సీనియర్ ఐపీఎస్ అధికారి సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ ఛీప్ ఏబీ వెంకటేశ్వరావుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయనను ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా నియమించింది. కాసేపట్లో ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు.
గతంలో కూడా సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత ఆయన ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా కొన్ని రోజుల పాటు పని చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి రిటైర్మెంట్ రోజు పోస్టింగ్‌తోనే రిటైర్ అవుతున్నారు. దీంతో టీడీపీ వర్గాలు అనందం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు హయాంలో నిఘా విభాగం అధికారిగా ఏబీ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వైసీపీ ఎమ్మెల్యేలు , ఎంపీల ఫోన్లను ట్యాప్ చేసేవారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు టీడీపీలో చేరడం వెనుక ఏబీ వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషించారని వైసీపీ ముఖ్య నేతల ఆరోపణ. అందుకే ఏబీవీపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నారు. బాబు హయాంలో నిఘా పరికరాల వ్యవహారం, ఇతరత్రా ఆరోపణలపై ఏబీపై జగన్ సర్కార్ కేసు నమోదు చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల నుంచి అతన్ని తప్పించి కేసు నమోదు చేసింది. అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. మొదటిసారి క్యాట్, కేంద్ర హోంశాఖ నుంచి ఆయనకు వ్యతిరేకత ఎదురైంది. అనంతరం కోర్టులో ఆయనకు ఊరట లభించింది.