మట్టిలో మాణిక్యాన్ని టాలీవుడ్ ఇంతకాలం గుర్తించలేదు. సిగ్గూఎగ్గూ లేకుండా కోనసీమ విధ్వంస సూత్రధారి వైసీపీనే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. ముమ్మాటికీ అమలాపురం అల్లర్లు ప్రభుత్వ స్పాన్సర్డ్ విధ్వంసమని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. అమలాపురం విధ్వంసం వెనుక ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన వున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకొచ్చారు.
ఈ విధ్వంసం వెనుక అధికార పార్టీ హస్తం వుందని చెప్పేందుకు అచ్చెన్నాయుడు అద్భుతమైన లాజిక్ చెప్పారు. మూడేళ్లుగా జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ తమ పార్టీ ఆందోళనలకు దిగితే, పోలీసులను అడ్డు పెట్టుకుని కనీసం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టనివ్వలేదన్నారు. అలాంటిది కోనసీమలో కొన్ని రోజులుగా యథేచ్ఛగా నిరసనలు జరుగుతున్నాయని, ప్రభుత్వం అణచివేత చర్యలు చేపట్టకపోవడమే నిదర్శనమని అచ్చెన్నాయుడు గొప్ప లాజిక్‌ను బయట పెట్టారు.
అంబేద్కర్ పేరుతో ప్రభుత్వమే ఆందోళనలు నిర్వహిస్తోందన్నారు. ఈ మొత్తం విధ్వంసానికి అసలు సూత్రధారి, పాత్రధారి అన్నం సాయి అనే వైసీపీ కార్యకర్తే అని చెప్పుకొచ్చారు. గతంలో మంత్రి విశ్వరూప్‌ను అన్నం సాయి సన్మానించారని, అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఫొటో దిగాడని మీడియా ప్రతినిధులకు చూపారు. ఒకవేళ టీడీపీ కార్యకర్త అయితే సజ్జల ఏ విధంగా ఫొటో దిగాడని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
ఈ విధ్వంసం వెనుక ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోతే, అమలాపురంలో 144 సెక్షన్ వుండగా వేలాది మంది ఎలా వచ్చారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మరో కీలక అంశాన్ని కూడా ఉదహరించారు. ఇటీవల దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ చంపి, తనే స్వయంగా ఇంటికెళ్లి డెడ్‌బాడీ అప్పగించాడన్నారు.
తమ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమించడం వల్ల వాస్తవాలు వెలుగులోకి వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు బాగా చెడ్డపేరు వచ్చిందన్నారు. దీని నుంచి బయట పడేందుకు కోనసీమ విధ్వంసానికి రూపకల్పన చేశారని ఆరోపించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న ప్రతి సందర్భంలోనూ జగన్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతారని తాను మొదటి నుంచి చెబుతున్నట్టు అచ్చెన్నాయుడు వివరించారు. ఇది మొదటి నుంచి వైఎస్ జగన్‌కు అలవాటే అన్నారు.
ఇంకా ఈ విధ్వంసం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హస్తం ఉందనేందుకు, ఆయన కుటుంబ నేరపూరిత చరిత్రే నిదర్శనమన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం పదవి కోసం హైదరాబాద్‌లో మతకల్లోలాలు సృష్టించి వందలాది మందిని ఊచకోత కోసినట్టు స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతే చెప్పాడన్నారు. అలాగే తన తండ్రి వైఎస్సార్ మృతి వెనుక రిలయన్స్ హస్తం వుందని విధ్వంసానికి తెగబడ్డారని గుర్తు చేశారు.
కోనసీమను విధ్వంసం చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అనేక అంశాల్ని ఉదహరిస్తూ కోనసీమలో విధ్వంసం వెనుక వైసీపీ ప్రభుత్వం ఉందని అచ్చెన్నాయుడు చెప్పిన తీరు సినిమా కథని తలపించింది. అందుకే టాలీవుడ్‌కి అద్భుతమైన రైటర్ దొరికాడని ప్రత్యర్థులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.