ఉత్తుత్తిదే అని రాసుకుని తృప్తి పొందారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ పాలనలో ఏ ఒక్క మంచి పని జరగకూడదనే ఆర్కే దుర్మార్గ ఆలోచనను ఆ రాష్ట్ర ప్రజానీకం చీదరించుకుంటోంది. కనీసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా విమర్శలు చేయని పరిస్థితిలో, పచ్చ పత్రిక యజమాని ఆర్కే ఎందుకు ఓర్వలేని రాతలు రాస్తున్నారనేది చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని నష్టపరిచే తన దుష్ట జర్నలిజాన్ని అసహ్యించుకుంటారనే స్పృహ కూడా లేకుండా, నిత్యం అదే పంథాను కొనసాగించడం తీవ్ర విమర్శలపాలవుతోంది.
తాజాగా ఇవాళ ఆ కోవలో మరో కథనాన్ని సదరు పత్రిక వండివార్చింది. విశాఖ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఒప్పందాలు కుదుర్చుకున్న చిన్న సంస్థల గురించి హేళనగా రాయడంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా ఆర్కే జర్నలిజం మూలాలను నిలదీస్తున్నారు.
‘విజయనగరంలో కరోనా టైమ్‌లో ‘ఫిల్మీమోజీ’ అనే కామెడీ వెబ్‌చానల్ బాగా పాపులర్ అయింది. తామూ ఎంఓయూ చేసుకున్నామని ప్రకటించుకుంది.ఈ సంస్థ కోటి రూపాయలు పెట్టినా గొప్పే’
ఏబీఎన్ యూట్యూబ్ చానల్‌కు 50 లక్షల సబ్‌స్ర్కైబర్లుండగా, ఫిల్మీమోజీ కామెడీ చానల్‌కు దాదాపు 39 లక్షల సబ్‌స్ర్కైబర్లున్నారు. సదరు పత్రికలో రాసినట్టు కేవలం కరోనా సమయంలో ప్రారంభించి…ఈ మూడేళ్లలో ఆ చానల్ ఎదిగిన తీరు చూడొచ్చు. మరి ఆ కామెడీ చానల్ ఎదుగుదలతో పోలిస్తే తన చానల్‌కు ఆదరణ ఏ మాత్రమో ఆర్కే గ్రహించొచ్చు. ఇదే పత్రిక మరో ఉదాహరణ కూడా రాసుకొచ్చింది.
‘పలు టీవీ చానళ్లలో యాంకర్‌గా చేసే ఒక యువతి భర్త ఇప్పటికే కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విశాఖ సదస్సుకు వీరిద్దరూ వచ్చి ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. వివరాలు మాత్రం తెలియదు’…ఇలా సాగింది రాత. ఈ రాతలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన సృజనాత్మక రీతిలో ఘాటైన కౌంటర్లు ఇచ్చారు. ఆర్కే మూలాలు మరిచి, ఇష్టానురీతిలో అక్షర వంటకం చేశాడని మండిపడుతున్నారు.
ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్‌గా వేతనానికి పని చేస్తూ, ఆ పత్రిక కొనే స్థాయికి ఎలా ఎదిగావో చెప్పాలని ఆర్కేని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఫిల్మ్‌మోజీ డైరెక్టర్, అలాగే భర్తతో కలిసి యాంకర్ విశాఖ సమ్మిట్‌కు వెళ్లి ఒప్పందం కుదుర్చుకుంటే తప్పు పడుతున్న ఆర్కే… తాను మాత్రం చంద్రబాబుతో ఎంవోయూ కుదుర్చుకుని పత్రిక ప్రారంభించాడనే విమర్శపై ఎప్పుడైనా సమాధానం చెప్పారా? పైగా ఆ విమర్శలకు బలం కలిగించేలా చంద్రబాబుకు కొమ్ము కాయడం నిజం కాదా? అయినా ఏపీలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా పెట్టుబడులు పెడితే… ఆంధ్రజ్యోతికి, రాధాకృష్ణకు ఎందుకు తప్పుగా కనిపిస్తోందనే ప్రశ్న వెల్లువెత్తుతోంది.
‘చంద్రబాబు ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకొన్న అన్ని కంపెనీలు వెళ్ళిపోయాయని ఆర్తనాదాలు చేసావుగా? మరి వెళ్లిపోయిన వాళ్లు మళ్లీ వచ్చారా.. లేక చంద్రన్న కళ్లలో ఆనందం కోసమేనా ఈ రోత రాతలు’ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయినా తోలు మందం పచ్చ పత్రికకు ఇలాంటి విమర్శలు, నిలదీతలు ఓ లెక్కా?